సమన్యాయం చేయకుంటే విభజన వద్దు: విజయమ్మ

గుంటూరు 19 ఆగస్టు 2013:

సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయడమే తమ పార్టీ లక్ష్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆమె సోమవారం ఉదయం గుంటూరు నగరంలో సమర దీక్ష పేరిట నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. వివిధ అంశాలను స్పృశించారు. అన్ని ప్రాంతాలకూ న్యాయం చేయాలన్నదే దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ ధ్యేయమని తెలిపారు. ఆయన మూడు ప్రాంతాల వారినీ సమానంగా ప్రేమించారన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా రాజన్న సేవ చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఖమ్మం, నల్లగొండ జిల్లాల కోసం పులిచింతల ప్రాజెక్టును, అలాగే, దీర్ఘకాల ప్రయోజనాల కోసం పోలవరం ప్రాజెక్టునూ మహానేత చేపట్టారని చెప్పారు.

రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పడానికి జైలులో తానే దీక్ష చేస్తానని తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారనీ... కానీ అవాంతరాలు సృష్టించి, ములాఖత్‌లు రద్దు చేసి, ఇతర రాష్టంలోని జైలుకు తరలించే అవకాశముందనీ... తానే దీక్ష చేస్తానని చెప్పి జగన్ బాబును వారించానని శ్రీమతి విజయమ్మ వివరించారు. ఇప్పటికే వారానికి కేవలం రెండు ములాఖత్‌లు మాత్రమే అనుమతిస్తున్నారనీ, ఆరుగురి కంటే ఎక్కువమందిని కలవనీయడం లేదనీ ఆమె తెలిపారు. రాష్ట్రంలోని ఇరు ప్రాంతాలకూ న్యాయం చేయలేనప్పుడు విభజన ఎందుకని ఆమె ప్రశ్నించారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి పోవాలని అంటున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం వారు ఎవరు మన ప్రాంతానికి వచ్చినప్పటికీ అవమానించవద్దని విజ్ఞప్తి చేశారు.

ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దనే తాను దీక్ష చేపట్టినట్లు శ్రీమతి విజయమ్మ చెప్పారు.   రాష్ట్ర విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి కట్టుబట్టలతో ఇంటి నుంచి పొమ్మన్నట్లుందని ఆమె తెలిపారు. ఓట్లు, సీట్ల కోసమే రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్నారన్నారు. కేంద్రం స్టేట్సుమేన్‌లా న్యాయం చేయలేదని భావిస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. తెలంగాణలో 15 సీట్లు వస్తాయని రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ చూస్తోందని  మండిపడ్డారు. సమన్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని చూస్తోంటే బాధేస్తోందన్నారు. అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు చీల్చుతారా అని ఆమె కేంద్రాన్ని నిలదీశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ మూడు ప్రాంతాల ప్రజలను సమానంగా చూశారనీ, అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని కోరుకున్నారనీ శ్రీమతి విజయమ్మ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరువు ప్రాంతాలైన కడప, చిత్తూరు కర్నూలు, అనంతపురం, నల్గొండ, మహబూబ్‌నగర్‌లో అనేక అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టారని జ్ఞాపకం చేశారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాలకు పరిష్కారం దొరికినప్పుడే విభజనని మహానేత అన్న విషయాన్ని  గుర్తు చేశారు. దివంగత మహానేత హయాంలో ప్రవేశపెట్టిన ప్రాజెక్టులు ప్రస్తుతం మూలన పడ్డాయన్నారు. డాక్టర్ వైయస్ఆర్  కన్న కలలు కల్లలుగా మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  వారసునిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి ఆయన బాధ్యతలు స్వీకరించారని విజయమ్మ తెలిపారు. జగన్ తరఫున సమర దీక్ష చేపట్టినట్లు ఆమె వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డే దీక్ష చేయాలనుకున్నారని, అయితే జైలు నిబంధనలు కఠినతరం చేస్తారనే తాను దీక్ష చేయటం లేదని విజయమ్మ పేర్కొన్నారు. జగన్  బాబు ఎక్కడున్నా ఆయన  ఆరాటమంతా ప్రజల కోసమేనని శ్రీమతి విజయమ్మ పేర్కొన్నారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ తరఫున సమన్యాయం చేయాలని ప్లీనరీలో  కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఇంతకన్నా మంచిగా తెలంగాణ వారు జీవిస్తారంటే తెలంగాణకు తాము అడ్డుకామని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించవద్దని ఈ సందర్భంగా శ్రీమతి విజయమ్మ సీమాంధ్రవాసులకు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగానే ముందుకు సాగుదామని సూచించారు. ప్యాకేజీ ఇవ్వాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అర్థంలేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నాలుగు లక్షలు కోట్లు ఇవ్వాలని ఆయన కాకి లెక్కలు చెప్పారన్నారు. ఏ సమస్యనూ పరిష్కరించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజిస్తారని ప్రశ్నించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడే టీడీపీ ఎమ్మెల్యేల చేత చంద్రబాబు రాజీనామా చేయించి ఉంటే పరిస్థితి ఇంతవరకూ వచ్చేది కాదన్నారు. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సీడబ్ల్యూసీ తీర్మానించిన తర్వాత చంద్రబాబు దానిని స్వాగతించడమే కాక, రెండు రాష్ట్రాల ప్రజలు కలిసి జీవించాలని కోరారన్నారు. అంతేకాక, కొత్త రాజధాని ఏర్పాటుకు నాలుగైదు లక్షల కోట్ల రూపాయలు ఖర్చవుతాయనీ, ఆమేకు ప్యాకేజీ ప్రకటించాలనీ కూడ ఆయన కేంద్రానికి సూచించారని చెప్పారు.

