అసెంబ్లీ వీడియో బయటకు ఎలా వచ్చింది..?

అమరావతి : స్పీకర్‌కు తెలియకుండా, ఆయనకు సమాచారం లేకుండా అసెంబ్లీ వీడియో అసలు బయటకు ఎలా వచ్చిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన సస్పెన్షన్ గురించి మంత్రి యనమల రామకృష్ణుడు ఇచ్చిన లీకులపై ప్రస్తావించారు. అసలు తానెందుకు క్షమాపణ చెప్పాలని.. తాను చేశానంటున్న వ్యాఖ్యల ఫుటేజిని స్పీకర్‌కు తెలియకుండా మీడియాకు లీక్ చేసిన కాల్వ శ్రీనివాసులుపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. దాన్ని పట్టించుకోకుండా ఆ లీకేజి వీడియోల ఆధారంగా తనపై చర్యలు ఎలా తీసుకుంటారని అడిగారు.

అలాగే వైయస్ జగన్ మోహన్ రెడ్డిని దూషించినవారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదని కూడా నిలదీశారు. గతంలో తాను మాట్లాడిన అంశాలన్నింటినీ అక్కడక్కడ కట్ చేసి, దాన్ని ఒక వీడియోగా తయారుచేసి విడుదల చేశారని ఆమె చెప్పారు. అలా కాకుండా పూర్తి వీడియోను విడుదల చేయాలని, అప్పుడు నిజానిజాలేంటో ప్రజలకు తెలుస్తాయని అన్నారు. అలాగైతే తాను రెండేళ్లు కాదు.. మూడేళ్లయినా సస్పెన్షన్‌కు సిద్ధమని తెలిపారు. తన పోరాటం అంతా మహిళల ఆత్మగౌరవం కోసమేనని అన్నారు.
Back to Top