రాజన్న రాజ్యంలో అందరి కష్టాలకు సెలవు

కోమటిపల్లి(గజపతి నగరం నియోజకవర్గం) 16 జూలై 2013:

దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ శ్రీమతి షర్మిల పాదయాత్రలో చరిత్ర సృష్టించారు. మంగళవారం 211 వరోజు పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆమె 2819.2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని కోమటిపల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగా సభలో శ్రీమతి షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వల్లే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆమె ఎద్దేవా చేశారు.  ఈ ప్రభుత్వానికి మనసు, మానవత్వం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కోతల ప్రభుత్వమని విమర్శించారు. అదిచేస్తాం, ఇది చేస్తామని చెబుతారనీ, అన్ని పథకాలకు కోతలు పెడుతూ ఉంటారనీ మండిపడ్డారు. అబద్దపు కేసులు పెట్టి జగనన్నను జైలు పాలు చేశారన్నారు. వీరి కుట్రలు ఎంతోకాలం సాగవని చెప్పారు. జగనన్న ఏ తప్పు చేయలేదనీ, త్వరలోనే బయటలకు వస్తారనీ ఆమె చెప్పారు. బోనులో ఉన్నా సింహం సింహమేనని చెప్పారు. జగనన్నను ఎవరూ ఆపలేరని తెలిపారు.

కాంగ్రెస్ టీడీపీలకు విలువలు, విశ్వసనీయత ఏమాత్రం లేవని శ్రీమతి షర్మిల విమర్శించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయడం వీరికి చేతకాదన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతు నష్టపోకుండా అవసరమైతే పంటను ప్రభుత్వమే కొనేలా మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేస్తరని ఆమె పేర్కొన్నారు. రైతులకు మహిళలకు వడ్డీలేకుండా రుణాలిస్తారని చెప్పారు. రాజన్న తలపెట్టిన ప్రతి జల యజ్ఞం ప్రాజెక్టునూ జగనన్న పూర్తి చేస్తాడని భరోసా ఇచ్చారు. మన రాష్ట్రంలో గుడిసనేది ఉండకూడదనీ, పక్కా ఇల్లు ఉండాలన్న రాజన్న ఆశయాన్ని జగనన్న నెరవేరుస్తాడన్నారు. డబ్బు లేని కారణంగా విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఉద్దేశంతో రాజన్న ప్రారంభించిన ఫీజు రీయింబర్సుమెంటు పథకాన్ని జగనన్న సమర్థంగా అమలుచేస్తారన్నారు. వృద్ధులు, వితంతుల పింఛను 700 రూపాయలకూ, వికలాంగుల పింఛను వెయ్యి రూపాయలకు పెరుగుతుందని తెలిపారు.

వైయస్ఆర్ అమ్మ ఒడి అనే పథకం ద్వారా అక్కచెల్లెళ్ళ ఖాతాలో వారి పిల్లలు చదువుకునేందుకు వీలుగా సొమ్ము జమవుతుందని చెప్పారు. రాజన్న రాజ్యం మళ్ళీ వస్తుందని భరోసా ఇచ్చారు. స్థానిక ఎన్నికలు, తరువాత సాధారణ ఎన్నికలు రాబోతున్నాయనీ, ఆ ఆయుధంతో కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పి, వైయస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే రాజన్న రాజ్యం సాధ్యమని ఆమె పేర్కొన్నారు. మా పార్టీకి వేసే ప్రతి ఓటూ జగనన్న నిర్దోషిత్వాన్ని నిరూపిస్తుందని శ్రీమతి షర్మిల చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top