తాడేపల్లిగూడెం: రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15వ తేదీన తలపెట్టిన పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు ప్రాంతాల సందర్శన యాత్రను విజయవంతం చేయాలని ఉభయగోదావరి జిల్లాల పార్టీ ఇన్‌చార్జ్ కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం తాడేపల్లిగూడెంలో పార్టీ సమన్వయకర్త తోట గోపి నివాసంలో నియోజకవర్గ సమన్వయకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సుబ్బారాయుడు మాట్లాడుతూ... ఉభయగోదావరి జిల్లాల రైతులకు పట్టిసీమ వల్ల కలిగే నష్టం, పోలవరంతో కలిగే లాభాల గురించి తెలియజెప్పి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత పార్టీ భుజస్కందాలపై ఉందన్నారు.<br/>ఆ దిశగా పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇందుకోసం పార్టీ అధినేత ఈ నెల 15న బస్సు యాత్ర ద్వారా తలపెట్టిన ప్రాజెక్టు ప్రాంతాల సందర్శనను దిగ్విజయం చేయడంతో పాటు రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కానుమూరి నాగేశ్వరరావు, కొయ్యం మోసేన్‌రాజు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్ల బాలరాజు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన పార్టీ నేతలు పాల్గొన్నారు.