దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని

‘ధర్మపోరాటం’ కాదది దొంగల సభ
హోదా కోసం బాబు పోరాటం దెయ్యాలు వేదాలు చదివినట్లే
ప్రత్యేక హోదా ప్రథమ ముద్దాయి చంద్రబాబే
పోరాటం చేస్తున్న చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ సీపీ సూటి ప్రశ్న
తిరుపతి సభ సాక్షిగా ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా అమలు చేశారా..?
తప్పు చేసిన నీచుడినని ఒప్పుకొని సభ మొదలు పెట్టాలి
స్వార్థ రాజకీయాలకు దేవుడి పేరు వాడుకునే కపటి 
ప్రత్యేక హోదా హీరో వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
ప్రతిపక్షనేతపై నిందలు వేసేందుకే తిరుపతి సభ
తిరుపతి సభ  చంద్రబాబు అంతిమ దినాలకు మొదటి రోజు
మోసకారి బాబుపై తిరగబడాలని ప్రజలకు పిలుపు
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి

దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని చంద్రబాబు నుంచి.. టీడీపీ నుంచి.. దొంగల క్యాబినెట్‌ నుంచి.. దోపిడీ వర్గాల నుంచి.. జన్మభూమి కమిటీ నుంచి.. మాఫియా గ్యాంగ్‌ల నుంచి.. దేవుడా రక్షించు ఈ రాష్ట్రాన్ని.. కేంద్రం చేస్తున్న అన్యాయాల నుంచి.. బీజేపీ చేస్తున్న వంచన నుంచి.. పార్లమెంట్‌లో జరుగుతున్న మోసం నుంచి.. దేవుడా రక్షించు నా రాష్ట్రాన్ని.. అబద్ధాల కోరుల నుంచి.. అవినీతి సామ్రాట్‌ల నుంచి.. కాల్‌మనీ కాల నాగుల నుంచి.. తిరుపతి వెంకన్నను, అమరావతి అమరేశ్వరుడిని, బెజవాడ దుర్గమ్మను తమ జేబులో బొమ్మలుగా భావిస్తున్న దుర్మార్గుల నుంచి రక్షించు.. మమ్మల్ని, మా రాష్ట్రాన్ని రక్షించు అని రాష్ట్ర ప్రజలంతా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. 

హైదరాబాద్‌: చంద్రబాబు చేసేది ధర్మపోరాట దీక్ష కాదు.. దొంగల సభ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి విమర్శించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తానని చంద్రబాబు ప్రకటించడం దెయ్యాలు వేదాలు వల్లించడమేనని మండిపడ్డారు. నాలుగు సంవత్సరాల క్రితం లక్ష మందితో జరిగిన సభలాగే.. ఇప్పుడూ ఆర్భాటంగా నిర్వహిస్తున్నారని, వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా అదే వేదికపై నుంచి 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలని నినదించారని, అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ, టీడీపీ ఇద్దరూ కలిసి ప్రజలను వంచించి, ద్రోహం చేశాయన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రథమ ముద్దాయి చంద్రబాబు.. రెండో ముద్దాయి.. బీజేపీ అన్నారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో భూమన కరుణాకర్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన ఏం మాట్లాడారో.. ఆయన మాటల్లోనే..

వీటిలో ఏం చేశావో చెప్పు చంద్రబాబూ..?

నాలుగు సంవత్సరాల క్రితం ద్రోహానికి వ్యతిరేకంగా ధర్మపోరాటం నిర్వహిస్తున్నామని చెబుతున్న చంద్రబాబును వైయస్‌ఆర్‌ సీపీ సూటిగా ప్రశ్నిస్తుంది. నాలుగేళ్ల క్రితం అదే సభ ద్వారా రాష్ట్రంలోని రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తానని ప్రకటన వాస్తవం రూపం దాల్చిందా..? డ్వాక్రా మహిళల కన్నీళ్లు తుడిచారా..? వారి అప్పులు తీర్చారా..? నిరుద్యోగ యువతకు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం.. అప్పటి వరకు రూ. 2 వేల భృతి కల్పిస్తానన్న ప్రమాణం నిజమైందా..? ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని ప్రమాణం చేస్తానని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు, బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయిస్తానన్నారు. రజకులను ఎస్సీలుగా, బోయలను ఎస్టీలు మారుస్తానని, విద్యార్థినులకు సైకిళ్లు పంపిణీ, కంప్యూటర్లు ఇస్తానని వందలాది హామీలు ఇచ్చింది అదే వేదికపై నుంచి కాదా? అని వైయస్‌ఆర్‌ సీపీ ప్రశ్నిస్తుంది. 

వంచన, ద్రోహం చంద్రబాబు ఆస్తులు..

వంచన, కపటం, ద్రోహం, మోసం చంద్రబాబు వ్యక్తిగత ఆస్తులు. చంద్రబాబు జీవితమంతా దుర్మార్గాలతో నడిచిన చరిత్ర. మా కుల దైవం వెంకటేశ్వరస్వామి అని చెప్పే చంద్రబాబు భగవంతుడి పేరును మరింత ప్రజలను మోసం చేయడానికి వాడుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం పదుల సంఖ్యలో వాగ్ధానాలు చేసి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు ఇస్తానని చెప్పి. ఆ తరువాత హోదా ప్రయోజనం లేదు.. బీజేపీ ఇచ్చే ప్యాకేజీ అమోఘమైందని చెప్పి మోడీకి ప్యాకేజీ ఇచ్చినందుకు రెండు సార్లు శాసనసభలో ధన్యవాద తీర్మానాలు చేశారు. ఊరువాడ వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేసే ఏర్పాటు చేశాడు. 

