హైదరాబాద్, 31 డిసెంబర్ 2012: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కోసం రాష్ట్ర ప్రజలు సంతకంతో ఉద్యమించాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ పిలుపునిచ్చారు. ప్రభుత్వం, ప్రధాన విపక్షం కుమ్మక్కై తన కుమారుడు శ్రీ జగన్‌పై కుట్ర పన్నాయని ఆమె ఆరోపించారు. నిత్యం ప్రజల మధ్య ఉండే శ్రీ జగన్‌ను కుట్రలు, కుతంత్రాలతో వారికి దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్‌కు బెయిల్ రానివ్వకుండా అడ్డుకుంటున్న సిబిఐ వైఖరిని నిరసిస్తూ చేపట్టిన సంతకాల ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని రాష్ట్ర ప్రజలకు శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. నివేదనతో పాటు ఈ కోటి సంతకాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందజేస్తామని ఆమె తెలిపారు.
తమ కుటుంబాన్ని మీ కుటుంబంగా ప్రేమించే ప్రతి హృదయానికి ముందుగా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నానంటూ శ్రీమతి విజయమ్మ తన విజ్ఞప్తిని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు శ్రీ జగన్ కోసం జనం సంతకాల ఉద్యమం కొనసాగుతోందన్నారు. కుట్రలు, కుతంత్రాలు, నీతిమాలిన అభియోగాలతో జగన్‌బాబును మనందరి నుంచి దూరం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని ప్రభుత్వం, పనికిమాలిన ప్రతిపక్షం కుమ్మక్కై నెలలో 25 రోజులు ప్రజల మధ్యే ఉండే జగన్‌బాబును మోసపూరితంగా, కిరాతకంగా జైలు పాలు చేశారని విచారం వ్యక్తం చేశారు. జగన్‌బాబును జైలులో పెట్టి 2012 డిసెంబర్ 31 నాటికి 219 రోజులైందని ఆమె అన్నారు.
ప్రాణం పోయేంత వరకూ ఆయన జీవితాన్ని, పదవిని ప్రజల కోసమే అంకితం చేసిన తన భర్త మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిగారిని, మీ గుండెల్లో పచ్చబొట్టుగా ఉన్న ఆయనను దూరం చేసేందుకు ఎన్నో కుట్రలు చేస్తున్నారని శ్రీమతి విజయమ్మ విచారం వ్యక్తంచేశారు. ఏమి మాట్లాడినా, ఏమి చేసినా జవాబు చెప్పుకోలేరనే మహానేతపై ఎఫ్‌ఐఆర్‌లో దోషిగా పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
బెయిల్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, 90 రోజులకు ఇవ్వాలనే రూలు అని విజయమ్మ గుర్తు చేశారు. అయితే, చార్జిషీట్ల మీద చార్జిషీట్లు పెడుతూ, 17 నెలలైనా విచారణ పూర్తి కాలేదంటూ, సాక్షులను జగన్‌బాబు ప్రభావితం చేస్తారంటూ అడ్డుకుంటున్న సిబిఐకి నిరసనగా 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో పాల్గొనాలని విజయమ్మ పేరుపేరునా అభ్యర్థించారు. 'రండి... జగన్ కోసం.. జనం సంతకం'తో ఉద్యమించండి' అని రాష్ట్ర ప్రజలకు ఆమె పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం అందరికీ అందాలని, గడప గడపకూ అవి చేరాలని మీ కోసం రాజశేఖరరెడ్డిగారు ఎన్నో సంతకాలు చేశారని శ్రీమతి విజయమ్మ తెలిపారు. మీ మనవడిగా, మీ కొడుకుగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా జగన్‌బాబు భావించి మీరు సంతకం చేయండి అని గద్గధ స్వరంతో విజ్క్షప్తి చేశారు. 'ఒక్క సంతకం, తొలి సంతకం మీ సంతకం చేయండి జగన్‌బాబు కోసం. ప్రజా కోర్టులో జగన్‌బాబు నిర్దోషి అని మీ సంతకం చెప్పాలని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నాను'. 'మీ సంతకం జగన్‌బాబుకు జైలు గోడల నుంచి, ఈ కుట్రలు, కుతంత్రాల నుంచి విముక్తి కలిగిస్తుందని నా నమ్మకం'. అన్నారు. తన భర్తను పోగొట్టుకున్న, కొడుకును దూరం చేసుకున్న తనకు ప్రజల సంతకం కొండంత బలాన్ని ఇస్తుందని నమ్ముతున్నానని శ్రీమతి విజయమ్మ సవినయంగా విన్నవించారు.
మీరు, మీ కుటుంబంతో, మీ శ్రేయోభిలాషులు, సన్నిహితులు, బంధువులతో జగన్ కోసం.. జనం సంతకం పెట్టించాలని శ్రీమతి విజయమ్మ విజ్ఞప్తి చేశారు. జరుగుతున్న అన్యాయానికి మీ కలంతో జవాబు చెప్పండని పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో మీ సంతకం తిరుగులేని విజయంగా ఉండాలని ఆ దేవదేవుడిని కోరుకుంటూ ఓ అమ్మగా రాష్ట్ర ప్రజలను విజ్ఞప్తిచేస్తున్నానని తెలిపారు. ప్రజలంతా ప్రేమతో, అభిమానంతో పెట్టే సంతకాలను ఒక అర్జీతో కలిపి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి అందించి జగన్‌బాబును బయటికి తెచ్చుకుందామని విజయమ్మ పేర్కొన్నారు.