ఏకపక్ష నిర్ణయం ఎలా చేస్తారు?

హైదరాబాద్, 3 ఆగస్టు 2013:

పాలకులు సమర్థవంతులు కాకపోతే ప్రజలకు ఎన్ని కష్టాలు వస్తాయనే ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని వైయస్ఆర్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సమర్థులైన నాయకులు లేని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రాన్ని అథోగతి పాలు చేసిందని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి బతికి ఉంటే ‌మన రాష్ట్ర ప్రజలకు ఇలాంటి దుస్థితి వచ్చి ఉండేది కాదని ఆమె పేర్కొన్నారు. ఒక్క నాయకుడు వైయస్ఆర్‌ లేకపోవడం వల్ల ఈ నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రజలు ఎన్నో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మహానేత వైయస్ఆర్‌ ఐదేళ్ళ పాటు అన్ని ప్రాంతాల ప్రజలను సమానంగా చూసుకుంటూ ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా పరిపాలన కొనసాగించారని గుర్తుచేశారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్, టిడిపిలు అనేక ఇబ్బందులపాలు చేస్తున్నాయని ఆరోపించారు.

మూడు ప్రాంతాల ప్రజలూ కలిసి అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ నగరంపై ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని శోభా నాగిరెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానాన్ని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఏ ప్రాంతం వారు ఉన్నా హైదరాబాద్‌ నగరాన్ని అభివృద్ధి చేసిన సంగతిని ఆమె గుర్తు చేశారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు భరోసాతోనే కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని శోభా నాగిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు అవకాశవాద రాజకీయాలకు రాష్ట విభజన ఓ ఉదాహరణ అని ఆమె వ్యాఖ్యానించారు. లక్షలాది మంది ఉద్యోగుల భవిష్యత్ గురించి ఎందుకు ఆలోచించలేదని బాబును ఆ‌మె ప్రశ్నించారు. రాష్ట్ర విభజన అంశంపై మాట్లాడకుండా సీమాంధ్ర టిడిపి నాయకుల గొంతును చంద్రబాబు నొక్కుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు భయపడి కాంగ్రెస్ - టిడిపిలు రాజీనామా నాటకాలు ఆడుతున్నాయని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు.

రాష్ట్ర విభజన అంశంపై కాంగ్రెస్ అధిష్టానాన్ని గట్టిగా ప్రశ్నించే పరిస్థితి రాష్ట్ర నాయకులలో లేదని‌ శోభా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ వైఖరితో విభజించు పాలించు అన్న బ్రిటి‌ష్ సిద్ధాంతాన్ని గుర్తుకు తె‌స్తోందని ఆమె దుయ్యబట్టారు. సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండడానికి వీల్లేదని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శుక్రవారం చేసిన ప్రకటనలకు కాంగ్రె‌స్ పార్టీనే అవకాశం ఇచ్చిందని తెలిపారు.‌ కేవలం 15, 16 మంది ఎం.పి.ల కోసం, రాహుల్‌ గాంధీని ప్రధాని చేసుకోవడానికి ఆంధ్ర రాష్ట్రానికి ఇంత తీరని అన్యాయం చేస్తారా అని ఆమె ప్రశ్నించారు. భవిష్యత్తులో రాజధాని గురించి ఇరు ప్రాంతాల వారూ ఘర్షణ పడే పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీల‌ వల్లే రాష్టంలో ఇలాంటి ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయని శోభా నాగిరెడ్డి తెలిపారు.

కాంగ్రెస్‌ విధానాలు, ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఎలా ప్రతిస్పందించాలో కూడా ప్రజలకు అర్థం కావడంలేదని భూమా శోభా నాగిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. వారిని చూసి ఒకపక్క ఆశ్చర్యపోతూనే మరో పక్క అసహ్యించుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వచ్చాక కాంగ్రెస్‌ నాయకుల రాజీనామాలు చేసి తామేదో గొప్ప ఘనకార్యం సాధించినట్లుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన నిర్ణయం తీసుకోక ముందు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ‌ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పడే పార్టీలకు అతీతంగా అందరూ స్పందించాలని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులను తాము డిమాండ్‌ చేశామని గుర్తుచేశారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను సోనియా గాంధీ ఇవ్వబోతున్నారన్న స్పష్టమైన సంకేతాలు సామాన్య ప్రజలకు కూడా అందాయని అయినా వారు స్పందించలేదని దుయ్యబట్టారు.

