హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం పిల్లి మొగ్గలు వేస్తూ కుంటి సాకులు చెప్పడం ఎంతమాత్రం సరికాదని, అసలు ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో తేల్చి చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెనుకా ముందూ చూడకుండా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ‘ప్రత్యేక హోదా ఇవ్వగానే రాష్ట్రానికి పరిశ్రమలు పరిగెత్తుకుంటూ వస్తాయా?’ అని మంత్రి అనడం శోచనీయమన్నారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందనీ ప్రత్యేక హోదాతోనైనా పారిశ్రామికాభివృద్ధి జరిగి ఆర్థిక పుష్టి కలుగుతుందని అందువల్ల ఆ షరతును విధించే తాము రాజ్యసభలో విభజన బిల్లుకు మద్దతు నిస్తున్నామని నాడు బీజేపీ జాతీయనేతలంతా చెప్పారని మైసూరా గుర్తుచేశారు. <br/>బీహార్ , బెంగాల్ ఎన్నికలున్నాయి కనుక ప్రత్యేక హోదా ఇచ్చే విషయం కుదరడం లేదని, తమిళనాడు వ్యతిరేకిస్తుందనే మాటలు ఆనాడు రాజ్యసభలో విభజన బిల్లుకు మద్దతు ఇచ్చేటపుడు బీజేపీకి గుర్తుకురాలేదా? అని మైసూరా ప్రశ్నించారు. ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ అసలు ప్రత్యేక హోదా కోరుతోందా? లేక ప్రత్యేక ప్యాకేజీ చాలనుకుంటోందా? చెప్పాలని డిమాండ్ చేశారు.