హైకోర్టు తీర్పు స్పీకర్‌ కోడెల విధానాలకు చెంపపెట్టు

గుంటూరు(నరసరావుపేట):  న్యాయవాది నల్లపాటి లక్ష్మీనారాయణ అపార్టుమెంటు విషయంలో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, ఆయన కుమారుడికి చెంపపెట్టులాంటిదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పేర్కొన్నారు. అపార్టుమెంట్‌ విషయంలో కోర్టు క్రరుకాల్చి వాత పెట్టిందని ఎద్దేవా చేశారు. నరసరావుపేటలోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడులతోకలిసి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడారు. స్పీకర్‌ కోడెల, ఆయన కుమారుడు ఆదేశాల మేరకే స్థానిక మున్సిపల్‌ కమిషనర్‌ అన్యాయంగా, అక్రమంగా లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న అపార్టుమెంట్‌ను పగులకొట్టించారన్నారు. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకొని నిర్మిస్తున్న అపార్టుమెంట్‌ను రాజకీయ కక్షలను పురస్కరించుకొని పగులకొట్టించటం చాలా బాధాకరం అన్నారు. అప్పటికప్పుడు ఇచ్చిన డిమాలిషన్‌ నోటీసును సస్పెండ్‌ చేస్తూ అపార్టుమెంట్‌ నిర్మాణం కొనసాగించవచ్చని చెప్పిందన్నారు. ఇది అధికారుల వ్యవహారశైలిని తప్పుపట్టినట్లుగా తాను భావిస్తున్నానని చెప్పారు. స్పీకర్‌ కోడెల, ఆయన కుమారుడు, కుమార్తె శాశ్వతంకాదని, తామే శాశ్వతమనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలన్నారు. 

అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కమిషనర్‌ః ఎమ్మెల్యే గోపిరెడ్డి 
మున్సిపల్‌ కమిషనర్‌ అధికార పార్టీకి పూర్తిగా తొత్తుగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. అపార్టుమెంట్‌ నిర్మాణానికి ప్లాను అనుమతి వచ్చిన తర్వాత అభ్యంతరాలు ఉంటే ఐదు ప్లోర్లు నిర్మాణం జరిగేంతవరకు కమిషనర్‌ ఎమిచేస్తున్నాడని ప్రశ్నించారు మొదట తానిచ్చిన రెండు నోటీసులపై కోర్టులో విఫలమైన తర్వాత మళ్ళీ మూడో నోటీసు రిజిష్టర్‌ పోస్టు ద్వారా పంపానని కమిషనర్‌ చెబుతున్నాడని, ఆ నోటీసు తనకు అందలేదని యజమాని లక్ష్మీనారాయణ చెప్పాడన్నారు. తాము విచారించగా ఆ నోటీసు యాక్సిస్‌ బ్యాంకుకు వెళ్ళిందని తేలిందన్నారు. కావాలని బిల్డింగ్‌ పడగొట్టేందుకు కమిషనర్‌ యజమానికి నోటీసు అందనీయకుండా చేశాడనేది అర్ధమౌతుందన్నారు. ప్రభుత్వం ఆన్‌లైన్‌ ప్లానింగ్‌ విధానం పెట్టిన తర్వాత కోడెల కుటుంబానికి డబ్బులు అందట్లేదన్నారు. ప్రస్తుతం పట్టణంలో 30 మంది యజమానులు ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టారన్నారు. వీరి వద్ద నుంచి ముడుపుల రూపంలో డబ్బులు రాబట్టేందుకు ఎవరో ఒకరిని దెబ్బతీస్తేనే మిగతా వారు భయపడి ముడుపులు చెల్లిస్తారనే ప్రణాళికను అమల్లోకి తీసుకొచ్చారన్నారు. దానిలో భాగంగానే కమిషనర్, కోడెల శివరామకృష్ణ కలిసి  లక్ష్మీనారాయణ అపార్టుమెంట్‌ను అన్యాయంగా పగులకొట్టించారన్నారు. గతంలో కమిషనర్‌ ఒక యువతికి అశ్లీల ఎస్‌ఎంఎస్‌లు పెట్టిన విషయంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ , కౌన్సిలర్లు కొందరు వెళ్ళి కమిషనర్‌ను తొలగించాలని స్పీకర్‌ కోడెలను కోరారన్నారు. అప్పుడు స్పీకర్‌ కోడెల కమిషనర్‌ను సెలవులో పంపారన్నారు. మళ్ళీ కమిషనర్‌ డబ్బులు కట్టి విధుల్లోకి వచ్చాడన్నారు. దానికి గురుదక్షణగా కమిషనర్‌ బిల్డింగ్‌ యజమానుల వద్ద నుంచి శివరామకృష్ణకు డబ్బులు వసూలుచేసి పెట్టేందుకు పూనుకున్నాడన్నారు. బిల్డింగ్‌ డిమాలిషన్‌పై హైకోర్టు స్టే ఇచ్చిందంటే టీడీపీ నాయకుల విధానాలు తప్పని చెప్పకనే చెప్పిందన్నారు. 

ఇది అప్రజాస్వామికం : బొల్లా 
వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నల్లపాటి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న అపార్టుమెంట్‌ను పగులకొట్టించటం అప్రజాస్వామికమని అన్నారు. నరసరావుపేట స్థాయిని స్పీకర్‌ కోడెల , ఆయన కుమారుడు దిగజారుస్తూ చిల్లర పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ గుడిసెలు వేసుకోమని ఉసిగొల్పుతున్నారన్నారు. ఈసంస్కృతి మంచిదికాదన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఉద్యోగం చేయటానికి వచ్చాడా, టీడీపీ నేతల ఇళ్ళల్లో పనిచేయటానికి వచ్చాడా అని ఎద్దేవా చేశారు. పలనాడురోడ్డులో ఉన్న స్థలంలోకి కాలువను దాటి వెళ్ళేందుకు రేకును కూడా వేయనీయలేదన్నారు. తన స్థలం పక్కనే ఉన్న వారు  కాలువను ఆక్రమించి చప్టాలు నిర్మాణాలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇంతనీచమైన కమిషనర్‌ను నేనెప్పుడూ చూడలేదని అన్నారు. 

తాజా వీడియోలు

Back to Top