చంద్రబాబు చేసిన మోసాలు గాలికి వదిలేశారు.తప్పులు చేశారు కాబట్టే భయపడుతున్నారు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబు అబద్ధాలు, మోసాలు చేయవచ్చా అని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ నిలదీశారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మహా సంకల్ప సభలో చంద్రబాబు వైయస్ జగన్‌పై చేసిన ఆరోపణలను ఆమె ఖండించారు. చంద్రబాబు ప్రసంగం ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం వాసిరెడ్డి పద్మ విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది ఏమీ లేదని ధ్వజమెత్తారు. బాబు నిర్వాకం మీదనే మా విమర్శలుఎన్నికల ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి..సీఎం కూర్చీలో కూర్చున్న తరువాత వాటిని మరిచిపోయారని మండిపడ్డారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు గుర్తు చేసేందుకు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పులు, చీపూర్లు చూపించమన్నారని, చెప్పులతో కొట్టమని ఆయన అనలేదని పద్మ వివరణ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని చెప్పులతో కొట్టమన్నారని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. అయినా సరే అబద్ధాలు ఆడిన, మోసాలు చేసిన వ్యక్తిని గ్రామాల్లో ఏమంటారో అందరికి తెలిసిందే అన్నారు. సీఎంను అనవచ్చా అంటున్న చంద్రబాబు..ఇదే ప్రశ్నను ఆయన తిరిగి వేసుకోవాలన్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో చేసిన ఒక్క సంతకం కూడా నెరవేర్చకుండా మొహం చాటేస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. సీఎంగా ఉంటూ పనికి మాలిన పని చేయవచ్చా? ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు.బాబుకి ఎప్పటికీ భయమే..!తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఆడియో, వీడియో టేపులతో సహా దొరికిపోయిన చంద్రబాబు కేసీఆర్ అంటే భయమని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. ప్రధాని, తెలంగాణ సీఎంకు తాను ఎందుకు భయపడుతానని చంద్రబాబు అంటున్నారని..ఆయన చేసిన తప్పుల వల్లే వారికి భయపడాల్సి వస్తుందన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓ ఎమ్మెల్యేకు టీడీపీ నేతలు రూ.50 లక్షలు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయింది వాస్తవం కాదా అన్నారు. చంద్రబాబు ఆ ఎమ్మెల్యేతో ఫోన్‌లో మాట్లాడుతూ..‘‘మనవాళ్లు బ్రిఫ్డ్‌మీ’’ అన్న సంభాషణలు మీవే అని ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినా చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు.తప్పు బాబుది శిక్ష ఉద్యోగులదా..! కేసుల భయంతోనే ఆయన రాత్రికి రాత్రి అమరావతి పారిపోయారని విమర్శించారు. ఒక్క రాత్రి కూడా హైదరాబాద్‌లో ఉండే దమ్ము చంద్రబాబుకు లేదని ఆక్షేపించారు. అందులో భాగంగానే అమరావతిలో భవనాలు లేకపోయినా ఆంధ్ర ఉద్యోగులను, సచివాలయ సిబ్బందిని రావాలని పిలుస్తున్నారన్నారు. మరో వైపు కేసీఆర్ తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కుడుతున్నా ఈ కేసుకు భయపడి చంద్రబాబు ప్రశ్నించడం లేదన్నారు. ఇంకో వైపు రెండేళ్ల తన పాలనలో చోటు చేసుకున్న అవినీతిపై ఎక్కడ కేంద్రం సీబీఐ విచారణ చేపడుతుందోనని సీఎంకు భయంగా ఉందన్నారు. అందుకే రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నింటికీ రాయలసీమ వాసుల మీదనే నిందలా..!రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా రాయలసీమ గుండాల పని అనడం చంద్రబాబుకు ఊతపదమైందని వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. తునిలో జరిగిన ఘటనకు పులివెందుల గుండాల పనే అని నిందలు మోపారని, తీరా ఇప్పుడు గోదావరి జిల్లాలో అరెస్టు చేస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చమని వారు ఉద్యమం చేస్తే..ఇందులో వైయస్ జగన్ హస్తం ఉందని నిందలు మోపుతున్నారని, రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్ష నేతకు ఆపాదించడం దుర్మార్గమన్నారు. ఏ వర్గం ప్రజలైన తమకు అన్యాయం జరిగిందని రోడ్లపైకి వస్తే..వారి పక్షాన ప్రధాన ప్రతిపక్షమైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు.