కాకినాడ రూరల్: పల్లెల్లో సీసీ రహదారులు వేసేందుకు ఉద్దేశించిన చంద్రన్నబాట పథకం అవినీతికి చిరునామాగా మారుతోంది. ఒక ప్రక్క వేస్తున్న రహదారుల నాణ్యతపై నీలినీడలు కమ్ముకుంటుండగా... మరో ప్రక్క 14వ ఆర్ధిక సంఘం నిధులను తెలుగుతమ్ముళ్లు దోచేస్తున్నారు. పచ్చనేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో రోడ్లు వేసేందుకు వీటిని వినియోగించడంతో పలు విమర్శలకు తావీస్తోంది. ప్రభుత్వ నిబంధనలను చాలా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి ఇంజనీర్లు, పంచాయతీ కార్యదర్శులు రాజకీయ నేతలతో కుమ్మక్కై రోడ్ల నిర్మాణాలను చేపడుతున్నారన్న ఆరోపిస్తున్నారు. పల్లెల్లో అంతర్గత రోడ్ల నిర్మాణంలో పెద్దఎత్తున అవినీతి చోట చేసుకుంటుందని పలువురు వివరిస్తున్నారు. తెలుగుతమ్ముళ్లు తమ పనులతో పాటు తమ వారికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ తాము అనుకున్నవారికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయిస్తున్నారు. పేదలు ఉండే కాలనీల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా వాటిని పట్టించుకోవడం మాని, తెలుగుతమ్ముళ్లు నిర్మించే భవనాలకు రోడ్లు నిర్మిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూరల్ నియోజకవర్గంలో అధికార పెత్తనం ఎక్కువైపోవడం, బెదిరింపులకు దిగడంతో అధికారులు చేసేది లేక ....తెలుగుతమ్ముళ్లు చెప్పిందే వేదం అన్నట్లు మసలుకుంటూ వారి చెప్పిన చోట మంచీ, చెడూ అనేది ఆలోచించకుండా ప్రభుత్వ నిధులు హెచ్చిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.