అన్ని ప్రాంతాలకూ సమన్యాయం జరిగేలా కేంద్రంపై వత్తిడి తీసుకువద్దామని లేకపోతే భావి తరాలు క్షమించరని తాము ‌సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి నాయకులను కోరామని శోభా నాగిరెడ్డి చెప్పారు. కానీ ఆ రోజు ఏ ఒక్కరూ ముందుకు రాలేదన్నారు. తెలంగాణపై నిర్ణయించే రోజు కాంగ్రెస్‌ నాయులు ఢిల్లీలో చేసిన హడావుడిని చూస్తే సోనియా గాంధీని ఎదిరించి అయినా ఏదో చేయబోతారన్నంతగా డ్రామాలు ఆడారని విమర్శించారు. సీమాంధ్రకు ఏ విధంగా న్యాయం చేస్తారని అడగలేని దౌర్భాగ్య స్థితిలో సీమాంధ్ర నాయకులున్నారని విచారం వ్యక్తంచేశారు. విభజన నిర్ణయం వచ్చిన తరువాత వారు తమ తమ ప్రాంతాల్లోని ప్రజలు వారిని తిరగనివ్వకుండా అడ్డుకుంటున్నారు, ఉద్యమిస్తున్నారు గనుక రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని తూర్పారపట్టారు.

అధికాంగ్రెస్‌ పార్టీ ఎంత నిస్సత్తువగా ఉంటే అంతకన్నా దౌర్భాగ్యమైన స్థితిలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి కూడా కూరుకుపోయిందని శోభా నాగిరెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణను ఇస్తున్నట్లు ఢిల్లీ నుంచి లీకుల మీద లీకులు వచ్చినా కూడా చంద్రబాబునాయుడు చాలా కూల్‌గా ఉన్నారని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఎక్కడా పోషించలేదని నిప్పులు చెరిగారు. ఈ విషయంలో తాను నోరెత్తకపోగా, రెండు ప్రాంతాల్లోనూ రాజకీయంగా లబ్ధి పొందవచ్చని చెప్పి తన పార్టీ నాయకులెవ్వరూ మాట్లాడవద్దని హుకుం జారీ చేసిన వైనంపై శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిర్ణయం ప్రకటించిన తరువాత చంద్రబాబు ప్రెస్‌మీట్‌ పెట్టి ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగర నిర్మాణానికి 4 నుంచి 5 లక్షల కోట్లు అవసరమవుతాయంటూ చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన భరోసా వల్లే సీమాంధ్రుల మనోభావాలను ఏమాత్రం లెక్కల్లోకి తీసుకోకుండా కేంద్రం తెలంగాణ నిర్ణయం చేసిందని ఆమె దుయ్యబట్టారు. సీమాంధ్రులకు చంద్రబాబు ఇప్పుడేమి సమాధానం చెబుతారని శోభా నాగిరెడ్డి ప్రశ్నించారు.

ప్రజా ఉద్యమాలకు భయపడి కాంగ్రెస్, టిడిపి నాయకులు రాజీనామా డ్రామాలాడుతూ.. విభజనకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేయడమేమిటని శోభా నాగిరెడ్డి ఖండించారు. ఇరు ప్రాంతాల మధ్య సమన్యాయం జరగాలన్న ‌స్పష్టమైన డిమాండ్‌ పెట్టింది శ్రీ జగన్మోహన్‌రెడ్డి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయే అని ఆమె తెలిపారు. తెలంగాణపై నిర్ణయం రాక ముందే పార్టీ తరఫున ఈ అంశంపై లేఖ రాశామన్నారు. సీమాంధ్రుల సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణకు తమ పార్టీ కట్టుబడి ఉందని, ఒక బ్లాంక్‌ చెక్‌ ఇచ్చిన మాదిరిగా చంద్రబాబు నాయుడు ప్రణబ్‌ ముఖర్జీకి లేఖ పంపించారని నిప్పులు చెరిగారు.

సీమాంధ్రకు కర్నూలో, గుంటూరో, ప్రకాశంలోనో బ్రహ్మాండమైన రాజధానిని ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్‌ చెబుతున్న మాటలపై శోభా నాగిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విభజించి పాలించు విధానంలో వెళుతున్న ఆయన సీమాంధ్రులకు భిక్ష వేస్తున్నారా? అని నిలదీశారు. రాజధాని కోసం సీమాంధ్రుల మళ్ళీ కొట్టుకుని చావండి అని దిగ్విజయ్‌ సింగ్‌ మరో కొత్త మంటను లేపుతున్నారని దుయ్యబట్టారు. ఇంత నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే హక్కు కాంగ్రెస్‌ నాయకులకు ఎవరిచ్చారని ఆమె ప్రశ్నించారు. ఏ రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్‌ పార్టీ ఇంత దారుణానికి ఒడికట్టిందో ఆ లబ్ధి రెండు ప్రాంతాల్లోనూ పొందలేదని శోభా నాగిరెడ్డి హెచ్చరించారు. అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచిన తరువాత మాత్రమే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని కేంద్రాన్ని శోభా నాగిరెడ్డి డిమాండ్‌ చేశారు.

Back to Top