ఎనిమిదేళ్లలో 8సార్లు కరెంటు చార్జీల పెంపు

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా పెంచిన విద్యుత్తు చార్జీల కారణంగా బిల్లులు కట్టలేక అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నారని శ్రీమతి వైయస్ షర్మిల చెప్పారు. నాడు ప్రజలకు భరోసా ఇవ్వడానికి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాదయాత్ర చేశారనీ, ముఖ్యమంత్రయిన తర్వాత రూపాయి భారం వేయకుండా పాలించారనీ తెలిపారు. మళ్లీ కిరణ్ హయాంలో ప్రజలు చంద్రబాబు పాలన చూస్తున్నారని చెప్పారు. మూడింతలు పెరిగిన కరెంటు బిల్లులు కట్టడానికి తాళిబొట్లు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న త్వరలోనే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారనీ, అధైర్యపడొద్దనీ ఆమె ప్రజలకు ధైర్యం చెప్పారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించి పదేళ్ళయిన సందర్భంగా శ్రీహతి షర్మిల కృష్ణా జిల్లాలో మొక్కలు నాటారు.

‘సరిగ్గా పదేళ్ల కిందట 2003లో ఇదే రోజున(ఏప్రిల్ 9న) రాజశేఖరరెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రను మొదలు పెట్టారు. అప్పుడు సాగుతున్నది చంద్రబాబు పాలన. పేదలను, రైతులను పురుగుల్లా చూస్తూ ఆయన ఒక రాక్షస పాలన సాగించారు. బాబు పాలనలో బతుకుపై భరోసా కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రజలకు ధైర్యం చెప్పడానికి మహానేత డాక్లర్ వైయస్ఆర్ పాదయాత్ర ప్రారంభించారు. యాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకొచ్చాక ఆ కష్టాలన్నీ తీర్చడానికి కృషి చేశారు. ఒక్క రూపాయి కూడా భారం వేయకుండా సువర్ణయుగం అందించారు. ఆయన మన నుంచి దూరమయ్యాక రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పాలన మొదలైంది. అసలే కరువుతో అల్లాడిపోతున్న రోజుల్లో చంద్రబాబు ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిది సార్లు కరెంట్ చార్జీలు పెంచితే.. ఈ కిరణ్ కుమార్‌రెడ్డి చార్జీల మీద చార్జీలు పెంచుతూ, సర్‌చార్జీలు వేస్తూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. ఇప్పుడు కరువు జిల్లాల్లో కరెంటు బిల్లులు కట్టాలంటే.. మంగళసూత్రాలు అమ్ముకోవాల్సిన పరిస్థితని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. జగనన్న త్వరలోనే బయటకు వస్తారని, మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారని భరోసా ఇచ్చారు. ప్రజా సమస్యలు పట్టని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, ఆ ప్రభుత్వానికి రక్షణ కవచంలా నిలిచిన చంద్రబాబు వైఖరికి నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో సాగింది. నందివాడ మండలం పుట్టగుంటలో జరిగిన రచ్చబండలో షర్మిల మాట్లాడారు.

వైయస్ ప్రజాప్రస్థానం ఒక యజ్ఞం
డాక్టర్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర సాగిన తీరును శ్రీమతి షర్మిల గుర్తుచేసుకున్నారు. ‘అప్పుడు నాన్న పాదయాత్ర మొదలు పెట్టినప్పుడు అందరూ బయట బాగా ఎండలు ఉన్నాయనీ, వాయిదా వేసుకోమనీ కోరారు. కాని అప్పుడు నాన్న ఒక్కటే చెప్పారు. ‘అసలే అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వేసవిలో కరవు మరింత పెరుగుతుంది. కష్టాలు ఎక్కువవుతాయి. ఆత్మహత్యలు పెరుగుతాయి. ఇప్పుడే మనం వెళ్లి ధైర్యం చెప్పాలి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయనీ చల్లబడ్డాక వెళ్తే ఉపయోగం ఏంటనీ’ అని అన్నారు. ఒక సుదీర్ఘ పాదయాత్ర చేశారు. మండుటెండలను లెక్క చేయకుండా రోజుకు 25 కిలోమీటర్ల మేర నడిచారు. వైయస్ ప్రజాప్రస్థానం ఒక యజ్ఞంలా సాగింది. ప్రజల కష్టాలు విని ఆయన తల్లడిల్లిపోయారు. వారికి ధైర్యం చెప్పారు. పాదయాత్రలో వచ్చిన అనుభవాలతో ప్రజలకు ఏం అవసరమో, వారికి ఏం చేస్తే బావుంటుందో తన ఐదేళ్ల పాలనలో చేసి చూపించారు’ అని శ్రీమతి షర్మిల అన్నారు.


