జగన్ బెయిలుపై తీర్పు 24కు వాయిదా

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి శ్రీ వైయస్ జగన్మోహన రెడ్డి దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. మంగళవారం ఉదయం ప్రారంభమైన వాదనలు మధ్యాహ్నం భోజన విరామానంతరం ముగిశాయి. ఈ కేసులో తీర్పును ఈ నెల 24వ తేదీకి వాయిదా కోర్టు వేసింది. భోజనవిరామం తర్వాత జగన్ తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి, సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ అశోక్ భాను వాదనలు వినిపించారు.

       అన్ని అంశాలకు సంబంధించి జగన్ను రిమాండ్లోకి తీసుకున్నారని నిరంజన్ కోర్టుకు తెలిపారు.  దాఖలుచేసిన ఛార్జిషీటుకు సంబంధించి మాత్రమే రిమాండ్లోకి తీసుకోలేదన్నారు. వీలైనంత త్వరలో దర్యాప్తు పూర్తిచేస్తామని సీబీఐ సుప్రీం కోర్టుకు చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీబీఐ ప్రస్తుతం చెబుతున్న ప్రకారం దర్యాప్తు ముగింపునకు అంతం ఎక్కడో తెలియడం లేదని నిరంజన్ చెప్పారు. ఎంతకాలం అంటే అంతకాలం శ్రీ జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచుతారా? అని ప్రశ్నించారు. 90 రోజులకు మించి ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుణ్ణి కస్టడీలో ఉంచకూడదని ఆయన పేర్కొన్నారు.

     అంతకు ముందు సీబీఐ తన వాదనలో 'దర్యాప్తునకు ప్రభుత్వం సహకరించడం లేద'ని హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తిచేయడానికి సమయం పడుతుందని వివరించింది. దర్యాప్తు ఎంతకాలం పడుతుంది? ఎన్నేళ్లు పడుతుంది? అని హైకోర్టు సీబీఐని ఘాటుగా ప్రశ్నించింది. ప్రభుత్వ సహకారం అందనందున దర్యాప్తు  పూర్తిచేయడం కష్టంగా ఉందని సీబీఐ తెలిపింది.  ఈ విషయాన్ని చెప్పడానికి తాము సంకోచించడంలేదని సిబిఐ హైకోర్టుకు తెలిపింది.  తొలుత గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కేసు పురోగతిని వివరించే నివేదికను సీబీఐ సీల్డు కవర్‌లో న్యాయమూర్తికి అందజేసింది.

Back to Top