డబ్బు సంచులు మోసినోళ్లకే కాంట్రాక్టులు

  • ఏపీలో మరో దోపిడీకి తెరలేపిన చంద్రబాబు
  • భావనపాడు పోర్టు లొసుగులను బయటపెట్టాలని డిమాండ్‌
  • రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్మాణంలో పారదర్శకత లేదు
  • ఇసుక మాఫియాను ప్రోత్సహించి 16 మందిని పొట్టనబెట్టుకున్న ప్రభుత్వం
  • ప్రభుత్వ దోపిడీపై ప్రశ్నిస్తే ప్రతిపక్షం అభివృద్ధికి ఆటంకం అంటారా..?
  • దినకరణ్‌ని అరెస్టు చేసినట్లుగా బాబును ఎందుకు అరెస్ట్‌ చేయరు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ
హైదరాబాద్‌: ఎన్నికల్లో డబ్బు సంచులు మోసినోళ్లకు, పెట్టుబడులు పెట్టిన వారికి ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రతిదాన్ని నామినేషన్‌ల ద్వారా దొడ్డిదారిన టీడీపీ తాబేదారులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో బాబు మరో దోపిడీకి తెరలేపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భావనపాడు పోర్టుకు గ్లోబల్‌ టెండర్లు ఎందుకు పిలవలేదని బొత్స ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పోర్టు ఆదాయంలో 2.3 శాతం వాటాను రాష్ట్ర  ప్రభుత్వానికి ఇవ్వడానికి జరిగిన ఒప్పందాల వెనక ఉన్న లొసుగులు ఏంటో బయటపెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. నామినేషన్‌ల ద్వారా కాంట్రాక్టులు ఇచ్చే ప్రభుత్వ దోపిడీ విధానాన్ని బొత్స ఖండించారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని ప్రకటించిన తరువాత కమిషన్లు, కాంట్రాక్టులకు కక్కుర్తిపడి రాష్ట్ర ప్రభుత్వం చేజిక్కించుకుందని ఆరోపించారు. రూ. 16 వేల కోట్లున్న ప్రాజెక్టు అంచెనాలను రూ. 40 వేల కోట్లకు చంద్రబాబు పెంచారని దుయ్యబట్టారు. అందులో రూ. 6 వేల కోట్ల పనులను సీఎం కార్యాలయంలో పంచాయతీలు చేసి అక్కడే కాంట్రాక్టులు ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ రూ. 6 వేల కోట్లలో దోచుకుతింటుంది, దోపిడీలు చేస్తున్నది నిజమా.. కాదా..? అని చంద్రబాబును నిలదీశారు. 

బాబు మోచేతినీళ్లు తాగేవాళ్లుకు కాంట్రాక్టులు ఇప్పించే కుట్ర
రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, దోపిడీపై ప్రధాన ప్రతిపక్షం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతాయుతంగా మాట్లాడితే అభివృద్ధికి అడ్డం అంటూ ప్రభుత్వం బురదజల్లె కార్యక్రమం చేస్తుందని బొత్స మండిపడ్డారు. రాజధానికి, అభివృద్ధికి వైయస్‌ఆర్‌ సీపీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరుతో ప్రభుత్వం చేసే దోపిడీకి మాత్రమే వ్యతిరేకమని స్పష్టం చేశారు. స్విస్‌ చాలెంజ్‌ అనే పదాన్ని తీసుకొచ్చి సింగపూర్‌ కంపెనీతో ఒప్పందాలు కుదర్చుకొని రాష్ట్ర భూములను వారి కట్టబెట్టాలనే ప్రయత్నం, తాత్కాలిక భవనాలని చెప్పి ఎవరైతే చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారో వారికి కాంట్రాక్టులు ఇచ్చి అంచెనాలను పెంచే కార్యక్రమం  చేయడంలాంటి వాటికి వ్యతిరేకం అని చెప్పారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు చేపట్టినా పారదర్శకంగా టెండర్లు పిలిచి నిర్మాణం చేపడుదామన్న ఆలోచనే ప్రభుత్వానికి లేదని బొత్స ధ్వజమెత్తారు. ఏదో విధంగా చంద్రబాబు మనుషులకు, వారి తాబేదారులకు రాష్ట్ర ధనాన్ని అప్పగించాలనే కుట్ర జరుగుతుందన్నారు. పట్టిసీమ, పురుషోత్తపట్నం ఇలా ఏదీ పారదర్శకంగా జరగడం లేదన్నారు. ఆఖరికి ప్రజలకు అందాల్సిన వైద్య సేవలను కూడా వదలడం లేదని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇసుక మాఫియాను ప్రోత్సహించి చిత్తూరులో 16 మంది పొట్టనబెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దెందులూరులో ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే దాడిచేసినప్పుడే ఇసుక మాఫియాను అరికట్టివుంటే ఇవాళ 16 మంది ప్రాణాలు పోయుండేవికావు కదా అని చంద్రబాబుకు సూచించారు. ఒక పక్క దోపిడీని ప్రేరేపిస్తూ మరో పక్క బాధపడుతున్నట్లుగా చంద్రబాబే లీకులు వదులుకుంటున్నారని ధ్వజమెత్తారు. 

బాబు ప్రజలకు క్షమాపణలు చెప్పేరోజులు దగ్గరపడ్డాయ్‌
తమిళనాడు రాష్ట్రంలో రెండాకుల కోసం దినకరణ్‌ లంచం ఇచ్చారని ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ పోలీసులు అరెస్టు చేస్తే, మీ ఎమ్మెల్యేని మీ రాష్ట్రంలో కొనుగోలు చేస్తుంటే మీరేం చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. చంద్రబాబు ఓటుకు కోట్లు కేసును ఎందుకు నీరుగారుస్తున్నారని నిలదీశారు. చంద్రబాబు ఆయనకు తెలిసిన టక్కుటమారపు విద్యలతో మేనేజ్‌ చేయడానికి ప్రయత్నిస్తే మీరెలా లొంగిపోతున్నారన్నారు. ప్రజలకు చట్టాల మీద నమ్మకం కోల్పోయే పరిస్ధితులు వ్యవస్థలే తీసుకొస్తున్నాయన్నారు. చంద్రబాబు దోపిడీలు, అవినీతిపై ఎవరైనా కోర్టుకు వెళితే అభివృద్ధికి ఆటంకం అని డైలాగ్‌లు వేస్తున్నారని, అదే దోపిడీకి ఒప్పుకుంటె బ్రహ్మాండం అంటారా అని చంద్రబాబును నిలదీశారు. రాష్ట్రంలో ప్రతిది లాలూచీతో జరుగుతుందని, బాబు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఇష్టానుసారంగా నా మాటే చెల్లుతుందనుకుంటే పొరబాటని, చేసిన తప్పులకు, దోపిడీలకు ప్రజలకు క్షమాపణ చెప్పి పరిహారం చెల్లించుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. 
Back to Top