సంక్షేమ హాస్టల్స్‌ను గాలికొదిలేసిన చంద్రబాబు

  • సన్న బియ్యమని విద్యార్థులకు పురుగుల బియ్యం పెడతారా?
  • దున్నపోతు మీదవాన పడిన చందాన మంత్రి రావెల తీరు
  • వైయస్‌ఆర్‌సీపీ నేతలు మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డి
గుంటూరు: చంద్రబాబు ప్రభుత్వం దళిత సంక్షేమ వసతి గృహాలను గాలికొదిలేసిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలోని సోషల్‌ వెల్ఫేర్‌ స్టూడెంట్స్‌ హాస్టల్స్‌ను పార్టీ సీనియర్‌ నేత లేళ్ల అప్పిరెడ్డితో కలిసి మేరుగు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. హాస్టల్స్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మేరుగు నాగార్జున, లేళ్ల అప్పిరెడ్డిలు మాట్లాడుతూ హాస్టల్స్‌లో విద్యార్థుల ఇక్కట్లపై సోషల్‌ వెల్ఫేర్‌ మంత్రి, డిపార్ట్‌మెంట్‌ సంక్షేమం వసతి గృహాలపై దృష్టి సరిగ్గా పెట్టడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం దళిత విద్యార్థులకు నిలవనీడ లేకుండా చేస్తోందని విమర్శించారు. విద్యార్థులకు తిండి కూడా సరిగ్గా పెట్టడం లేదని ఆరోపించారు. సన్నబియ్యం పెడుతున్నామని గొప్పలు చెప్పుకుంటూ పురుగుల బియ్యం పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో కొన్ని వసతి గృహాల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు. గోదాంలలో ముక్కిపోయిన రేషన్‌ బియ్యాన్ని తీసుకువచ్చి హాస్టల్స్‌లో విద్యార్థులకు పెడుతున్నారని ఫైరయ్యారు. 

వైయస్‌ఆర్‌లా చేయడం మీ వల్లకాదు
సాంఘీక, సంక్షేమ శాఖామంత్రి రావెల కిషోర్‌కు విద్యార్థుల సమస్యలపై ఎన్ని సార్లు చెప్పినా దున్నపోతుపై వానపడినట్లే ఉందని మేరుగు ఆరోపించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు హాస్టల్స్‌ తనిఖీ చేయడంతో ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చిందన్నారు. మేం తనిఖీలు చేసిన హాస్టల్స్‌కు వెళ్లకుండా మంత్రి రావెల వేరే హాస్టల్స్‌కు వెళ్లి ఒక రాత్రి నిద్రించి జిల్లాలోని అన్ని హాస్టల్స్‌ బాగున్నాయని చెప్పడం సరికాదన్నారు. ఒక్కసారి దివంగత మహానేత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌ పాలనను గుర్తు చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దళిత విద్యార్థుల కోసం ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. వైయస్‌ఆర్‌లా దళిత విద్యార్థులకు మేలు చేయడం మీ వల్లకాదు కానీ ఆయనలో కొంతైనా చేయాలని చురకంటించారు. దళిత విద్యార్థులకు రాజ్యాంగ బద్ధంగా రావాల్సిన స్కాలర్‌షిప్‌లు, భోజన సదుపాయాలను వెంటనే కల్పించాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేతగాని దద్దమ్మలా ఉంటే విద్యార్థుల వసతి గృహాల అభివృద్ధి కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏ విధంగా పోరాటం చేయాలో తెలుసని హెచ్చరించారు. 

 
Back to Top