రైతులకు లాభం తేవడంపై దృష్టిసారించండి

న్యూఢిల్లీ :

వ్యవసాయ ఉత్పత్తులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వకుండా రైతుకు లాభం చేకూర్చడంపై దృష్టి సారించాలని ఇండియన్ కౌన్సి‌ల్ ఆ‌ఫ్ అగ్రికల్చర‌ల్ రీసె‌ర్చి (ఐసీఏఆర్) సభ్యుడు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం కన్వీనర్ ఎం‌వీఎస్‌ నాగిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ దిగుబడుల్లో వృద్ధి ఉంటున్నా రైతుకు కనీస మద్దతు ధర లభించడం లేదని, రైతు కుటుంబానికి ఆహారం, వైద్యం, వారి పిల్లలకు విద్య అందక ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతును ఆదుకునేలా పరిశోధనలు జరగాలని విన్నవించారు.

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవా‌ర్ అధ్యక్షతన‌ ఢిల్లీలో బుధవారం జరిగిన ఐసీఏఆర్ సమావేశంలో‌ ఎంవీఎస్ నాగిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలోని వ్యవసాయ సంక్షోభంపై‌ ఈ సందర్భంగా నాగిరెడ్డి పలు అంశాలు లేవనెత్తారు. వ్యవసాయ పరిశోధన కేంద్రాలు లేకపోవడంతో రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయ సంక్షోభ నివారణకు ప్రాంత పరిస్థితులు, పంటకు అనుగుణంగా యాంత్రీకరణ అవసరమని, ఆ దిశగా సదర‌న్ రీజియ‌న్‌లో ఆంధ్రప్రదేశ్‌లో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

ఆంధ్ర రాష్ట్రంలోని మెట్టప్రాంతాల్లో సీతాఫలం, రేగు, నేరేడు సాగవుతుందని, ఈ పంటలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉందని ‌నాగిరెడ్డి చెప్పారు. ఈ పంటల ఉత్పత్తికి పరిశోధన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సూచించారు. దేశంలో 14  మత్స్య పరిశోధన కేంద్రాలుండగా, ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కటి కూడా లేని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చేపల ఉత్పత్తి బాగా జరిగే తూర్పుగోదావరి జిల్లాలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు.

రైతులకు లాభం చేకూర్చడానికి ఎగుమతులు, దిగుమతి విధానాల్లో మార్పులు తీసుకురావడానికి, పంట బీమా వ్యవహారాలకు సంబంధించి ఆర్థిక విధానాల రూపకల్పనకు ఎకనామిక్ పాలసీ రీసె‌ర్చి కేంద్రాన్ని 8 రీజియన్లలో పెట్టాలన్నారు. కాగా, ఐసీఏఆర్ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ‌హాజరు కాలేదు.

Back to Top