అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఆయన్ను ఘరానామోసగాడితో పోల్చవచ్చు అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకర్‌నారాయణ విమర్శించారు. డాక్టర్ పీవీ సిద్దారెడ్డి అధ్యక్షతన శనివారం కదిరి నియోజకవర్గ ప్లీనరీ నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌నారాయణ మాట్లాడుతూ..చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయం అయ్యిందన్నారు. రైతులు తీవ్ర కరువుతో అల్లాడుతుంటే రెయిన్‌గన్లతో కరువును పారద్రోలామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కార్యక్రమంలో మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్, మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, మడకశిర ఇన్‌చార్జ్ డాక్టర్ తిప్పేస్వామి, పార్టీ సీఈసీ సభ్యులు జక్కల ఆదిశేషు, పూల శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి బత్తుల హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.