ఆడపిల్ల పుట్టుకను అవమానించే వ్యక్తి బాబు

  • చంద్రబాబు మహిళా ద్రోహి
  • ఏపీని మహిళలపై దాడులకు అడ్డాగా మార్చాడు
  • మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుపై క్లారిటీ ఇవ్వాలి
  • మహిళలకు బాబు క్షమాపణ చెప్పాలి
  • మహిళా సాధికారత డిక్లరేషన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు
  • వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
హైదరాబాద్‌: పోలీస్‌ బలాన్ని అడ్డంపెట్టుకొని తెలుగు దుర్యోధనుల పార్టీ(టీడీపీ) మాఫియాగా తయారై రాష్ట్రంలో మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలకు అడ్డాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీని తయారు చేశారని రోజా ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచే చంద్రబాబు మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారో క్లారిటీ ఇవ్వాలని రోజా డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండున్నర సంవత్సరాలుగా మహిళలపై చేసిన అరాచకాలను, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకోవడానికి మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సును వాడుకుంటున్నారా అని చంద్రబాబును నిలదీశారు. లేక మిగిలిన రెండున్నరేళ్ల పాలనలో గ్రామస్థాయి తెలుగుదేశం గుండాల నుంచి రాష్ట్ర స్థాయి నేతలు, వారి కుమారులు ఇంకా మహిళలపై దాడులకు తెగబడినా జాతీయ మహిళా మణులు అండగా ఉండేందుకు సదస్సును నిర్వహిస్తున్నారా అని ప్రశ్నించారు. దేశంలో మహిళలకు రక్షణ లేని రాష్ట్రం ఏమైనా ఉందా అంటే అది ఏపీ అని నిస్సందేహంగా చెప్పవచ్చునన్నారు. సదస్సుకు హాజరయ్యే మహిళామణులు చంద్రబాబు అరచేతిలో వైకుంఠాన్ని చూసి మోసపోయి, బాబు భజన చేయోద్దని చేతులు జోడించి వారికి నమస్కరించారు. రాష్ట్రంలో మహిళలకు ఏమేరకు గౌరవం దక్కుతుందో తెలుసుకొని బాబుకు బుద్ధివచ్చేలా ప్రశ్నించి మహిళలు సంతోషంగా, ధైర్యంగా జీవించే హక్కును ప్రసాదించాలని విజ్ఞప్తి చేశారు. 

పోలీసులకు బాబు మాటే శాసనం
పోలీసుల పనితీరు వల్లే రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని రోజా ఆరోపించారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు చట్టప్రకారం పనిచేయకుండా చంద్రబాబు మాటే శాసనంగా పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. డిసెంబర్‌ 31న డీజీపీ సాంబశివరావు ప్రెస్‌మీట్‌ పెట్టి గత సంవత్సరం రాష్ట్రంలో మహిళలపై 11 శాతం నేరాలు పెరిగాయని గొప్పగా చెప్పడంపై  ప్రజలు ఆలోచన చేయాలన్నారు.  చంద్రబాబు పరిపాలనలో ఆడబిడ్డకు రక్షణ లేకుండా పోయిందని, తెలుగు తల్లి ఒడిలోని ఆడపిల్లకు అవమానం తప్పడం లేదన్నారు. కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ని టీడీడీ నేతలు బుద్ధా వెంకన్న, బోడే ప్రసాద్, బోండా ఉమా లాంటి వాళ్లు నడిపిస్తున్నారని తెలిసినా, ఆడవాళ్ల జీవితాలు నాశనం అయినా పర్వాలేదు.. నా పార్టీ నాయకులకు మాత్రం ఏం కాకూడదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ నేరస్తులను చంద్రబాబు తన పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. మహిళలకు అన్యాయం జరుగుతోందని అసెంబ్లీలో ప్రశ్నిస్తే రూల్స్‌కు వ్యతిరేకంగా తనపై చంద్రబాబు సస్పెన్షన్‌ వేటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రశ్నించేవారంటే నచ్చదన్నారు. అత్త అన్న గౌరవం లేకుండా బాబు రాజకీయ లబ్దికోసం లక్ష్మిపార్వతి వ్యక్తిత్వాన్ని కించపరిచాడని మండిపడ్డారు. దళిత స్పీకర్‌ కుతూహలమ్మని ఏడిపించారని గుర్తు చేశారు. 

మహిళలపై దాడుల్లో ఏపీ అడ్డాగా మార్చింది బాబే
కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా అని ఆడపిల్ల పుట్టుకనే విభేదించిన వ్యక్తి మహిళల గొప్పదనం గురించి సదస్సు అని చెప్పడం విడ్డూరంగా ఉందని బాబు తీరుపై రోజా ధ్వజమెత్తారు.  అమ్మాయి కనిపిస్తే ముద్దుపెట్టాలి.. లేదా కడుపు చేయాలనే ఆలోచన గల ఆయన బావమరిది బాలకృష్ణ దగ్గర పదివేల మంది విద్యార్థులు సాంప్రదాయాల గురించి ఏం నేర్చుకుంటారని ప్రశ్నించారు. మహిళలు, రైతులు, పేదవారి కన్నీళ్లు తూడవడానికి బృందాకారత్, మేధాపాట్కర్‌ లాంటి వాళ్లని మహిళా పార్లమెంటేరియన్‌ సదస్సుకు ఎందుకు ఆహ్వానించలేదని బాబును నిలదీశారు. మహిళా సాధికారతపై డిక్లరేషన్‌ చేయడానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. కానీ సదస్సుకు హాజరయ్యే వారిపై కొన్ని అనుమానాలు ఉన్నాయని అలాంటి వారిపై కూడా డిక్లరేషన్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆడవాళ్లను తొక్కేయడంలో ఏపీని అడ్డాగా మార్చిన చంద్రబాబుకు సమావేశానికి హాజరయ్యే అర్హత లేదన్నారు. ఒకవేళ సదస్సుకు హాజరుకావాలనుకుంటే చంద్రబాబు మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

బాబు సిగ్గుతో తలదించుకోవాలి
బాల్య వివాహాలు, నేరాల్లో ఏపీని నెంబర్‌ వన్‌ చేసిన చంద్రబాబు మహిళా సదస్సుకు వెళ్లడానికి సిగ్గుతో తలదించుకోవాలని ఆరోపించారు. మహిళల మానప్రాణాలను అమ్ముకొని అంగట్లో బొమ్మలాగా ఆడపిల్లను వాడుకోవాలని చూస్తున్న చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. మహిళలపై దాడులకు తెగబడిన టీడీపీ నేతలు బోడె ప్రసాద్, బుద్దా వెంకన్న, బోండా ఉమాలను చట్టసభల్లోకి రానివ్వకుండా డిక్లరేషన్‌ చేయాలన్నారు. నడిరోడ్డుపై సుదమ్మ అనే మహిళపై దాడులకు తెగబడిన పయ్యావుల కేశవులు లాంటి వారికి శిక్ష విధించేలా, మెడికో సంధ్యారాణి మృతికి కారణమైన లక్ష్మికి కొమ్ముకాసిన మంత్రి కామినేనిని బర్తరఫ్‌ చేసే విధంగా డిక్లరేషన్‌ చేయాలన్నారు. అలాంటప్పుడే చంద్రబాబు లాంటి మహిళా ద్రోహికి బుద్ధి వస్తుందన్నారు. 
 
Back to Top