ప్రజాదరణ ఓర్వలేక జననేతపై నిరంతరం దాడి..

ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినే వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబు నిరంతరం దాడి చేస్తూ వచ్చారు. విశాఖలో క్యాండిల్‌ ర్యాలీ చేయడానికి  వెళ్తే ఎయిర్‌పోర్టులో నిర్బంధించిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా అంటే జైల్లు నోళ్లు తెరుస్తాయని చెప్పి.. ఉద్యమకారులపై కేసులు పెట్టి ఇప్పటికీ వేధిస్తున్నాడు. వైయస్‌ జగన్‌ హోదా అనే మాటను తారక మంత్రంగా మార్చారు. హోదా  హీరోగా ప్రజలంతా వైయస్‌ జగన్‌ను భావిస్తున్నారని గ్రహించి చంద్రబాబు యూటర్న్‌ తీసుకొని ప్రత్యేక హోదా అంటూ మాట్లాడుతున్నారు. తిరుపతిలో నిర్వహించే సభను కూడా వైయస్‌ జగన్‌పై నిందలు వేయడానికే జరుపుతున్నారన్నారు. 

చేసిన తప్పు సభ సాక్షిగా ఒప్పుకో చంద్రబాబూ..

ప్రత్యేక హోదా విషయంలో మొదటి ముద్దాయి చంద్రబాబు, రెండో ముద్దాయి బీజేపీ. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా అనే మాట మాట్లాడకుండా ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లకు పంపించిన చంద్రబాబు ధర్మపోరాట సభ జరపడం దెయ్యాలు వేదమంత్రాలు చదివినట్లే. వెంకటేశ్వరస్వామిగా ప్రజలకు ద్రోహం చేసిన చంద్రబాబు మళ్లీ అదే సభ నుంచి మట్లాడే ధైర్యం ఉందా..? ప్రత్యేక హోదా పోరాడకుండా జైల్లో పెట్టిన నీచుడిని నేనే అని సభ ప్రారంభం కావాలి. 

బీజేపీతో టీడీపీకి ఇంకా సంబంధాలున్నాయి..

తన స్వార్థం కోసం భగవంతుడిని కూడా వదలని కపటి చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థాన కమిటీలో ఎవరిని సభ్యులు నియమించారు. మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్యకు కమిటీలో స్థానం కల్పించారు. రాగద్వేషాలకు అతీతంగా.. స్వప్రయోజనాలకు భిన్నంగా పదవిని పూర్తి చేస్తానని ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు. వ్యక్తిగత పరిచయాల రీత్యా పదవి ఇచ్చానని చెబుతున్నాడు. బీజేపీతో ఇంకా చంద్రబాబు లాలూచీ రాజకీయాలు చేస్తున్నాడనేందుకు టీటీడీలో బీజేపీ మంత్రి సతీమణికి స్థానం నిదర్శనం. 
దేవాలయాలను కూల్చివేసిన మహాభక్తుడు..

అమరావతిలోని అమరేశ్వరుడి దేవాలయ 60 ఎకరాల భూమిని అప్పనంగా ప్రైవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసి చంద్రబాబు భగవంతుడిపై ప్రగాఢ విశ్వాసం ప్రకటించుకున్నాడు. ఈ రాష్ట్రంలో దేవాలయాలను సమూలంగా నేలమట్టం చేసిన మహాభక్తుడు చంద్రబాబు. రాష్ట్రంలోని ఆలయ భూములను ప్రైవేట్‌ వ్యక్తులకు లీజులకు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఇన్ని అబద్ధాలు చెప్పే ధైర్యం చంద్రబాబుకు మాత్రమే ఉంది. టీడీపీ నిర్వహించే ధర్మపోరాట సభ.. దొంగల సభగా ప్రజలంతా భావిస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రజల మీద పడి రక్కి వారి జీవితాలను బుగ్గి చేసి చెలగాటం ఆడాడు. మూడు లక్షల కోట్లకుపైగా అవినీతి చేసి ఒక్క వాగ్ధానాలను కూడా నెరవేర్చకపోగా.. 98 శాతం నెరవేర్చా.. నాలా పరిపాలన చేసిన వారు ఎవరూ లేరని పచ్చ ప్రసార మాధ్యమాల ద్వారా గొప్పలు చెప్పుకుంటున్నారు.  

మోసాలకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే..

బెజవాడ దుర్గమ్మ ఆలయంలో క్షుద్రపూజలు చేయించిన చంద్రబాబుకు భగవంతుడిపై నమ్మకం ఉందంటే అంతకంటే పాపం మరొకటి లేదు. చంద్రబాబు మోసాలకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే.. తిరుపతిలో జరిగే చంద్రబాబు సభ నూటికీ నూరు శాతం దొంగల, దోపిడీ దారుల సభ. నాలుగేళ్ల క్రితం లక్ష మంది సాక్షిగా చేసిన మోసానికి క్షమాపణలు చెబుతూ.. చంద్రబాబు ఉపన్యాసాలు మొదలు పెట్టాలి. తిరుపతి సభ చంద్రబాబు పాలన అంతిమ దినాలకు మొదటి రోజుగా భావించాల్సి వస్తుంది. ప్రతి అబద్ధాన్ని ప్రజలంతా గమనిస్తారు. ప్రత్యేక హోదా మొదటి ముద్దాయి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడాల్సిందిగా జ్వాలను రగిలించే బాధ్యత వైయస్‌ఆర్‌ సీపీ తీసుకుంటుంది. ప్రజల పక్షాన నిలిచి బాబు మోసాలను, కుట్రలను ఇబ్బందులు ఎదురైనా పోరాడుతుందని తెలియజేస్తున్నాం. 
 

తాజా వీడియోలు

Back to Top