బియ్యం తగ్గించి.. మిగిలినవి పెంచారు!

జడ్చర్ల:

రూపాయికి  కిలో బియ్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని 15 కిలోలకు తగ్గించిందని జడ్చర్ల మండలం కుర్వగడ్డకు చెందిన మాధవి రుక్మిణి చెప్పారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిలను వారు కలిశారు.  ఇచ్చే బియ్యం కూడా పురుగు పట్టి, ముక్కిపోయినవి ఉంటున్నాయని చెప్పారు. బియ్యం ధర తగ్గించామని చెబుతూ పామాయిల్ రూ.5 పెంచారన్నారు. మంచినూనె రూ 100, కందిపప్పు రూ.70, ఉప్పు, చింతపండు.. ఇలా అన్ని ధరలు పెంచేశారన్నారు. అన్నీ బాగానే ఇస్తున్నామని చెబుతున్న మంత్రి శ్రీధర్‌బాబు తమ ఊరికొచ్చి చూడాలని కోరారు. బీఈడీ విద్యార్థులు కూడా శ్రీమతి షర్మిలను కలిసి తమ కష్టాలను చెప్పుకున్నారు. ‘ఏడు లక్షల మంది బీఈడీ అభ్యర్థుల భవిష్యత్తును ఈ ప్రభుత్వం రోడ్డున పడేసింది. ఇంతమంది ఉసురు పోసుకున్న వీళ్లు ఊరికే పోరు. విద్యాశాఖ మంత్రికి కోర్టు కేసులు తప్పించుకోవడానికి, మంత్రి పదవి కాపాడు కోవడానికే టైం సరిపోవడం లేదు. ఇంకా మా భవిష్యత్తు గురించి ఆయనే నిర్ణయం తీసుకుంటారు..’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

అంబేద్కర్ ఆలోచనలను వైయస్ అమలు చేశారు..

     లింగంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం షర్మిల సభలో ప్రసంగించారు.  ‘అంబేద్కర్ పేరు వినగానే మనకు భారత రాజ్యాంగం గుర్తుకు వస్తుంది. మనుషుల మధ్య అంతరాలు.. ఆర్థిక అసమానతలు తొలగిపోవాలన్న ఆయన ఆశయం గుర్తుకు వస్తుంది. అంతకుమించి హక్కులు గుర్తుకు వస్తాయి. హక్కులతోపాటు అంబేద్కర్ ఆదేశ సూత్రాలను కూడా ఇచ్చారు. ఆ మహనీయుడి ఆలోచనలను అమలు చేయాలంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాలి. ప్రతి వ్యక్తికి విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ అందుబాటులో ఉండాలి. అంబేద్కర్ ఆలోచనలను త్రికరణశుద్ధిగా అమలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ఆర్ ’ అని ఆమె అన్నారు. ‘నాయకుడంటే ప్రజల్లోంచి పుట్టాలి.. ప్రజల కోసం ఆలోచించాలి. పన్నుల భారం లేకుండా సుపరిపాలన అందించాలి. కానీ ఇప్పటి పాలకులు ప్రజలను.. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. ప్రజలు ఏమైపోతే మాకేంటి.. అని అనుకుంటున్నారు. ప్రజాసమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాల్సిన చంద్రబాబు అదే ప్రభుత్వంతో కుమ్మక్కై నాటకాలాడుతున్నార’ని మండిపడ్డారు.

తనతో నడుస్తున్నవారితో మాటా ముచ్చట..

     ప్రజా ప్రస్థానం పాదయాత్ర 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా షర్మిల ఓ పాపతో కేక్ కట్ చేయించారు. గురువారం మొత్తం 18.70 కిలోమీటర్ల దూరం నడిచారు. రాత్రి కొండేడులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. ఇడుపులపాయ నుంచి తనతో నడుస్తున్న వారితో కలిసి రాత్రి భోజనం చేశారు. వారికి స్వయంగా భోజనాలు వడ్డించారు. వాళ్ల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకూ మొత్తం 705.30 కి.మీ. పాదయాత్ర పూర్తయింది.

తాజా వీడియోలు

Back to Top