దమ్ముంటే ఉప ఎన్నికలకు సిద్ధంకండి!

జగ్గయ్యపేట (కృష్ణాజిల్లా) 21 ఏప్రిల్ 2013: అవిశ్వాస తీర్మానంలో ప్రజలపక్షాన నిలిచిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకుని ఉప ఎన్నికలు జరిపించే దమ్ము కాంగ్రెస్ పార్టీకిగానీ, టీడీపీకిగానీ లేదని శ్రీమతి వైయస్ షర్మిల వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలు జరిగితే గెలుపు కచ్చితంగా వైయస్ఆర్ సీపీదే అవుతుందన్నసంగతి ఆ రెండు పార్టీలకూ బాగా తెలుసని ఆమె అన్నారు. అందుకే వీరు ఉప ఎన్నికలు జరిపించరన్నారు. నిజంగా కాంగ్రెస్, టీడీపీలకు దమ్మూ ధైర్యమూ ఉంటే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ఎన్నికలు నిర్వహించాలని ఆమె సవాలు చేశారు. `మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రలో భాగంగా ఆదివారం రాత్రి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఒక భారీ బహిరంగసభలో శ్రీమతి షర్మిల ప్రసంగించారు.

సాక్షులను ప్రభావితం చేయగలిగే మంత్రులు మాత్రం పదవుల్లోనే!
నేరుగా రాజకీయంగా ఎదుర్కొనే చేవ లేక, కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై సీబీఐని వాడుకుని జగనన్నను జైలుపాలు చేశాయని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడితే సీబీఐని ఉసిగొల్పుతారని, జైళ్లలోకి నెడతారనీ సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ అన్నమాటలను ఆమె ఉదాహరించారు. చార్జిషీటులో పేర్లున్నా సాక్షులను ప్రభావితం చేయగలిగే మంత్రులు మాత్రం పదవుల్లో కొనసాగుతుండగా జగనన్న మాత్రం జైలులో ఉండడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలైపోయాయన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినందునే జగన్మోహన్ రెడ్డిగారు జైలులో ఉన్నారంటూ గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు జగనన్నను రాష్ట్రం నుంచి పంపించేయాలని కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.

చంద్రబాబు తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూస్తూ కూడా స్పందించడం లేదని ఆమె విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన పోరాడేది పోయి అధికారపక్షానికి రక్షణ కవచంగా మారి దానిని కాపాడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారనీ ఆమె దుయ్యబట్టారు.

చంద్రబాబు ఊసరవెల్లి!
చిరంజీవి తనకు ఓట్లు వేసిన లక్షల మందిని మోసం చేసి బహిరంగంగా కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోతే, చంద్రబాబు తనకు ఓట్లేసిన కోట్లమందిని పిచ్చివాళ్లను చేసి తెర వెనుక కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారని శ్రీమతి షర్మిల విమర్శించారు. వీళ్లిద్దరికీ పెద్ద తేడా లేదన్నారు. ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయినవాళ్లేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తుగ్లక్ ప్రభుత్వమనీ, కత్తులు, కొడవళ్లు  తీసుకుని కాంగ్రెస్ పార్టీని చంపేయాలనీ మాటలు చెప్పిన చంద్రబాబు చేతల్లో మటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోకుండా కాపాడాడంటే ఆయనను ఊసరవెల్లి అని అనక ఇంకేమనాలని ఆమె ప్రశ్నించారు. 

దున్నపోతు పని చేయదు, చంద్రబాబూ పని చేయరు!
"చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు. రైతులను పేదలను పురుగులను చూసినట్లు చూశారు. జనం వలసలు పోయారు. ప్రతి సంవత్సరం కరెంట్ చార్జీలు పెంచుతానని ప్రపంచ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్నారు. ఏ వాగ్దానాన్నీ నిలుపుకోలేని చంద్రబాబు మళ్లీ వాగ్దానాలు చేస్తున్నారు" అని ఆమె అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఎటు పోయాయని ఆమె నిలదీశారు. దున్నపోతును ఎందుకు దున్నలేదూ అంటే పగలు ఎండ, రాత్రి చీకటి అందట...దున్నపోతు పని చేయదు, చంద్రబాబుగారు కూడా పని చేయరు అని శ్రీమతి షర్మిల అవహేళన చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, మళ్లీ అధికారం వచ్చినా చేయరు అని ఆమె అన్నారు. వెన్నుపోటులోంచి పుట్టిన చంద్రబాబుగారు తనకు లాభం లేనిదే ఏ పనీ చేయరన్నారు. 