తెలంగాణపై వెనక్కి మళ్ళే ప్రశ్నే లేదని పదేపదే చెబుతున్న దిగ్విజయ్ సింగ్ సభ్యుడిగా ఉన్న ఆంటోనీ కమిటీకి సమస్యలు ఎలా చెబుతామనీ శ్రీమతి విజయమ్మ ప్రశ్నించారు. చంద్రబాబు కూడా కేంద్ర నిర్ణయానికి వంతపాడడంతో తాను, జగన్ బాబు ఎమ్మెల్యే, ఎంపీ పదవులకు రాజీనామాలు సమర్పించామని చెప్పారు. విభజన అంశంపై శాంతియుతంగా పోరాడాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.   ప్రజాగ్రహాన్ని ఎవరూ తట్టుకోలేరన్నారు. వారి ఆగ్రహంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకతప్పదన్నారు. ఉమ్మడి కుటుంబంలో ఉన్న తండ్రి ఓ కుమారుడికి ఇంటితో సహా అన్నీ సమకూర్చి, మరో కుమారుడికి నీ ఇల్లు నువ్వు కట్టుకే, అవసరమైనవి సమకూర్చుకో అంటే ఎలా ఉంటుందో కాంగ్రెస్ నిర్ణయం అలాగే ఉందని శ్రీమతి విజయమ్మ చెప్పారు.

పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన తేగానే సభకు హాజరైన ప్రజలు నిర్విరామంగా జయజయధ్వానాలు చేశారు. కొద్దిసేపు ఆమె తన ప్రసంగాన్ని నిలిపేయాల్సి వచ్చింది. ఓదార్పు యాత్ర చేస్తూ రెండున్నరేళ్ళు జగన్ బాబు ప్రజలతో ఉన్నారని చెప్పారు. ఆయన్ను గురించి ఆలోచించినప్పుడు తానెంతో గర్వంగా భావిస్తానని తెలిపారు. జైలులో ఉన్న 15నెలల్లో తనకు నిద్ర పట్టలేదని ఏనాడూ జగన్ బాబు చెప్పలేదన్నారు. బాధపడుతున్న తమను ఓదార్చేవాడని చెప్పారు. రాష్ట్ర విభజన నిర్ణయం విన్న తరవాత ఆయన బాధపడుతున్నారనీ, అందరికీ సమన్యాయం చేకూరాలని ఆకాంక్షిస్తున్నారనీ పేర్కొన్నారు. ఆయన కోరిక మేరకే తాను నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందనీ, మనమంతా కలిసుండే సమయం మళ్ళీ వస్తుందనీ ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తూ దీక్షను ప్రారంభిస్తున్నట్లు శ్రీమతి విజయమ్మ ప్రకటించారు.

ఏ నిర్ణయం తీసుకోవడానికైనా ప్రజా స్వామ్యంలో ఓ ప్రాతిపదిక ఉండాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రాన్ని విభజించాలన్నా 1951నుంచి ఓ పద్ధతి ఉండేదన్నారు. ఇప్పుడు తమ చేతిలో అధికారం ఉందని ఇష్టారీతిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేశారన్నారు. ఇంతవరకూ ఏ ప్రభుత్వమూ ఇలా చేయలేదన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండా ఏ రాష్ట్రమూ ఏర్పడలేదన్నారు. రెండు రాష్ట్రాల ఆమోదం పొందిన తర్వాతనే ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన మా హక్కు అంటున్న దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సైతం అసెంబ్లీ తీర్మానం తర్వాతనే చత్తీస్ గఢ్ ఏర్పడిందనే విషయాన్ని మరువరాదన్నారు. దీనిని మరిచిన దిగ్విజయ్ మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానమే అవసరం లేదని చెబుతుండడం శోచనీయమని శ్రీమతి విజయమ్మ చెప్పారు. ఎన్డీఏ హయాంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు కూడా సంబంధిత అసెంబ్లీలలో ఏకగ్రీవ తీర్మానం తర్వాతనే ఆవిర్భవించిన విషయాన్ని కూడా ఆమె గుర్తుచేశారు.

తాజా వీడియోలు

Back to Top