అనుమతులు లేకుండా శంకుస్థాపనలేల?అపెక్స్ కౌన్సిల్నైనా సంప్రదించారా..కోస్తా, రాయలసీమను ఎండగడతారా...తెలంగాణ సర్కారు చర్యలతో వైషమ్యాలువైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన రాష్ట్రాలు నీటి ప్రాజెక్టులు నిర్మించుకోవటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు. అయితే, కేటాయింపులు లేకుండా, మిగులు జలాలు కూడా లేకుండా, పై ప్రాంతాన్ని-కింది ప్రాంతాన్ని కూడా నష్ట పరచే విధంగా, ఏకపక్షంగా ప్రాజెక్టు నిర్మించటానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల కోసం కనీసం దరఖాస్తు కూడా చేయకుండా, ఎలాంటి అనుమతులూ రాకుండా నిన్న తెలంగాణ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు కృష్ణా వాటర్ బోర్డు అనుమతి లేదు. కేంద్ర జల సంఘం అనుమతి లేదు. విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల మంత్రి ఆధ్వర్యంలో ఒక ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటయింది. దాని అనుమతి కూడా లేదు. ఏ అనుమతులూ లేకుండా ఏకంగా 90 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి తోడుకుంటాం అని ప్రాజెక్టును ప్రకటించి శంకుస్థాపన చేయటం అక్రమమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. కృష్ణా నదిలో తెలంగాణకు కేటాయించిన జలాల్లో 90 టిఎంసీలు ఉన్నాయా? పోనీ మిగులు జలాల్లో ఉన్నాయా? ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనకు కృష్ణా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం అర్హత ఉన్న నీటిని పూర్తిగా ఉపయోగించుకుంటోంది. అదనపు జలాలు లేదా మిగులు జలాలు అంటూ ఏవీ లేని పరిస్థితి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తర్వాత ఏర్పడింది. బ్రిజేష్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా పంచేసింది. ఆ ట్రిబ్యునల్ అవార్డు ఈరోజు కాకపోయినా, రేపు అయినా అమలులోకి వస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో ఏకంగా 90 టిఎంసీల నీటిని వాడుకుంటాం అని ప్రాజెక్టుకు శంఖుస్థాపన చేయటం అంటే ఇది ప్రాంతీయ విభేదాలను, రాష్ట్రాల మధ్య విభేదాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకొనే రాజకీయమే తప్ప మరొకటి కాదు. ఇప్పటికే కర్ణాటక నుంచి కిందికి వచ్చే జలాలు రావటం లేదు. ఆలమట్టి, నారాయణపూర్, ఇతరత్రా వారు 2005లోపు కట్టుకున్న రిజర్వాయర్ల కారణంగా ఏపీకి చుక్క నీరు అందే పరిస్థితి లేదు. వరద వచ్చే సంవత్సరాలు కూడా తగ్గిపోయాయి. ఆ సంవత్సరాలలో కూడా శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరు అందే పరిస్థితులే కనపడటం లేదు. రాయలసీమకు ఇవ్వాల్సిన యష్యూర్డ్ వాటర్ రావటం లేదు. ఈ నేపథ్యంలో శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి మరో 90 టిఎంసీలు ఎక్కడ నుంచి లభిస్తాయి? తెలంగాణ ప్రభుత్వం ఏ అనుమతులతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళితే న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఉంది. ఏపీ సర్కారు తన అధిపతి నిలువెత్తు కుంభకోణాల్లో మునిగిపోవటం మీద కాకుండా రాష్ట్ర ప్రయోజనాలు మునిగిపోవటం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు నీరు ఎలా ఇవ్వాలి అన్న ఆలోచన చేసుకోవటంలో తప్పు లేదు. కానీ రాయలసీమను, కోస్తా ప్రాంతాన్ని ఎండగట్టి అనుమతులు లేని, నీరే లేని పరిస్థితుల్లో కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రాజెక్టులు ప్రారంభించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.