చార్జీలు తగ్గించేవరకూ దీక్ష ఆపం: విజయమ్మ

హైదరాబాద్, 05 ఏప్రిల్ 2013:

రాష్ట్ర ప్రజలపై రూ.6,344 కోట్ల మేర విద్యుత్తు చార్జీల భారం వేసి 830 కోట్ల రూపాయలు తగ్గిస్తానని ముఖ్యమంత్రి చెబుతుండడం దారుణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మండిపడ్డారు. ఇంత తక్కువ తగ్గించి ఎవరికి భిక్షం వేస్తున్నారని  ప్రశ్నించారు.  కొంతమేర తగ్గించినట్లు గురువారం ముఖ్యమంత్రి ప్రకటించిన కొద్దిసేపటికి రాత్రి 9 గంటలకు ఆమె కరెంటు సత్యాగ్రహ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ప్రకటన ఏ మాత్రం హర్షణీయంగా లేదని వ్యాఖ్యానించారు.

150 నుంచి 200 యూనిట్లు వాడుకునే విద్యుత్తు గృహ వినియోగదారులు కాక మిగతా వారందరినీ క్యాపిటలిస్టులుగా(పెట్టుబడిదారులు) ముఖ్యమంత్రి పేర్కొనడం గర్హనీయమని విజయమ్మ చెప్పారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారిని కూడా క్యాపిటలిస్టులు అన్నారంటే ఏమనాలో తెలియడం లేదన్నారు. రైతులకు పల్లెల్లో రెండు మూడు గంటల కంటే ఎక్కువ కరెంటు ఇవ్వడం లేదనీ, దాని గురించి ముఖ్యమంత్రి ఏమీ మాట్లాడలేదనీ విమర్శించారు. పరిశ్రమలు పెద్ద సంఖ్యలో మూత పడ్డాయనీ, వాటి గురించి ఒక్క మాటా చెప్పలేదనీ ధ్వజమెత్తారు.

దీక్ష ఆగదు: పెంచిన చార్జీలను మొత్తంగా తగ్గించాలనేది తమ పార్టీ డిమాండనీ, అప్పటి వరకూ దీక్ష కొనసాగుతుందనీ విజయమ్మ స్పష్టంచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పిలుపునిచ్చినట్లు శుక్రవారం నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమం, 9న బంద్ చేపడతామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొనాలని ఆమె కోరారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి పాదయాత్ర ప్రారంభించి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ప్రస్తుతం రాష్ట్రంలో ఆనాటి పరిస్థితులే ఉన్నందున దానికి గుర్తుగా 9న నిర్వహిస్తున్న బంద్‌లో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆ రోజున డాక్టర్ వైయస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకాలు చేసి కార్యకర్తలు కనీసం రెండు కిలోమీటర్లు పాదయాత్రలు చేసి బంద్ నిర్వహించాలని పేరు పేరునా కోరుతున్నానని అన్నారు.

బషీర్ బాగ్ ఉదంతంలో ముగ్గురిని పొట్టన పెట్టుకున్న టీడీపీకి కరెంటు ఉద్యమం చేసే నైతిక అర్హత అసలు లేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి అన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టినపుడు అసెంబ్లీలో ప్రభుత్వానికి మద్దతునిచ్చి బయటకు వచ్చి ప్రజలను మభ్యపెట్టడానికే టీడీపీ ఆందోళన చేస్తోందన్నారు. తక్కువ ధరకు బొగ్గు లభిస్తున్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తే ప్రభుత్వాన్ని టీడీపీ ఎందుకు ప్రశ్నించదని ఆమె అన్నారు. గ్యాస్ లభ్యమవుతున్న ధర కన్నా ఎక్కువ ధరకు కొంటున్నా ఎందుకు టీడీపీ కిమ్మనడం లేదన్నారు.

Back to Top