ఎన్నికలంటే కాంగ్రెస్‌కు భయం: జనార్దన్

బెల్లంపల్లి: పురపాలక సంఘాల పాలక మండళ్ల పదవీకాలం ముగిసి రెండేళ్లు గడిచినా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధపడటం లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ బోడ జనార్దన్ ధ్వజమెత్తారు.  గెలువలేమనే భయంతోనే  ప్రత్యేక అధికారులతో పాలన సాగిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. బెల్లంపల్లిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరిట కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు పబ్బం గడుపుతున్నారనీ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంతో విఫలయ్యారనీ  విమర్శించారు. ప్రభుత్వం ఇలా ఉంటే ప్రత్యేక అధికారులు సమస్యలు పట్టించుకోకుండా జిల్లా కేంద్రానికి పరిమితమవుతున్నారని మండిపడ్డారు. బెల్లంపల్లి మున్సిపాల్టీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, రహదారులు సరిగా లేవన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతున్నామన్నారు. తొలుత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అంతకుముందు ప్రదర్శన నిర్వహించారు.

పలువురి చేరిక
వైయస్ఆర్ కాంగ్రెస్‌లో సుమారు 100 మంది యువకులు చేరారు. వీరికి జిల్లా కన్వీనర్ జనార్దన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత టేకులబస్తీలో నిర్వహించిన కార్యక్రమంలోనూ 20 మంది యువకులు చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం. బాలకృష్ణ, రమేశ్‌సింగ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఎండి అఫ్జల్, పట్టణ శాఖ అధ్యక్షుడు మేకల వెంకటేశ్, ఉపాధ్యక్షుడు సుద్దాల నర్సయ్య, బెల్లంపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు సింగతి కిరణ్‌కుమార్, అర్సం మురళీకృష్ణ, యువజన విభాగం పట్టణ అధ్యక్షుడు కె.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top