సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు భయం



బాధితులకు బాసటగా పోరాటాలు చేస్తాం
వైయస్‌ జగన్‌ సీఎం అయిన వెంటనే రూ. 1182 కోట్లు విడుదల చేస్తాం
దోషులను గుర్తించి కఠినంగా శిక్షిస్తాం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి అగ్రిగోల్డ్‌ బాధితుల ఆత్మహత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్‌ స్కామ్‌ వెనుక తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలు కొందరి పాత్ర ఉందన్నారు. అగ్రిగోల్డ్‌ కుంభకోణంపై కేంద్ర సంస్థల చేత సమగ్ర విచారణ జరిపిస్తేనే న్యాయం జరుగుతుందని, సీఐడీతో విచారణ వల్ల ప్రయోజనం శూన్యమన్నారు. విజయవాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో అగ్రిగోల్డ్‌ బాసట కమిటీ సమావేశంలో పాల్గొన్న వైవీ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లో శారదా చిట్‌ఫండ్స్‌ స్కామ్‌ కంటే అగ్రిగోల్డ్‌ స్కాం పెద్దదన్నారు. శారదా చిట్‌ఫండ్‌ స్కామ్‌ను సీబీఐ విచారణ జరిపించిన కేంద్రం దానికి రెండింతలు పెద్దదైన, దేశంలో 8 నుంచి పది రాష్ట్రాలకు విస్తరించి కొన్ని లక్షల మంది బాధితులు ఉన్న అగ్రిగోల్డ్‌ స్కామ్‌పై ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ స్కాంలో ప్రభుత్వం పెద్దల పాత్ర బయటకు రావాలంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 

అగ్రిగోల్డ్‌ ఆస్తులను టేకోవర్‌ చేయడానికి ముందుకు వచ్చిన ఎస్‌ఎల్‌ గ్రూపు యాజమాన్యం ఢిల్లీలో ఏపీభవన్‌లో చంద్రబాబుతో రహస్య సమావేశం అనంతరం వెనక్కి వెళ్లిందంటే వారి మధ్య ఎటువంటి బేరాలు జరిగాయో బాధితులు, ప్రజలు గమనించాలన్నారు. అగ్రిగోల్డ్‌ స్కామ్‌లో ప్రభుత్వ పెద్దల జోక్యం లేకపోతే.. సీబీఐ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. బాధితులను ఆదుకోకపోగా ఆత్మహత్యలు చేసుకుంటున్న కుటుంబాలకు ఇస్తానన్న నష్టపరిహారంలోనూ కోతలు పెడుతోందని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి బయటకు వచ్చి అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రజా పోరాటానికి దిగుతోందన్నారు. అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం కళ్లు తెరవకపోతే.. మరో నాలుగు నెలల్లో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి రాబోతుందని, వచ్చిన వెంటనే పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రకటించినట్లుగా తొలుత 80 శాతం మంది చిన్నా చితకా డిపాజిట్‌ దారులకు మేలు జరిగే విధంగా రూ. 1182 కోట్లు విడుదల చేసి బాధితులను ఆదుకుంటామన్నారు. తరువాత అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో పాత్రదారులు, సూత్రదారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Back to Top