బాబు పాలన అంతా మోసం, దగా


ఆర్యవైశ్యులను అన్యాయం చేసిన చరిత్ర టీడీపీది
తగిన గుణపాఠం చెప్పేందుకు ఆర్యవైశ్యులంతా కలిసిరావాలి
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌

నెల్లూరు: నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు అన్ని వర్గాలను ప్రజలను మోసగిస్తూ పరిపాలన సాగిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి న్యాయం చేసిన దాఖలాలు లేవన్నారు. నెల్లూరు జిల్లాలో వైయస్‌ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య అంతరంగ ఆవిష్కరణ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌ యాదవ్, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒక కమిటీని వేశారని గుర్తు చేశారు. ఆంధ్రరాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములును సైతం గుర్తు చేసుకోలేని దౌర్భాగ్య స్థితికి చంద్రబాబు వెళ్లాడని మండిపడ్డారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికి, చంద్రబాబుకు చాలా వ్యత్యాసం ఉందని వెల్లంపల్లి శ్రీనివాసులు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న పొట్టిశ్రీరాములను నిత్యం స్మరించుకునేందుకు నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు పేరు పెట్టిన మహానుభావుడు వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. కానీ, చంద్రబాబు నవంబర్‌ 1వ తేదీ ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరపడం లేదని, రాష్ట్రాన్ని విడగొట్టాలని లేఖ ఇచ్చిన చంద్రబాబు పొట్టి శ్రీరాములు ఆశయాలకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన చంద్రబాబు రాష్ట్ర విభజనకు తాను ఇచ్చిన లేఖ వల్ల అని చెప్పుకుంటున్నాడని, ఏపీకి వచ్చి అన్యాయంగా విభజించారని మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. అదే విధంగా నరేంద్రమోడీ నోట్ల రద్దు తాను ఇచ్చిన లెటర్‌ ఆధారంగానే చేశాడని మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు నోట్ల రద్దు దుర్మార్గపు చర్య అని మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలంతా తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆర్యవైశ్యులు వైయస్‌ఆర్‌ సీపీకి అండగా ఉండి అధికారంలోకి తీసుకురావాలని కోరారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షం అవుతుందన్నారు. 
 
Back to Top