రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సంబరాలా..?

ప్రజలను మభ్యపెట్టి బాబు పబ్బం గడుపుకుంటున్నారు
ఏ గ్రామంలో రుణాలు మాఫీ చేశారు బాబు మీరు
ముద్రగడ ఆరోగ్యం క్షీణించడానికి చంద్రబాబే కారణం
మైనారిటీల ఇళ్లు కూల్చేయడం అన్యాయం
బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
వికలాంగులకు సైకిళ్లు, కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన ఎంపీ

ప్రకాశం(ఒంగోలు): ఎన్నికల ముందు అమలుగాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టిన చంద్రబాబు...అధికారంలోకి వచ్చాక కూడా అదే పనిచేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని  వైయస్సార్సీపీ ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. ఓ పక్క రుణాలు మాఫీగాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే..ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏ ఒక్కరికీ రుణమాఫీ చేయకుండానే..రెండో విడత, మూడో విడత, నాలుగో విడత అంటూ ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ గ్రామంలో రుణాలు పూర్తిగా మాఫీ చేశారో చెప్పాలని వైవి సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.  ఒంగోలులో వికలాంగులకు  కృత్రిమ అవయవాలు, సైకిళ్లు పంపిణీ చేశారు. ఈసందర్భంగా వైవి సుబ్బారెడ్డి అక్కడ విలేకరులతో మాట్లాడారు.  

బాబు చేసిన మాఫీ వడ్డీల్లో పావు వంతు కూడా సరిపోలేదని వైవి సుబ్బారెడ్డి దుయ్యబట్టారు. బాబు హామీలిచ్చి ఎలా మోసం చేశారో,  ప్రజలు అన్నీ గమనిస్తున్నారని...సరైన సమయంలో తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మొదటిసారి ముద్రగడ దీక్ష చేసినప్పుడు ఆయన కోరిన హామీలను నెరవేరుస్తామని చెప్పి దీక్ష విరమింపజేసిన చంద్రబాబు..ఇప్పుడు అవి ఎందుకు నెరవేర్చడం లేదని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ముద్రగడ ఆరోగ్యం క్షీణించిపోవడానికి, ప్రజలు ఆందోళన చెందడానికి కారణమైన చంద్రబాబు.. దాన్ని ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ముద్రగడ డిమాండ్లకు ఒప్పుకొని ఆయన ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచించారు. 

ప్రకాశం జిల్లాలోని  12 అసెంబ్లీ స్థానాలను రానున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని వైవి ధీమా వ్యక్తం చేశారు. అందరం కలిసి పనిచేసి అనుకున్నది సాధిస్తామని చెప్పారు. రామయపట్నం పోర్టు అభివృద్ధి చేస్తే, ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతుందని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పటికే దీనిపై రెండు సార్లు ప్రధానమంతిని కలిశానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని చెప్పారు. పోర్ట్ అభివృద్ధి తప్పకుండా జరిగి తీరుతుందన్నారు. ఒంగోలులో మైనారిటీలకు సంబంధించిన ఇళ్లను కూల్చేయడం అన్యాయమని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా ఎలా కూలుస్తారని ప్రశ్నించారు. రంజాన్ మాసంలో వారిని నిరాశ్రయులు చేయడం దారుణమన్నారు. 

Back to Top