చరిత్రలో నిలిచే మరో ప్రజా ప్రస్థానం

అనంతపురం:

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలను ఎండగడుతూ మహానేత వైయస్ తనయ, జననేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ చేపట్టిన మూడు వేల కిలోమీటర్ల ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని వైయస్ఆర్  కాంగ్రెస్ పార్టీ సీఈసీ సభ్యుడు, ఉరవకొండ నియోజకవర్గ బాధ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. షర్మిల పాదయాత్రలో భాగంగా కూడేరులో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. పార్టీలు, కులాలు, మతాలకతీతంగా షర్మిల పాదయాత్రకు నీరాజనాలు పలుకుతున్నారన్నారు. ఇందుకు కారణం మహానేత వైయస్‌పై ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలు, ఆయన ఆశయాలను నెరవేర్చేది జగన్ మాత్రమేనని బలంగా నమ్ముతుండటమేనని చెప్పారు. కాంగ్రెస్‌ను మహానేత బలోపేతం చేసి.. దేశంలోనే ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారన్నారు.  వైయస్ మరణం తర్వాత కాంగ్రెస్ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా  మారిందన్నారు. వైయస్ అమలు చేసిన పథకాలన్నింటినీ ఈ ప్రభుత్వం నీరుగారుస్తోందని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే జననేత జగన్ ప్రజా ఉద్యమాలతో కాంగ్రెస్, టీడీపీలకు ముచ్చెమటలు పట్టించారన్నారు. జగన్‌కు వస్తోన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కక్ష గట్టి జైలుకు పంపాయని విమర్శించారు. జగన్ బయటకొస్తే కాంగ్రెస్, టీడీపీలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైయస్ఆర్  సీపీలో చేరతారనే నిఘా వర్గాల సమాచారంతో బెయిల్ రాకుండా అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు పాదయాత్రకు జనస్పందన కరువైందన్నారు. అధికారం కోసం ఆయన కంటున్న కలలు నెరవేరవన్నారు. ఇప్పటికే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోన్న టీడీపీ... షర్మిల పాదయాత్ర తర్వాత బతికి బట్టకట్టడం కష్టమేనన్నారు. ఇటీవలి ఉపఎన్నికల్లో ఆ పార్టీకి ఆరు చోట్ల ధరావతులు దక్కకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైయస్ఆర్‌ సీపీ విజయభేరి మోగిస్తుందని, జగన్ సీఎం అవడం ఖాయమని స్పష్టం చేశారు.

Back to Top