జగనన్న పాలనలో పల్లెల్లో సారాకు చెక్‌!

కానూరు (ప.గో.జిల్లా) :

‘సారా మహమ్మారి కారణంగా సర్వనాశనమైపోయాం. ఇంటి ముందే బెల్టు దుకాణాలు.. పెట్టొద్దు.. పెట్టొద్దని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదండీ.. లారీ డ్రైవర్‌గా పనిచేసిన నా భర్త వీర్రాజు తాగుడుకు అలవాటు పడ్డాడండీ. తాగిన మత్తులో ఎన్నిసార్లు కొట్టాడో, ఎట్లాంటి దెబ్బలు తిని భరించానో ఆ దేవునికే తెలుసండీ. నాకు తెలవకుండానే ఎక్కడపడితే అక్కడ అప్పులు చేసి తాగాడు.. అప్పులోళ్లు వచ్చి ఇంటి ముందట కూచుంటే ఉన్న ఎకరం భూమి, ఇల్లు అమ్మి అప్పులు కట్టాను.‌ తాగుడు కారణంగా లివర్ చెడిపోయి 20 రోజుల కిందటే చనిపోయాడు. నా చిన్న పిల్లలను ఎలా బతికించుకోవాలమ్మా. నా గ్రహచారం ఇట్టా ఉందంటే నా అన్న కూడా తాగుడుకు బానిసైపోయాడు. ఆయన కూడా ఇవాళో... రేపో అన్నట్టు ఉన్నాడు. మా వదినకు నా మాదిరిగానే ఇద్దరు పిల్లలు. వాళ్ల భవిష్యత్తు ఏమి కావాలండీ’ అంటూ శ్రీమతి షర్మిల ముందు కానూరుకు చెందిన వెంకటేశ్వరమ్మ ఆవేదన వ్యక్తంచేసింది.

 ఇది ఒక్క వెంకటేశ్వరమ్మ ఆవేదనే కాదు.. కప్పల పుష్ప, జయలలిత, జక్కరి సుందరమ్మ, రామాయమ్మ.. ఇలా సుమారు 50 సారా, లిక్కర్ బాధిత కుటుంబాలు పెరవలి మండలం నడిపల్లికోట వద్ద శ్రీమతి ‌షర్మిలను కలిసి, గోడు చెప్పుకుని బాధపడ్డాయి. ‘వద్దమ్మా.. మా పల్లెల్లో సారా, విస్కీ, బీరు ఏదీ వద్దు. ఈ బెల్టు దుకాణాలు తీసేయించండి’ అని వేడుకున్నారు. వారి గోడు విని.. శ్రీమతి షర్మిల చలించిపోయారు. జగనన్న సిఎం కాగానే.. పల్లెల్లో నాటుసారా, బెల్టు దుకాణాలు ఉండనే ఉండవంటూ హామీ ఇచ్చారు. ‘సారాతో కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోయిన ఈ అక్కను చూస్తేనే గుండె తరుక్కుపోతోందన్నారు.

రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పల్లెల్లో నాటు సారా, బెల్టు దుకాణాలు ఉండనే ఉండవు. గ్రామాల్లోకి నాటుసారా, అక్రమంగా మద్యం సరఫరా కాకుండా ఉండేందుకు ప్రతి గ్రామంలో ఆడ పోలీసులను కాపలాగా పెడతాం’ అని‌ శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న ‌టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీరుకు నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సాగింది. ఈ సందర్భంగా ఆమె చంద్రబాబునాయుడు తీరుపై మండిపడ్డారు.

