అలుపెరుగని బాటసారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.




కుటుంబంతో, స్నేహితులతో, బంధువులతో, అభిమానులతో, కార్యకర్తలతో పుట్టిన రోజు జరుపుకోవడం మామూలే. కానీ ప్రజలతో కలిసి, ప్రజల మధ్య పుట్టినరోజు జరగడం ఆ రోజుకే ఒక ప్రత్యేకత ఇచ్చినట్టు కదా. వైయస్ జగన్ కు మాత్రమే ఆ అదృష్టం దక్కింది.

వైయస్ జగన్  రాజకీయ జీవితం ఎన్నో ఆటోపోట్లతో ఉంది.  వ్యక్తిగత జీవితం ఎంతో స్ఫూర్తివంతంగా ఉంటుంది. మహానేత, వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అనే ముద్ర నుంచి ప్రతిపక్ష నేత, జననేతనేత  వైయస్ జగన్ మోహన్ రెడ్డిగా ఎదిగిన అతడి ప్రస్థానం చాలా గొప్పది. 
మహానేత మరణం తర్వాత రాష్ట్రంలో ఆగిన గుండెలెన్నో. తమ ఇంట్లో సొంత మనిషే పోయినంతగా గడపగడపా తల్లడిల్లిన తరుణమది. తండ్రిని ప్రేమించే వారున్నారని తెలుసుకానీ, తండ్రి లేడని తెలిస్తే గుండెఆగిపోయే వారున్నారని కూడా అప్పుడే తెలిసింది జగన్ కి. వారిని కలవడం, పరామర్శించడం ఆ తండ్రి కొడుకుగా తన బాధ్యత అనుకున్నాడు. ఓదార్పు యాత్రకు వస్తున్నట్టు ప్రకటించాడు. అది అతడి జీవితాన్ని కాదు, రాష్ట్ర కాలగతినే మలుపు తిప్పిన సందర్భం . అప్పటి అధిష్టానం వద్దంది. మాట తప్పని వైయస్ వారసత్వం అందుకు ఎదురు తిరిగింది. ప్రలోభాలకు లొంగకుండా పార్టీని, పదవిని వదలి బయటకు వచ్చారు వైయస్ జగన్. 

తండ్రి చూపిన బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. ఆయన ఆశయాలే లక్ష్యాలుగా, ఆయన లక్ష్యాలే మార్గదర్శకాలుగా భావించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. రాష్ట్రం ఎన్నో కుట్రలకు బలైంది. దాంతో పాటే వైఎస్ కుటుంబంపై కక్షసాధింపు కూడా మొదలైంది. కేంద్రం, రాష్ట్రంలోని ప్రతిపక్షం ఏకమై అక్రమ కేసులు బనాయించి జగన్ ను 16 నెలలు జైలుకు పంపారు. రాష్ట్ర విభజన అనివార్యమై నష్టపోతున్న ఆంధ్ర రాష్ట్రం తరఫున నిలిచి ప్రత్యేక హోదా కోసం పోరాడారు. నవ్యాంధ్రలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కురువృద్ధ పార్టీని మట్టి కరిపించారు. అమలు చేయలేని అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం చేసే అక్రమాలను అడుగడుగునా ఎండగడుతున్నారు. ప్రజల తరఫున ప్రధాన ప్రతిపక్ష నాయకుడై పోరాడుతున్నారు.

అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ అతడి ముఖాన చిరునవ్వు చెదరలేదు. అది ఆ తండ్రి అందించిన వరం. ఓటమిలోనూ అతడు కుంగిపోలేదు. అది భగవంతుడు అతడికిచ్చిన ధైర్యం. ప్రజా సంకల్ప పాదయాత్రలో వందల కిలోమీటర్లు నడిచినా అతడికి అలుపు రాదు అది ప్రజలు అతడికందిస్తున్న బలం. కష్టాలను ఎదిరించడంలో ఆయన మొండి వాడు, మాట నిలబెట్టుకోవడంలో మొనగాడు అందుకే జన హృదయాల్లో ఆ యువనేత పై అంతటి అభిమానం. ఆ అభిమానమే రేపటి రాజకీయ విజయాలకు కొలమానం. నవరత్నాల నిర్మాణానికి తార్కాణం.  జగమంత కుటుంబంతో కలిసి పుట్టిన రోజు జరుపుకుంటున్న వైయస్ జగన్ కు రాష్ట్రమంతా ప్రేమ పూర్వకంగా చెబుతోంది పుట్టిన రోజు శుభాకాంక్షలు.


Back to Top