అభివృద్ధి పనుల్లో రాజకీయాలొద్దు

  • ప్రజా సమస్యలను పరిష్కరించండి
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కారంలో రాజకీయాలకు తావివ్వకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నగర కార్పొరేషన్‌ కమిషనర్‌ను కోరారు. కార్పొరేషన్‌ పరిధిలోని వివిధ ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా వివిధ కాలనీలో నెలకొన్న సమస్యలని ఎమ్మెల్యే కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చి చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ...పొట్టేపాలెం కలుజు వద్ద ప్రమాదాల నివారణకు యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగిందని వివరించారు. అదే విధంగా చిల్డ్రన్స్‌ పార్కు వద్ద ఉన్న భవాని రెసిడెన్సీ అపార్టుమెంట్‌ వాసులకు తాగునీళ్ల సమస్యను పరిష్కరించాలన్నారు. 

పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. అంతే కాకుండా పొదలకూరు రోడ్డులో నేతాజీనగర్‌ వాటర్‌ ట్యాంక్‌ డౌన్‌ ప్రభుత్వ స్థలంలో చెత్తా చెదారాలు నిండిపోయి దుర్గంధపూరిత వాసన వస్తుందన్నారు. దీంతో చుట్టు పక్కల కాలనీల వాసులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కమిషనర్‌ అనుమతిస్తే కార్పొరేషన్‌పై ఒక్క రూపాయి ఆర్థిక భారం పడకుండా దాతలు, కాలనీ వాసుల సహాయంతో ఆ స్థలాన్ని సుందరమైన పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు. లేదా కార్పొరేషన్‌ అభివృద్ధి చేసినా పర్వాలేదని చెప్పడం జరిగిందన్నారు. దీనిపై కమిషనర్‌ ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారని చెప్పారు. అభివృద్ధి పనుల విషయంలో రాజకీయాలకు తావులేకుండా ప్రజలను దృష్టిలో పెట్టుకోవాలని కోరామన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. 
Back to Top