చంద్రబాబు అండతో కిరణ్‌కుమార్ మిడిసిపాటు

పెడన, 03 మార్చి 2013:

మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపట్టి తాను 1500 కిలోమీటర్లు పూర్తిచేయగలగడానికి స్ఫూర్తి దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ 2003లో చేపట్టిన ప్రజా ప్రస్థానమేనని ఆయన తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర బుధవారం నాడు 110వ రోజు పూర్తిచేసుకుంది. అలాగే 1500 కిలోమీటర్ల మైలు రాయిని కూడా దాటింది. ఈ సందర్భంగా ఆమె పెడనలో 18 అడుగుల ఎత్తయిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం పెడన బస్ స్టాండ్ సెంటర్లో ఏర్పాటైన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. పేదల బతుకులు బాగుపడాలన్న రాజన్న కల జగనన్న నెరవేరుస్తారని హామీ ఇచ్చారు.  వేల సంఖ్యలో హాజరైన ప్రజలు ఆమె మాటలకు తమ కరతాళధ్వనులతో హర్షాన్ని వ్యక్తంచేశారు. ఆమె ప్రసంగం ఆమె మాటల్లోనే...

సమస్యలు తెలుసుకోడానికి కాదు.. ధైర్యం చెప్పడానికి
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు అప్పుల బాధ తాళలేక మరణిస్తుంటే.. రాజశేఖరరెడ్డిగారు మంచి కాలం ముందుందని రైతన్నలకు భరోసా కల్పిస్తూ మండుటెండలో పాదయాత్ర చేశారు. ఆయన పాదయాత్రకు కొనసాగింపుగానే మరో ప్రజా ప్రస్థానం చేపట్టాను. చంద్రబాబు పాలనకు కొనసాగింపుగా కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు పాలన పార్టు 2ను కొనసాగిస్తున్నారు. నేను చేపట్టిన పాదయాత్ర ఉద్దేశం కూడా మంచి రోజులు ముందున్నాయని చెప్పడమే. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి నేనీ పాదయాత్ర చేయడం లేదు. ప్రజలు కష్టాల్లో ఉన్నారు కాబట్టి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారి కష్టాలను తీర్చడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టీ.. ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ప్రజలను గాలికొదిలేసింది కాబట్టీ... ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్న ఈ ప్రభుత్వాన్ని కాపాడుతుంది కాబట్టీ... రైతులు.. చేనేతలు, విద్యార్థులు, మహిళలు, తదితరులకు ధైర్యం చెప్పడం కోసం ఈ పాదయాత్ర చేస్తున్నా. మంచిరోజులు ముందున్నాయనీ, రాజన్న రాజ్యం వస్తుందనీ, జగనన్న దాన్ని స్థాపిస్తాడనీ చెప్పి ప్రజలకు ధైర్యం కల్పించడం కోసం మీ చెంతకు బయలుదేరాను.

రాజన్న పాలన ఓ సువర్ణయుగం
రాజశేఖరరెడ్డిగారి ఐదేళ్ళ పాలన ఒక సువర్ణ యుగంలా నడిచింది. ఆయన రైతులను రాజులుగా చూశాడు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించాడు. రైతులకు నీళ్ళిచ్చాడు.. కరెంటిచ్చాడు.. విత్తనాల ధరలను పెరగనివ్వలేదు. ఎరువుల ధరలనూ పెరగనివ్వలేదు. మద్దతు ధర కల్పించి వారిలో విశ్వాసాన్ని పాదుగొలిపాడు. రైతుకేది ఎప్పుడు అవసరమో అప్పుడు అన్నీ ఇచ్చాడు. 12వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేశారు. మహిళలకి పావలా వడ్డీకే రుణాలిచ్చాడు. మహిళలంతా తన అక్కచెల్లెళ్ళేననీ, వారంతా లక్షాధికారులు కావాలనీ మహానేత తపించారు. విద్యార్థులు పెద్ద చదువులు చదువుకోవాలని ఫీజు రీయింబర్సుమెంటు ప్రవేశపెట్టి లక్షలాదిమందికి ఉచితంగా చదువు చెప్పించారు. లక్షల సంఖ్యలో పక్కా ఇళ్ళు కట్టించారు. పేదల ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ఫోను చేసిన 20 నిముషాలలో ఇంటి ముంగిటకు వచ్చే  108 సర్వీసును ప్రారంభించారు. ఇలాంటివన్నీ ఎన్నో చేశారు రాజన్న.

