భూదోపిడీకి ప్రభుత్వం, పోలీసుల కుట్ర..!

రైతుల పంటలు తగలబెట్టి వారిపైనే కేసులు..!
నిజం నిగ్గు తేల్చిన బార్ అసోసియేషన్ ..!
సురేశ్‌ను దాచిపెట్టి బలవంతంగా ఒప్పించేందుకు వేధింపులు...!

హైదరాబాద్: మల్కాపురం చెరకు తోట దహనంపై బెజవాడ బార్ అసోసియేషన్ నియమించిన నిజ నిర్ధారణ కమిటీ పోలీసులు, ప్రభుత్వ కుట్రను బయటపెట్టింది.  రాజధాని ప్రాంతంలో భూసమీకరణకు ముందుకు రాని రైతుల్ని లొంగదీసుకునేందుకు పోలీసులు బెదిరింపుల ఎత్తుగడను అమలు చేస్తున్నట్లు తేల్చింది. పేదలను  వేధించడం, హింసించడం మానుకోవాలని పోలీసులకు విజ్ఞప్తి చేసింది. సాక్ష్యాధారాలను తారుమారు చేసి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చేందుకు  పోలీసు యంత్రాంగం కుట్ర చేస్తున్నట్టు తేల్చింది.
 
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో ఈనెల 23న .... రైతు గద్దె చంద్రశేఖర్ చెరుకు పంటను దుండగులు తగలబెట్టారు. ఆతర్వాత పోలీసుల వేధింపులు ఎక్కువవడంతో ఆప్రాంత ప్రజలు చేసిన ఫిర్యాదు మేరకు బెజవాడ బార్ అసోసియేషన్ ఒక నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. బార్ అసోసియేషన్, ఓపీడీఆర్, పీయూసీఎల్, పీఓడబ్ల్యూ సభ్యులు 8మందితో కూడిన కమిటీ తుళ్లూరు, మల్కాపురం, తుళ్లూరు పోలీసుస్టేషన్, గుంటూరు పోలీసుక్లబ్‌ను సందర్శించడంతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో చర్చలు జరిపింది. 
 
తోట యజమాని గద్దె చంద్రశేఖర్ మేనల్లుడు సురేశ్‌ను విచారణ పేరిట తుళ్లూరు పోలీసులు ఈనెల 28న సాయంత్రం 5 గంటలకు తీసుకువెళ్లారు. ఇప్పుడాయన తుళ్లూరు పోలీసుల వద్ద లేరు.  ఎక్కడున్నారో చెప్పడం లేదు. పంట తగలబెట్టిన అసలు దోషులను పట్టుకోకుండా..బాధిత రైతుల పైనే కేసుపెట్టారు. 24 గంటల్లో విచారించి వదిలిపెట్టాల్సి ఉండగా ఆపని చేయకుండా ఎక్కడో దాచిపెట్టి పచ్చనేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారు. చంద్రశేఖర్, మరో రైతు మీరా ప్రసాద్‌లను మూడు రోజుల పాటు స్టేషన్ లో విచారణ పేరుతో వేధించి వదిలిపెట్టారు.
 
తన మేనమామ చంద్రశేఖర్ చెప్పినందునే తోటను తగలబెట్టినట్టుగా సురేశ్‌తో బలవంతంగా చెప్పించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారు. సురేశ్‌తో ఈ మేరకు అంగీకార పత్రాన్నీ రాయించుకున్నట్టు కమిటీ అనుమానించింది. భూసమీకరణకు అంగీకరించని వారందర్నీ ఒప్పించేందుకు పోలీసులు సురేశ్‌ను పావుగా ఉపయోగించుకోబోతున్నారు. ఈ విషయంలో ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా ఉన్నట్టు నాటకం ఆడుతున్నారు. ఈనెల 22న రాజధానికి శంకుస్థాపన జరిగిన రోజు మధ్యాహ్నం 2.30- 4.00 గంటల మధ్యే తోట తగలబడినట్టు పోలీసులు చేస్తున్న వాదనలో ఏమాత్రం వాస్తవం లేదు.
 
ఓ పక్క ప్రధాని, ముఖ్యమంత్రి, ఇతరత్రా ప్రముఖులు, మరోపక్క శంకుస్థాపనకు వచ్చిన వేల మంది పోలీసు బలగాలున్న సమయంలో తోట తగలబడుతున్నట్టు తెలిస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు? అగ్నిమాపక యంత్రాలను ఎందుకు పంపలేదు? ఈ వ్యవహారంలో పోలీసుల వాదన తప్పు. కేసులో బేరసారాలు మొదలుపెట్టి తామనుకున్న పనిని చేయించాలనుకుంటున్నారు’ అని నిజనిర్ధారణ కమిటీ అభిప్రాయపడినట్టు రాజేంద్రప్రసాద్ వివరించారు. సురేశ్‌ను తక్షణమే విడిచిపెట్టకపోతే తదుపరి చర్య ఏమిటనే దానిపై ఈ నిజనిర్ధారణ కమిటీ ఒకటి రెండ్రోజుల్లో భేటీ అయి భవిష్యత్ కార్యక్రమాన్ని ఖరారు చేస్తుందన్నారు.
 
న్యాయపరంగా ముందుకు వెళ్లే ఆలోచన కూడా లేకపోలేదన్నారు. ఈ సంఘటనపై నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యుల్లో బెజవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పి.జయమ్మ, మాజీ అధ్యక్షుడు దుర్గా శ్రీనివాసరావు, సభ్యులు కేవీవీ పరమేశ్వరరావు, ఓపీడీఆర్ నేతలు ఏసు, వి.రాజ్యలక్ష్మీ, పీయూసీఎల్ నాయకులు ఎం.శేషగిరిరావు, పీఓడబ్ల్యూ నాయకురాలు గంగా భవానీ, మంగళగిరి బార్ అసోసియేషన్ ప్రతినిధి లంకా శివరామ ప్రసాద్ ఉన్నారు.

తాజా వీడియోలు

Back to Top