డ్వాక్రా గ్రూపులకు మాఫీ పేరుతో టోకరా భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థలను పునరుద్ధరించాలంటే వైయస్ జగన్ రావాలివైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం
శ్రీకాకుళం: అబద్ధపు వాగ్దానాలు ఇచ్చి ప్రజలందరినీ మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఘనుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత తమ్మినేని సీతారాం అన్నారు. బాబు వస్తేనే జాబు వస్తుందని ఊదరగొట్టి నిరుద్యోగులను మోసం చేశాడని మండిపడ్డారు. నరసన్నపేట నియోజకవర్గంలో జరుగుతున్న బహిరంగ సభలో తమ్మినేని పాల్గొని మాట్లాడారు. నాలుగున్నరేళ్ల తెలుగుదేశం పార్టీ అరాచకాలతో విసిగిపోయిన యువత జాబు రావాలంటే బాబు పోవాలని కోరుకుంటున్నారన్నారు. డ్వాక్రా మహిళలకు టోకరా వేశాడని, బ్యాంకుల్లోని బంగారం అంతా ఇళ్లకు తెచ్చిస్తామని చెప్పి నమ్మించి వంచించాడని ధ్వజమెత్తారు. రైతు రుణాలు మొత్తం మాఫీ చేస్తామన్న పెద్దమనిషి కేవలం రూ. 12 వేల కోట్లు మాపీ చేసి అంతా మాఫీ చేశానని బీరాలు పలుకుతున్నారన్నారు. రాజకీయాల్లో విలువలను తిరిగి పునరుద్ధరించాలంటే, మంచి తనం రావాలంటే వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు సూచించారు. వైయస్‌ఆర్ సీపీ గుర్తుపై గెలిచి తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయారని, వారిలో నలుగురిని మంత్రులను చేసి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. కలెక్టర్, పోలీస్, గవర్నర్, ఎమ్మెల్యే వ్యవస్థ అన్ని భ్రష్టుపట్టించారు.. వీటన్నింటినీ పునరుద్ధరించాలంటే ఒకే వ్యక్తి రావాలి.. అదే వైయస్ జగన్ అని తమ్మినేని సీతారాం అన్నారు.