విభజన కమిటీలతో మాట్లాడబోం : భూమన

తిరుపతి, 7 నవంబర్ 2013:

రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే కమిటీలుంటే వాటికి అభిప్రాయాలు చెప్పేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వస్తుందని పార్టీ సీజీసీ సభ్యుడు, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. విభజనకు అనుకూల నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధపడిన కమిటీలను పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోరని స్పష్టంచేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ బుధవారం ఉదయం నుంచి సీమాంధ్ర వ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 48 గంటల రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో ఆయన గురువారంనాడు తిరుపతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రోడ్డు మీదే పడుకుని నిరసన వ్యక్తంచేశారు.

రాష్ట్ర విభజన నిర్ణయం మొత్తం సీమాంధ్ర ప్రాంతాన్ని చీకటిమయం చేస్తోందని భూమన ఆవేదన వ్యక్తంచేశారు. విభజన వల్ల సీమాంధ్రలోని పట్టభద్రులు ఉద్యోగాలు లేక తమ తమ కులవృత్తులు చేసుకుని, అత్యంతా దారుణమైన దుస్థితిలో బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజనను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. విభజనకు అనుకూలంగా మాట్లాడే దుస్థితిలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ లేదన్నారు. విభజనకు వ్యతిరేకంగా ఉద్యమించమని పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి పార్టీ నాయకులు, శ్రేణులకు ఆదేశించారని తెలిపారు.

Back to Top