కుమ్మక్కై హోదాను అడ్డుకుంటున్నారు..!

కొత్తూరు (శ్రీకాకుళం జిల్లా): ఈనెల 7 నుంచి గుంటూరు నల్లపాడు రోడ్డులో ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టనున్న నిరవధిక నిరహార దీక్షను ప్రతిఒక్కరూ విజయవంతం చేయాలని....శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు. కొత్తూరు మండలం వైఆర్ పేటలో  జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ దీక్షకు ప్రజలందరూ సహకరించాలని ఆమె కోరారు. టీడీపీ-బీజేపీలు కుమ్మక్కై ప్రత్యేక హోదా రాకుండా  అడ్డుకుంటున్నారని రెడ్డి శాంతి ఆరోపించారు. 

ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. 13, 14 వ ఆర్థిక సంఘం నిధుల్లో గ్రామ పంచాయతీలకు సంబంధించిన నీటి పన్ను, విద్యుత్ చార్జీలను మినహాయించడం దారుణమన్నారు. అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.
Back to Top