'మనసులో మాట' మరిచావా చంద్రబాబూ!

హైదరాబాద్ 22 జూలై 2013:

పంచాయతీలను దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి నిర్లక్ష్యం చేశారని  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యానించడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఎద్దేవా చేశారు. గ్రామ వ్యవస్థను సర్వనాశనం చేశారని కూడా బాబు విమర్శించడాన్ని ఆయన తప్పుపట్టారు. పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన హయాంలో పంచాయతీ రాజ్ వ్యవస్థను ఏ విధంగా నిర్వీర్యం చేసిందనీ అందరికీ తెలుసనీ, కానీ తానే ఆ వ్యవస్థను ఉద్ధరించానని చెప్పుకోవడాన్ని ఆయన ప్రశ్నించారు. గ్రామీణ వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబని ఆయన మండిపడ్డారు. ఆయన హయాంలో గ్రామాలలో ఇక బతకలేమని నిర్ణయించుకుని ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళిన సంఘటనలు కోకొల్లలని చెప్పారు. గ్రామాలు బాగుపడాలని ఆయన ఏరోజూ కోరుకోలేదన్నారు. సాగునీరు, విద్యుత్తు, మంచినీరు, తదితర సౌకర్యాలు ఇవ్వకుండా చేసిన వ్యక్తి గ్రామీణ వ్యవస్థకు ప్రాణ ప్రతిష్ట చేసినది తానేనని చెప్పుకోవడమంత ఆత్మహత్యాసదృశం మరోటి లేదన్నారు. ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన కూడా మరోటి లేదన్నారు. రాజశేఖరరెడ్డిగారు గ్రామానికి ప్రతినిధి, నిఖార్సైన రైతు బిడ్డని భూమన పేర్కొన్నారు.

బాబు హయాంలో పట్టణాలకు వలస వెళ్ళిన ప్రతివారు మహానేత హయాంలో తిరిగి గ్రామాలకు చేరారనీ, వ్యవసాయాన్ని తిరిగి తమ ప్రధాన వృత్తిగా చేపట్టారనీ, ఈ విషయం అందరికీ తెలసునీ చెప్పారు. ఆయన రైతుకు నిరాటంకంగా ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్తునిచ్చి.. వారు బయటకు పోకుండా అన్ని చర్యలూ చేపట్టారన్నారు. గ్రామీణ వ్యవస్థను ఆయన స్వయం పోషక స్థితికి తెచ్చారని తెలిపారు. ఆరోగ్యశ్రీ తెచ్చిందీ మహానేతేనని చెప్పారు. 47లక్షల ఇళ్ళు కట్టించిన ఘనత కూడా ఆయనదేనన్నారు. ఫీజు రీయింబర్సుమెంటుతో గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువులు చదివే అవకాశం కల్పించారన్నారు. ఆయన చేసినట్లు భారత దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయలేదన్నారు.
తన అబద్ధాలతో ఈ వాస్తవలన్నింటినీ మరుగున పరచవచ్చనీ, తాను చేసిన పాపాలను కడిగేసుకోవచ్చనీ చంద్రబాబు భావిస్తున్నారని భూమన తెలిపారు. అందుకే ఆయన కొత్త భాష్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మీకోసం వస్తున్నానంటూ చేపట్టిన పాదయాత్రలో సెల్ ఫోన్ కనిపెట్టింది తానేననీ, ప్రపంచ బ్యాంకును తెచ్చింది తానేననీ చెప్పుకున్నారన్నారు. ప్రజలకు జ్ఞాపక శక్తి తక్కువనుకుని చంద్రబాబు ఎన్నో రకాల అబద్ధాలతో తాను చేసిన పాపాలను మరుగున పడేద్దామనుకుంటున్నారని చెప్పారు. గ్రామీణ వ్యవస్థను నాశనం చేశాడు కాబట్టే తెలుగు దేశం పార్టీకి 2001లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలలో టీడీపీకి కనీసం నలబై శాతం సీట్లు కూడా రాని విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మహానేత డాక్టర్ వైయస్ఆర్ హయాంలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికలలో దాదాపు 78 శాతం విజయాలు నమోదుచేసిన అంశాన్ని భూమన గుర్తుచేశారు. 22 జడ్పీలను కూడా రాజశేఖరరెడ్డిగారు కైవసం చేసుకున్న విషయాన్ని మరువరాదన్నారు. గ్రామీణ వ్యవస్థను పరిపుష్టం చేశారు కాబట్టే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని వేరే చెప్పాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

