గొప్పలు మాని అమలు చూడండి: శ్రీకాంత్

హైదరాబాద్ 03 మే 2013:

కొత్తగా ప్రకటించిన పథకాలపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. వీటిని అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకుని దాని ద్వారా లబ్ధి పొందాలని ప్రయత్నిస్తోందనీ, అమలులో చిత్తశుద్ధి కొరవడిందనీ పార్టీ ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జి. శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. పథకాల అమలు శైలిని తూర్పార బట్టారు.
ప్రచారానికి కోట్లాది రూపాయలను ఖర్చుచేస్తూ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పారు. ఈ పథకాల అమలు ఎక్కడా కానరావడంలేదన్నారు.
రాష్ట్ర ప్రజలు మంచినీరు, విద్యుత్తు, తదితర సమస్యలతో కొట్టుమిట్టాడుతుండగా ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండా నిష్ప్రయోజనమైన ప్రచారానికి ప్రాధాన్యతనిస్తోందని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ఇది పథకాల వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం తప్ప వేరొకటి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

రూ. కిలో బియ్యం, రాజీవ్ యువకిరణాలు, అమ్మ హస్తం, బంగారు తల్లి, పచ్చ తోరణం పథకాల అమలులో విఫలమైందన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్సుమెంటు, పావలా వడ్డీ, 104, 108 సర్వీసులను నిర్వీర్యం చేశారన్నారు. ఇవే పథకాలను దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ దిగ్విజయంగా అమలుచేసి చూపించారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో విఫలమైన ఈ ప్రభుత్వం నిజాయితీ లోపించిన కారణంగా ప్రచారంతో తన వంచనారీతిని బహిర్గతం చేసుకుందని ఆయన చెప్పారు.

ప్రభుత్వం కుటుంబానికి కేవలం ఇరవై కిలోల బియ్యాన్నే ఇస్తోందనీ దీనివల్ల మిగిలిన బియ్యం కొనడానికి అదనంగా నాలుగు వందల రూపాయలు ఖర్చుపెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. రూపాయి కిలో బియ్యం పథకానికి ఎంత ప్రాధాన్యత ఉందో అందరికీ తెలిసిందేనన్నారు.

రాజీవ్ యువకిరణాలు పథకంలో ప్రభుత్వం ఎవరికీ శాశ్వతంగా ఉపాధి కల్పించలేకపోయిందని చెప్పారు. ఈ పథకం గురించి సీఎం చెప్పిన దానికి భిన్నంగా జరుగుతోందన్నారు. ఈ పథక సారాంశాన్ని పరిశీలించిన ప్రధాన మంత్రి దాని ప్రారంభోత్సవానికి వచ్చేందుకు తిరస్కరించిన అంశాన్ని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు. ప్రధానమంత్రి తిరస్కరించడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. ఈ పథకంలో పది లక్షల మందికి ఉద్యోగాలిస్తానని సీఎం చెప్పిన అంశాన్ని ఆయనీ సందర్భంగా జ్ఞాపకం చేశారు. ఇందిరమ్మ కలలు పథకం ప్రజలను పగటి కలలు కనేలా చేస్తోందన్నారు. ఇందిర జల ప్రభ పథకంలో కొత్తగా ఒక్క బోరు బావిని కూడా తవ్వలేదని పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానుంచి 135 వ్యాధులను తొలగించడం ద్వారా దానిని నిర్వీర్యం చేసిందని చెప్పారు.
అమ్మ హస్తం పథకాన్ని ఈ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం 600 కోట్ల రూపాయలేనని చెప్పారు. దీని అమలుకు 2300 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల 50 లక్షల మంది తెల్ల రేషన్ కార్డు వినియోగదారులకు ఈ పథకం కింద చెప్పిన వస్తువులన్నీ అందచేయాలంటే ఈ మొత్తం అవసరమని తెలిపారు. ఈ పథక అమలులో ప్రభుత్వ నిజాయితీని ఈ ఒక్క అంశమే చాటిచెబుతుందని పేర్కొఆన్నరు.

ఫీజు రీయింబర్సుమెంటు పథకంలో పరిమితి విధించిన కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పథకాల్లో డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సవాళ్ళు విసురుతూ కాలయాపన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే సంక్షేమ పథకాలను దివంగత మహానేత మాదిరిగా విజయవంతంగా అమలు చేయగలరని శ్రీకాంత్ రెడ్డి స్పష్టంచేశారు.

తాజా ఫోటోలు

Back to Top