పంట నష్టపోయిన రైతులను ఆదుకోండి..!

పులివెందుల: వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ వైఎస్సార్ జిల్లాలో పర్యటించారు.  ఇటీవల  కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి పంటలను అవినాష్ రెడ్డి  పరిశీలించారు. చక్రాయపేట మండలంలో అకాల వర్షాలకు భారీగా పంట నష్టం సంభవించింది. మండలంలో రైతులు వేల ఎకరాల్లో వరి పంటను విస్తారంగా సాగు చేశారు. పంట కోతకొచ్చే దశలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పంట మొత్తం దెబ్బతింది. 

ఆరుగాలం శ్రమించి సాగుచేసుకున్న పంటంతా నేలకొరగడంతో రైతన్న లబోదిబోమంటున్నాడు. రైతులు తమ ఆవేదనను ఎంపీ అవినాష్ రెడ్డి దృష్టికి తీసుకురాగా, ఆయన పొలాలను పరామర్శించారు. వెంటనే దెబ్బతిన్న పంటలకు  నష్టపరిహారం చెల్లించి, బాధిత రైతులను ఆదుకోవాలని అవినాష్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Back to Top