కుమ్మక్కు రాజకీయాలే ప్రభుత్వానికీ, బాబుకూ ఊపిరి
కానీ... ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడున్నది కాంగ్రెస్ నేతృత్వంలోని కిరణ్ కుమార్ రెడ్డి పాలన. ఈ పాలనలో ప్రజలంతా అల్లాడుతున్నారు. మాకు బతుకు భారమైందని ఆవేదన చెందుతున్నారు. అప్పులపాలయ్యామని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. కిరణ్ పాలనలో వ్యవసాయానికీ, ఇళ్ళకూ కరెంటు ఉండటం లేదు. విద్యార్థులకి చదువులు బంద్. పరిశ్రమలకు పవర్ బంద్. కార్మికులకు పని బంద్. రాష్ట్రానికి ప్రగతి బంద్. ప్రజలకు మనశ్శాంతి బంద్. అన్నీ బందయిపోయాయి. రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. కానీ లేని కరెంటుకు ఈ ప్రభుత్వం మూడింతలు చార్జీ వసూలు చేస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డిగారింట్లో కరెంటు పోతుందా అని మొన్నో మహిళ నన్నడిగింది. ఆయన కరెంటు బిల్లు కడతారా అని ప్రశ్నించింది. ఆయనింట్లో కరెంటుపోదు.. ఆయన కరెంటు బిల్లు కట్టరు కనక ఆయనకు ప్రజల బాధలు పట్టవు. ప్రజల్లోంచి పుట్టిన నాయకుడైతే ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటారు. కానీ కిరణ్ కుమార్ రెడ్డిగారు ఢిల్లీనుంచి సీల్డు కవర్లోంచి ఊడిపడ్డ ముఖ్యమంత్రి కనుక ఆయనకి కష్టాలు అర్థంకావు. ప్రజలంటే ఎందుకంత నిర్లక్ష్యం అని కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నిస్తోంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేని కరెంటుకు బిల్లులు వసూలు చేయడం ఏమిటి ముఖ్యమంత్రి గారు!. ఆయన మూడేళ్ళలో 32 వేల కోట్ల రూపాయలను కరెంటు చార్జీల కింద ప్రజల నెత్తిన భారాన్ని మోపారు. అది చాలదన్నట్లు 6500 కోట్లు మళ్ళీ భారాన్ని మోపారు. తానేం చేసినా చంద్రబాబు తనకు అండగా ఉంటారని కిరణ్ కుమార్ రెడ్డి విర్రవీగుతున్నారు. నాలుగేళ్ళలో మొత్తం 38500 కోట్ల రూపాయలను విద్యుత్తు చార్జీల కింద, పదివేల కోట్ల రూపాయలను వ్యాట్ కింద ప్రజలపై భారం మోపడానికి కారణం చంద్రబాబే. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారు. తనపై ఉన్న ఐఎమ్‌జీ, ఎమ్ఆర్ కేసులలో విచారణ చేపట్టకుండా ఉండేందుకే ఆయన ఇలా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడారు కాబట్టే ప్రజల నెత్తిన ఇంత భారం పడింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి చంద్రబాబు మద్దతు పలికుంటే ప్రజలపై ఈ భారం పడేది కాదు. కిరణ్ కుమార్, చంద్రబాబు ఇద్దరూ కలిసి ప్రజల రక్తం తాగుతున్నారు. చంద్రబాబు ఎనిమిదేళ్ళలో ఎనిమిదిసార్లు, కిరణ్ కుమార్ నాలుగేళ్ళలో నాలుగుసార్లు కరెంటు చార్జీలను పెంచారు. దొందూ దొందే అనకుండా వీరినేమనాలి. అవిశ్వాస తీర్మాన సమయంలో చంద్రబాబు ప్రజల పక్షాన నిలబడాలనే అంశాన్ని పూర్తిగా విస్మరించారు. తీర్మానానికి అనుకూలంగా ఓటేయవద్దని విప్ కూడా జారీ చేసి ప్రజా కంటక ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలబడ్డారు. ఇలాంటి చంద్రబాబును ప్రధాన ప్రతిపక్ష నాయకుడంటారా లేక దుర్మార్గుడంటారా? కాంగ్రెస్ అధికారంలో ఉందంటే ఆ పాపం చంద్రబాబుదే. ఒకప్పుడు సొంత మామను వెన్నుపోటు పొడిచిన ఆయన ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ప్రజలను వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు.