మనసులో మాట చంద్రబాబుకు భగవద్గీతలాంటిదనీ, దానిని మననం చేసుకుంటే ఎలాంటి దుర్మార్గంగా  ఆలోచించిందీ ఆయనకే తెలుస్తుందని భూమన చెప్పారు. పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఆయన పన్నిన కుయుక్తులు తెలుస్తాయన్నారు. ఇది తాను చెబుతున్న విషయం కాదన్నారు. మనసులో మాట పుస్తకం 199వ పేజీలో ఆయన రాసుకున్న మాటలను చదివి వినిపించారు. 'స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఏమిటని విమర్శకులు ప్రశ్నిస్తారు. ఒక సమాంతరమైన వ్యవస్థను సృష్టించడం ఎందుకు అంటారు. దాని అవసరం ఎంతో ఉందీ అన్నది ఇప్పుడు అందరూ తెలుసుకుంటున్నారు.'
అలాగే 200వ పేజీలో 'మళ్ళీ ఒక ప్రశ్న తలెత్తుతుంది. తక్కిన రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా పంచాయతీల ద్వారానే డబ్బు ఎందుకు ఖర్చు పెట్టకూడదు. ముందుగా ఒక వివరణ ఏమిటంటే పంచాయతీ ప్రతినిధులు స్వయం సహాయక సంఘాలకు గానీ, జన్మభూమి ప్రక్రియకు గానీ దూరం కాదు. వాళ్ళు అందులో భాగమే. ప్రభుత్వ శాఖల ఉద్యోగులు గ్రామ స్థాయి కమిటీలకు అధ్యక్షత సర్పంచిదే. ప్రభుత్వాధికారులు జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వెళ్ళినప్పుడు సర్పంచులను కూడా తీసుకెడతారు. మండలాధ్యక్షుణ్ణి, వార్డు సభ్యుణ్ణీ కూడా వెంట పెట్టుకుని వెడతారు. ప్రభుత్వాధికారులతో పాటు వారు కూడా ప్రజల వద్దకు వెడతారు.' అంటే ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులతో ప్రభుత్వాధికారులు కాకుండా.. ప్రభుత్వాధికారులతో ప్రజా ప్రతినిధులు వెడతారన్నది దీనర్థమని వివరించారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాధికారులకు తోకల్లా ఉండాలని బాబు కోరుకున్నారన్నారు.