వైయస్ ఉండి ఉంటే పులిచింతల ఎప్పుడో పూర్తయ్యేది-
మహానేత వైయస్ బ్రతికే ఉంటే పులిచింతల ప్రాజెక్టు 2009లోనే పూర్తి అయి ఉండేదని శ్రీమతి షర్మిల అన్నారు. "ఇప్పుడున్నకాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డిగారి రెక్కల కష్టం మీద వచ్చిందే తప్ప రాజశేఖర్ రెడ్డిగారి ప్రభుత్వం కాదు. ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లోపించడం వల్ల నాలుగేళ్ళైనా పులిచింతల పూర్తి కాలేదు. మిగిలిన 20 శాతం పనులను కూడా పూర్తి చేయలేదంటే రైతుల పట్ల వీరికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూనే ఉంది" అని ఆమె వ్యాఖ్యానించారు.

"కృష్ణాజిల్లాకు పేరు వచ్చిందే కృష్ణానదీ ప్రవాహం వల్ల. కానీ ఇప్పుడు కృష్ణాజలాలే కనిపించడం లేదు. సాగునీరు లేదు. తాగునీరూ లేదు. ఈ పాపం ఇప్పుడున్న ప్రభుత్వానిది. ఈ పాపంలో చంద్రబాబుకు కూడా భాగం ఉంది.  ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకల్లో కృష్ణపై డ్యాములు కడుతున్నారనీ, వాటిని ఆపకపోతే మనకు నీళ్లు రావనీ, నువ్వు చరిత్ర హీనుడిగా మిగిలిపోతావనీ రాజశేఖర్ రెడ్డిగారు పదేపదే హెచ్చరించినా కూడా కేంద్రంలో చక్రం తిప్పుతున్నది నేనేనని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు పట్టించుకోలేదు. ఇవాళ ఆ నిర్లక్ష్యం ఫలితంగా సాగునీరు, తాగునీరు, కరెంటు ఉత్పత్తికి నీరు లేకుండా పోయింది. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు" అని ఆమె విమర్శించారు. వాళ్ల సమయమంతా వాళ్లని వాళ్లు పొగుడుకోవడానికే సరిపోతోందని ఆమె ఆక్షేపించారు.

రాజశేఖర్ రెడ్డిగారు ఉన్నప్పుడు కన్నతండ్రిలాగా ప్రజల గురించి ఆలోచించారనీ, రైతులు రాజుల్లాగా బ్రతికారనీ ఆమె గుర్తు చేశారు. ఏడుగంటలు ఉచితవిద్యుత్తు ఇచ్చారనీ, పావలా వడ్డీ రుణాలిచ్చారనీ ఆమె పేర్కొన్నారు. మహిళలకు, విద్యార్థులకు ప్రత్యేక పథకాలతో వారి అభివృద్ధికి భరోసా ఇచ్చారన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదవారికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని నాడు వైయస్ అందుబాటులోకి తెచ్చారన్నారు. లక్షల మందికి దానిద్వారా వైద్యసదుపాయం కలిగిందన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇచ్చి వైయస్ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. చంద్రబాబు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర్ రెడ్డిగారు 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారని శ్రీమతి షర్మిల వివరించారు. 

ఒక్క రూపాయి కూడా ఏదీ పెరగలేదు-
చంద్రబాబు హయాంలో వంట గ్యాస్ ధర రెట్టింపు కాగా,  రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ. 306గా ఉన్న గ్యాస్ ధర రూ.306 కూడా కాలేదన్నారు. రాజశేఖర్ రెడ్డిగారు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఏ చార్జీలూ పెరగలేదని ఆమె గుర్తు చేశారు. కొత్త పన్నులు ఒక్క రూపాయి కూడా వేయలేదన్నారు. రాజశేఖర్ రెడ్డిగారి హయాంలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా పెరగలేదన్నారు. కానీ ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయన్నారు. రైతులు అప్పులపాలయ్యారన్నారు. మహిళలు అల్లాడిపోతున్నారు. సంపాదన అంతా చార్జీలు కట్టడానికే సరిపోతోందని జనం వాపోతున్నారన్నారు. నీళ్లు కొనుక్కునే పరిస్థితులు వచ్చాయి, ఇక గాలి కూడా కొనుక్కో మంటారేమోనని ప్రజలు బెంబేలెత్తుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.

వైయస్ పథకాలన్నిటికీ తూట్లు-
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం వైయస్ పథకాలన్నిటికీ తూట్లు పెట్టిందన్నారు. కరెంటు లేకపోయినా మూడింతలు బిల్లులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వం ప్రజల రక్తం పిండైనా కరెంటు బిల్లులు వసూలు చేయజూస్తోందన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి అవిశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా వ్యవహరిం చడం వల్లే ఇంత భారం ప్రజల నెత్తిన పడిందన్నారు. ప్రజలపై భారం మోపిన పాపంలో చంద్రబాబుకూ భాగం ఉందని శ్రీమతి షర్మిల అన్నారు. చంద్రబాబు ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిదిసార్లు కరెంటు చార్జీలు పెంచితే కిరణ్ కుమార్ రెడ్డిగారు నాలుగేళ్లలో నాలుగు సార్లు కరెంటు చార్జీలు పెంచారన్నారు. మరి వీరిని దొందూ దొందే అనక ఇంకేమనాలని ఆమె ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top