బెల్టుషాపుల పాపం చంద్రబాబుదే :
‘మద్యం ధరలు బాగా పెరిగిపోయాయని చంద్రబాబు నాయుడు చాలా బాధపడుతున్నారు. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధం ఎత్తేసి చంద్రబాబు ఎక్కడ చూసినా బెల్టు‌ దుకాణాలు పెట్టించారు. ఈ రోజు గ్రామాల్లో బెల్టు దుకాణాలు ఇంతగా వెలిశాయి అంటే ఆ పాపం చంద్రబాబు నాయుడిదే. పాదయాత్రలో ప్రజల కష్టాలు స్వయంగా చూసిన ఆయన ఇప్పుడేమో తాను సిఎం అయితే మద్యం ధరలు తగ్గించి, సరసమైన ధరలకే అమ్ముతామని వాగ్దానం చేశారు. ఈ విధంగా తక్కువ ధరకు ఎక్కువ మద్యం తాగొచ్చని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఇంకా ఎక్కువ సంసారాలను కూలగొడతారన్నమాట. ఇలాంటి వ్యక్తి ఏ రకం నాయకుడో నాకు అర్థం కావడం లేదు.

'ఇప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారు. మొన్నటికి మొన్న తెనాలిలో తాగిన మైకంలో ఒక అమ్మాయిని దుండగులు వేధిస్తుంటే.. అడ్డుకోబోయిన తల్లిని లారీ కింద తోసి చంపేశారు. విచిత్రం.. విడ్డూరం ఏమిటంటే ఏ తెనాలిలో ఈ సంఘటన జరిగిందో అదే తెనాలిలో ఇప్పటికీ బెల్టుదుకాణాలు, మద్యం దుకాణాలు రాత్రీ పగలూ తేడా లేకుండా నడుస్తున్నాయి. ప్రభుత్వం టార్గెట్లు పెట్టి మరీ ప్రజలతో తాగిస్తోంద'ని శ్రీమతి షర్మిల నిప్పులు చెరిగారు.

'చంద్రబాబు మద్యం నిషేధం ఎత్తివేసి.. వీధికో బెల్టు దుకాణం పెట్టి మద్యం అమ్మిస్తే.... ఈ సర్కారు గత నెల కంటే.. ఈ నెల 15 శాతం అదనంగా ప్రజలతో మద్యం తాగించండంటూ టార్గెట్లు పెడుతుంది. ప్రధాన ప్రతిపక్షం నాయకుడుగా చంద్రబాబు ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకొని నిలదీయాల్సి ఉంది. కానీ అవి ఏవీ పట్టించుకోకుండా ఈ కాంగ్రె‌స్ పార్టీకి అమ్ముడుపోయారు. ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసానికి మద్దతు పలకొద్దని ఆయన పార్టీ ఎమ్మెల్యేలకు వి‌ప్ జారీ చేసి, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడారు అంటే ఈ చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడు కాకుంటే మరి ఏమవుతారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కూలిపోకుండా ఎందుకు కాపాడారు చంద్రబాబు అని ప్రజలు అడిగితే.. ఈ రోజు కూడా ఆయన దగ్గర నుంచి సమాధానం లేదు’‌.

 2194.7 కిలోమీటర్లు పూర్తయిన షర్మిల పాదయాత్ర :
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శనివారం 166వ రోజు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం కేంద్రం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నిడదవోలు నియోజకవర్గంలోని పాలంగి, ఉండ్రాజవరం, మోర్త, నడిపల్లికోట, కానూరు క్రాస్‌ రోడ్డు మీదుగా శ్రీమతి షర్మిల మునిపల్లి వచ్చారు. మునిపల్లి శివారులోని బసకు రాత్రి 8 గంటలకు చేరుకున్నారు.

శ్రీమతి షర్మిల శనివారంనాడు మొత్తం 14.5 కిలోమీటర్లు నడిచారు. 166వ రోజు షెడ్యూల్‌ ముగిసేసరికి మొత్తం 2194.7 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎమ్మెల్యే పెండ్యాల కృష్ణబాబు, స్థానిక నాయకులు బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజీవ్ కృష్ణ, చీర్ల రాధయ్య, చిట్టూరి నరేంద్ర, విడివాడ రామచంద‌ర్‌రావు తదితరులున్నారు.

Back to Top