బెల్టు షాపులకు అధికార హోదా కల్పించవద్దు

హైదరాబాద్, అక్టోబర్ 28: మద్యం దుకాణాల సామర్ధ్యం పెంపు పేరుతో రాష్ట్రంలో అధికారిక బెల్టు షాపులు  తెరిచే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. హర్యానా రాష్ట్రం మోడల్ పేరుతో ఇప్పటికే అధికారికంగా ఉన్న ప్రతి
దుకాణానికీ అనుబంధంగా మరో మూడు దుకాణాలను మంజూరు చేయాలనే కొత్తమాటను చంద్రబాబు ప్రభుత్వం తెరమీదకు తేవడం శోచనీయమని ఆమె అన్నారు.

మంగళవారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మద్యం, బెల్టు షాపులన్నింటిని రద్దు చేస్తానని చంద్రబాబు ప్రతి సభలోనూ నొక్కి చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఖజానా నింపుకునేందుకు మద్యం షాపుల సామర్ధ్యం పెంపు పేరుతో అధికారికంగా బెల్టు షాపులను నెలకొల్పడానికి సంకల్పిస్తున్నారని విమర్శించారు.

13,800 షాపులు పెడతారా?

రాష్ట్రంలో ప్రస్తుతం 4,600 మద్యం షాపులు ఉన్నాయని, ఒక్కొక్కదానికి అదనంగా మూడు షాపులు అనుమతివ్వడం అంటే ఆ సంఖ్యను 13,800కు పెంచడమేనని పద్మ అన్నారు. కొత్తగా డిస్టిలరీలను స్థాపించడంతో పాటుగా గ్రామాల వరకూ మద్యాన్ని తీసుకెళ్ళడం వంటి చర్యలను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తొందని, ప్రజల శ్రేయస్సు రీత్యా ఇదెంత మాత్రం మంచి పరిణామం కాదని ఆమె అన్నారు. 1100 మాత్రమే ఉన్న బెల్టు షాపులను తొలి సంతకంతో రద్దు చేస్తామని చెప్పి ఆ సంఖ్యను 13 రెట్లకు పెంచడం ఏ
మాత్రం సరైన విధానం కాదని ఆమె దుయబట్టారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన విధంగా బెల్టు షాపుల రద్దుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి తాజా ఆలోచనను విరమించుకోవాలని కోరారు. పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కొణతాల రామకృష్ణ వ్యవహారం తప్పకుండా సమసిపోతుందని, ఆయన పార్టీలోనే ఉన్నారని, పార్టీ నాయకత్వం తప్పకుండా ఈ అంశాన్ని పరిష్కరించుకుంటుందని పద్మ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పార్టీలో ఏదైనా ఒక సమస్య రాగానే అందరూ వెళ్ళిపోతున్నారని ఓ వర్గం మీడియా రోజుకొక కథనాన్ని ప్రసారం చేస్తుందని విమర్శించారు.

Back to Top