కేంద్రం చేతిలో కీలుబొమ్మ సీబీఐ
కేంద్రం చేతిలో సిబిఐ కీలు బొమ్మ. దానికి విలువ, విశ్వసనీయత లేవు. కాంగ్రెస్ను ఎవరైతే వ్యతిరేకిస్తారో వారిమీద సిబిఐ విరుచుకుపడుతుంది. కక్ష గట్టి జగన్నను జైలులో పెట్టించారు. ఆరు నెలలో విచారణ పూర్తి చేయవలసి ఉన్నా పూర్తి చేయలేదు. ఛార్జిషీట్ల దాఖలు పూర్తి కాలేదు. సిబిఐ కేంద్రం చెప్పుచేతలలో ఉందనటానికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేంకావాలి. చిరంజీవి వియ్యంకుడి ఇంట్లో 70 కోట్ల రూపాయలు దొరికితే సిబిఐకి పట్టదు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై మాఫియా డాన్ అని ఆరోపణలు వచ్చినా సిబిఐ పట్టించుకోదు. కాంగ్రెస్ గిట్టనివారిపై కేసులు పెట్టించి కక్షసాధిస్తుంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చడానికి ఏమాత్రం వెనకాడలేదు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అండ చూసి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విర్రవీగుతున్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టకుండా చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నారు. రెండెకరాలతో ప్రారంభమైన బాబుకు ఎక్కడ చూసినా ఆస్తున్నాయి.  దుబాయ్, మలేషియా, సింగపూర్ లలోనూ ఉన్నాయి. ఎన్టీఆర్ చేసిన రెండు ప్రధానమైన హామీలను చంద్రబాబు నీరుగార్చేశారు. సంపూర్ణ మద్య నిషేధాన్ని బెల్టు షాపులతోనూ, రెండు రూపాయల బియ్యం పథకం ధరను 5.50 రూపాయలకు పెంచి ఆయన ఆశయాన్ని తుంగలో తొక్కారు. ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేదలనుంచి కూడా యూజర్ చార్జీలను వసూలు చేసిన ఘనుడు చంద్రబాబు. పొరుగు రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్న అంశాన్ని రాజశేఖరరెడ్డిగారు ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఎంతగా చెప్పినా వినలేదు. ఈ కారణంగానే ఇప్పుడు మన రాష్ట్రానికి నీరు కరవైంది. ఫలితంగా విద్యుదుత్పత్తికి అవకాశమూ లేకుండా పోయింది. ఈ పాపం చంద్రబాబుదే. ఆయనకు విలువలు, విశ్వనీయత లేదు. ఆయనకు మాట ఇవ్వడం తప్ప దానిమీద నిలబడడమనే లక్షణం లేనే లేదు.

Back to Top