మూడు రెట్లయిన కరెంటు బిల్లులు

కరెంట్ బిల్లులు మూడురెట్లు పెరిగాయని, గతంలో రెండు వందలు వచ్చే బిల్లు ఇప్పుడు ఏడెనిమిది వందలు వస్తోందని రచ్చబండలో మహిళలు శ్రీమతి షర్మిలకు మొరపెట్టుకున్నారు. రోజుకు నాలుగైదు గంటలు కూడా కరెంట్ ఉండటం లేదని బిల్లులు మాత్రం పెద్దమొత్తంలో వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మాకు రెండేళ్లుగా పావలా వడ్డీ రావటం లేదు. వడ్డీ లేని రుణాలు అంటూ ఇచ్చారు. తీరా బ్యాంకు పుస్తకంలో మాత్రం మాకు వడ్డీ పడుతుందన్నారు. ఇదేమిటని బ్యాంకర్లను అడిగితే డీఆర్‌డీఏ వారిని అడగండని.. డీఆర్‌డీఏ వారేమో బ్యాంకర్లను అడగాలని చెబుతున్నారు. మమ్మల్ని రోడ్డెక్కించి మా జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని పుట్టగుంట మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు.

గ్రూపు రుణాలు కట్టకపోతే మా ఇళ్లకు తాళాలు వేస్తున్నారని మరో మహిళ చెప్పారు. త్వరలోనే మంచి రోజులు వస్తాయని, జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న రాజ్యంలో వడ్డీ లేని రుణాలు వస్తాయని శ్రీమతి షర్మిల  వారికి భరోసా ఇచ్చారు. గ్రామాల్లో బెల్టు షాపులు ఉండవని, అందరికీ పక్కా ఇళ్లు వస్తాయని హామీ ఇచ్చారు. జగనన్న సీఎం అయితే వృద్ధులకు, వితంతువులకు రూ.700 చొప్పున, వికలాంగులకు రూ.వెయ్యి చొప్పున పింఛను అందుతుందన్నారు. పిల్లలను స్కూలుకు పంపితే పదో తరగతి వరకు రూ.500 చొప్పున, ఇంటర్‌కు రూ.700 చొప్పున, డిగ్రీకి రూ. వెయ్యి చొప్పున తల్లుల ఖాతాలో వేస్తారన్నారు. అంతకంటే ఎక్కువ చదివితే ఫీజు రీయింబర్సుమెంట్ ఉండనే ఉందన్నారు.

మొక్కలు నాటిన షర్మిల
మంగళవారం మధ్యాహ్నం నందివాడ మండలం నందివాడ సత్రం నుంచి షర్మిల యాత్రను పునః ప్రారంభించారు. అక్కడి నుంచి పుట్టగుంట, పెదలింగాల, అరిపిరాల వరకు మొత్తం 7.7 కిలోమీటర్లు మేర యాత్ర సాగింది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ పాదయాత్ర ప్రారంభించి పదేళ్లయిన సందర్భంగా పుట్టగుంటలో పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డికి చెందిన చేపల చెరువు గట్టుపై రాతి ఉసిరి, మామిడి మొక్కలను షర్మిల నాటారు.

స్థానికులు ఇచ్చిన వలను చెరువులో విసిరి చేపలు పట్టారు. అంతకుముందు గ్రామంలో అరకిలోమీటరు మేర రోడ్డుపై పూలు పరచి, మహిళా కోలాట బృందంతో గ్రామస్తులు శ్రీమతి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. పుట్టగుంట వద్ద బుడమేరు ఆధునీకరణ పనులను పరిశీలించారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, మద్దాల రాజేశ్, నాయకులు ఎంవీఎస్ నాగిరెడ్డి, కుక్కల నాగేశ్వరరావు, మండలి హనుమంతరావు, దూలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top