‌అఖిల పక్షానికి టీడీపీని రావద్దన్నారా?

హైదరాబాద్ :

‘రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి టీడీపీని రావద్దని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించిందా! లేక తన అవకతవకలపై‌ ఇన్నాళ్లూ విచారణకు ఆదేశించనందుకు సోనియా గాంధీకి కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడే వెళ్లొద్దని అనుకుంటున్నారా? తన కుమారుడు లోకేశ్‌బాబుపై కేసులు పెడతారని భయపడి వెళ్లడంలేదా?’ అని వైయస్ఆర్ కాంగ్రె‌స్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాం‌త్‌రెడ్డి ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలో జరిగే అఖిల పక్ష సమావేనికి చంద్రబాబు వెళ్లి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందుకు చెప్పడం లేదో సమాధానం ఇవ్వాలన్నారు.

సమైక్యమని చెప్పండి :
రాష్ట్ర విభజనకు అంగీకరిస్తూ చంద్రబాబు నాయుడు 2008లో లేఖ ఇచ్చి చరిత్రహీనుడిగా మిగిలారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా సమైక్యవాదమే తన వైఖరి అని చెబితే కనీసం మనిషిగానైనా ఆయన మిగులుతారని గడికోట హితవు పలికారు. మెజారిటీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎందుకు నడుచుకోవడం లేదని బాబును ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై తన వందిమాగధులతో ఎదురుదాడి చేయిస్తూ యెల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేయించుకుంటారని విమర్శించారు. రాష్ట్ర విభజన చేయాలని సీడబ్ల్యూసీ ప్రకటించడానికి ముందు తనకు ఏ మాత్రం తెలియనట్లు, వైయస్ఆర్ కాంగ్రె‌స్‌కు ముందే ఎలా తెలిసిందంటూ చంద్రబాబు చేస్తున్న విమర్శలు విడ్డూరంగా ఉన్నాయన్నారు.

జూలై 30న రాష్ట్ర విభజన ప్రకటన రావటానికి ముందు నుంచే టీడీపీకి అనుకూలంగా ఉండే రెండు పత్రికలు జూలై రెండో వారం నుంచే సీడబ్ల్యూసీ ఇలాంటి నిర్ణయం తీసుకోబోతోందని పతాక శీర్షికలతో వార్తలు ప్రచురించటం చంద్రబాబుకు తెలియదనుకోవాలా? అంత తెలియని విధంగా ఉన్నారా! అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌లను గడికోట ప్రదర్శించారు. విభజన నిర్ణయం జరిగిపోతోందని తెలిసే అడ్డుకునేందుకు తమ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారని, మరి టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలన్నారు.‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి దమ్మూ, ధైర్యం ఉన్నాయి కనుకనే సమైక్యవాదమే తన వైఖరి అని ప్రకటించారని, చంద్రబాబుకు ఆ ధైర్యం లేదని అన్నారు.

ప్రజలకు ఏం జబాబు చెప్తారు? :
సమైక్రాంధ్రకు మద్దతు ఇస్తున్నానని లేఖ రాయకుండా చంద్రబాబు రెండవ విడత ఆత్మగౌరవ యాత్రకు ఎలా వెళతారని శ్రీకాంత్‌రెడ్డి దుయ్యబట్టారు. ‘హైదరాబాద్‌ను సీమాంధ్రకు కాకుండా చేస్తున్నందువల్ల తమ పిల్లలు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని విద్యార్థు తల్లిదండ్రులు అడిగితే యాత్రలో చంద్రబాబు ఏం సమాధానం చెబుతారరి నిలదీశారు. విభజన వల్ల నష్టపోయే రైతులు, పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తే ఏం చెబుతారన్నారు? రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఎందుకు కోరవని ప్రజలు ప్రశ్నిస్తే ఆయన ఏం చెబుతార’ని అన్నారు.

Back to Top