201వ పేజీలో ఇంతకంటే దారుణమైన విషయం ఉందని భూమన చదివి వినిపించారు. 'అన్ని వనరుల నుంచి లభించిన నిధులను పంచాయతీలకు అందిస్తామనుకోండి. చివరకు అవి ప్రజలకు చేరుతాయా? గ్రామ స్థాయి కమిటీలకు డబ్బు అందేలా చేసేదెలా? పంచాయతీరాజ్ వారు ఏమంటారంటే..మాకు డబ్బు ఇస్తే.. దానిని ప్రజలకు అందేలా చూస్తామంటారు. అయితే అనేక దశాబ్దాలుగా ఆ సంస్థల పనితీరును గమనిస్తున్నాం. వాటికి ఇప్పటికీ  ఎటువంటి భాగస్వామ్య నిర్మాణమూ లేదు. జిల్లా పరిషత్, మండల పరిషత్ వంటి సంస్థాగతమైన ఏర్పాట్లు ఉన్నప్పటికీ, వాటి ప్రజాస్వామ్య మూలాలు వెతికితే అక్కడ ఏమీ ఉండదు.'  ఇంతకంటే దుర్మార్గమైన ఆలోచన ఏమైనా ఉంటుందా చెప్పండని భూమన ప్రశ్నించారు. 'గ్రామానికి ఒక పంచాయతీ ఉండాలి. కానీ రెండేసి గ్రామాలకో పంచాయతీ ఉంది. కానీ ఒక్కో ఊళ్ళో పదిమంది సభ్యులుండే నూరు నుండి 200దాకా  స్వయం సహాయక సంఘాలు, వాటిని నిర్ణయాధికార పరిథిలోకి తెచ్చినప్పుడే నిజంగా ప్రజలకు అధికారం ఇచ్చినట్టు. వివిధ జన్మభూమి పనులలో వారి భాగస్వామ్య నిష్పత్తిని నిర్ణయించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని క్రమబద్దీకరించేందుకు ప్రయత్నించాం. కొత్త ఆస్తుల కల్పనలోనూ, మట్టి పనుల ఖర్చులోనూ ప్రజలు యాబై శాతం భరించాలి. నీరు పట్టు ప్రాంతాలలో, మురికివాడలలో కాంక్రీటు రోడ్ల నిర్మాణంలో 20శాతం శ్రమను, ఇతర ప్రాంతాలలో యాబై శాతం శ్రమను పంచుకోవాలి.'
అంటే సర్పంచులకు వచ్చే డబ్బుతోనే కాకుండా ప్రజల భాగస్వామ్యంతోనే పనులు జరగాలి తప్ప ప్రభుత్వం ఏరకంగానూ భాగస్వామి కాకుండా నిధులు కేటాయించకూడదు అనే చంద్రబాబు మనసులో మాటలను పదేపదే చెప్పుకున్నారు.

'అసలు ప్రభుత్వ నిధులు ఇవ్వనవసరం లేని అనేక ఇతర పనులను కూడా మేము గుర్తించాం. 5వేల రూపాయల కంటే తక్కువ ఖర్చయ్యే మైనర్ రిపేర్లు, యూత్ క్లబ్ బిల్డింగులు, కమ్యూనిసటీ హాళ్ళు, మత సంస్థల పనులు, విగ్రహాలు, క్రీడా వసతుల కల్పన, బోరు బావుల తవ్వకం, జంగిల్ క్లియరెన్సు, తాగునీటి చెరువులు, ఇతర చెరువులలో పూడిక తీయడం, ప్రభుత్వ భూములలో కాక ఇతర ప్రాంతాలలో జరిగే నిర్మాణాలు .. వీటిని ప్రజలే చందాలు వేసుకుని శ్రమదానంతో చేసుకోవాలి.'
ఇంత దుర్మార్గంగా ఆలోచించిన చంద్రబాబు..తాను గ్రామ వ్యవస్థను పరిపుష్టం చేశానని ప్రకటించుకోవడం కంటే హాస్యాస్పద అంశం ఉండదని భూమన చెప్పారు. గ్రామీణ వ్యవస్థను రక్షించి, పరిపుష్టం చేసింది ఒక్క రాజశేఖరరెడ్డిగారునని ఆయన తెలిపారు. ప్రపంచ బ్యాంకుకు చంద్రబాబు పాదాక్రాంతమైనట్లు ప్రపంచంలో ఏ నాయకుడూ కాలేదని పేర్కొన్నారు. చంద్రబాబు ప్రపంచ బ్యాంకు తొత్తు అని ప్రపంచమంతా కోడై కూసినప్పటికీ పట్టించుకోకుండా తాను చేయాల్సింది చేశాడన్నారు. 2003లో లండన్లోని ఓవర్సీస్ డెవలప్‌మెంట్ సమర్పించిన వర్కింగ్ పేపర్లో గ్రామీణ వ్యవస్థను చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా అపహరించారో వివరించారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top