తిరుపతి: నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబే కారణమని, ఇప్పుడు ఆ కుటుంబాన్ని కూడా మోసం చేసేలా కపట నాటకం అడుతున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. భూమా కూతురు అఖిలమ్మ నా సోదరిలాంటిదని, అమ్మా..టీడీపీ నేతల మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన హితవు పలికారు. మంగళవారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. భూమాను మోసం చేశారని, నయవంచనకు గురి చేసి చనిపోవడానికి సీఎం కారణమన్నారు. సంస్కారం లేని పనులు చేస్తున్నది టీడీపీ నేతలే అని ధ్వజమెత్తారు. ఈ రోజు చంద్రబాబు అఖిలమ్మ నా కూతురు లాంటిదని చెబుతున్నారని, ఆ రోజు బాలయోగి కుమారుడిని కూడా ఇలాగే చెప్పారని, అయితే ఆ కుటుంబాన్ని ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ఈ రోజు లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాలయోగి కుమారుడు రూ.20 వేల జీతానికి పని చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు.<br/>