అయిదు రోజులు 15 వాయిదాలు

హైదరాబాద్:  ఈ నెల 17న ప్రారంభమైన శాసన సభ వర్షాకాల సమావేశాలు ఎటువంటి చర్చా లేకుండానే ముగిశాయి. తెలంగాణ తీర్మానం ప్రవేవపెట్టాలనే టీఆర్ఎస్ సభ్యుల నినాదాలు, మిగిలిన విపక్షాల వాయిదా తీర్మానాల నడుమ గందరగోళం చెలరేగి, స్పీకరు వాయిదా వేయక తప్పలేదు. అయిదు రోజుల్లో కనీసం సభ 15 సార్లు వాయిదా పడింది. బిల్లులు ప్రవేశపెట్టలేదు. నాలుగో రోజు కొండా లక్ష్మణ బాపూజీ మృతికీ, ఐదో రోజున ఇటీవల మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలుపుతూ తీర్మానాలు ఆమోదించడం మినహా ఎటువంటి కార్యక్రమామూ సాధ్యపడలేదు.  చివరిరోజు శనివారం సభ మూడుసార్లు వాయిదా పడింది.  ప్రజల సమస్యలపై చర్చించకుండా సభ ముగియడం ఇదే ప్రధమం.  అధికార, ప్రతిపక్షాల వైఫల్యమే దీనికి కారణం. 
సమావేశాలు జరగకుండా కుట్ర: వైయస్ఆర్ సీపీ
ఐదురోజులలో ఐదు నిమిషాలు కూడా సభ సాగలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు భూమన కరుణాకరరెడ్డి, శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశం సాగకుండా ప్రభుత్వం ప్రతిపక్షం కుట్ర చేశాయని వారు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలు చర్చించకుండా ఇవి ముగిసినందుకు ప్రజలను క్షమాపణ కోరుతున్నామని వారు చెప్పారు. దీనికి కారణమైన ప్రభుత్వ, ప్రతిపక్షాలపై చర్య తీసుకోవల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలుపునిచ్చారు. స్పీకర్ అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరించారని వారు ఆరోపించారు. 
తప్పులు బయటపడతాయనే సభ జరక్కుండా ప్రభుత్వం అడ్డుకుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మూడేళ్ళుగా అధికార పార్టీ సభను సావుగా సాగనివ్వడం లేదన్నారు. ఇందుకు ప్రభుత్వం కొన్ని పార్టీలతో కలిసి కుట్ర చేసిందన్నారు. 
అసెంబ్లీకి మేం పెట్టిన ఖర్చంతా వసూలు చేయాలని సీపీఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి సూచించారు. స్పీకర్, ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.  సభను అడ్డుకునే వారిపై చర్య తీసుకునేలా చట్ట సవరణ చేయాలని ఆయన సూచించారు. సభ సంతాప తీర్మానాలకే సరిపోయిందని లోక్ సత్తా సభ్యుడు జయప్రకాశ్ నారాయణ్ ఆవేదన వ్యక్తం చేశారు. చట్ట సభలు ఎందుకన్న ప్రశ్న తలెత్తుతోందన్నారు. 
తెలంగాణ తీర్మానంపై ప్రభుత్వ, ప్రతిపక్షాలు పరారు: టీఆర్ఎస్
తెలంగాణపై తీర్మానం చేయకుండా ప్రభుత్వం, ప్రతిపక్షాలు పారిపోయాయని టీఆర్ఎస్ ఆరోపించింది. అధికారంలోకి రావడానికి టీఆర్ఎస్ ను ఉపయోగించుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తెలంగాణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని ఆ పార్టీ సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. సభా ముఖంగా ఏ  తీర్మానం ఆమోదం పొందాలన్నా.. ముందుగా తెలంగాణ తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలసిందేనని ఆయన స్పష్టంచేశారు. ఇటీవలి పరకాల ఉప ఎన్నికలో తెలంగాణకు అనుకూలమని ఓట్లడిగిన పార్టీలు తీర్మానాన్ని ఎందుకు ప్రవేశ పెట్టలేకపోయాయని ప్రశ్నించారు.  బీజేపీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. 
ప్రభుత్వానికి సహకరించండి: సీఎం
 తొలుత, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాసన మండలిలో మాట్లాడు. హైదరాబాద్ నగరం పలు అంతర్జాతీయ సదస్సులకు, సమావేశాలకు.... అతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రభుత్వానికి సహకరించాలని  సభ్యులకు విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాదిలో కూడా ఎన్నో అంతర్జాతీయ సమావేశాలకు జంట నగరాలు వేదిక కానున్నాయన్నారు. ఈనెల 30న తెలంగాణ మార్చ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి 19 వరకూ అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు హైదరాబాద్లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
'ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ అమలు చేయాలి'
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని బీజేపీ ధ్వజమెత్తింది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ తక్షణం అమలయ్యేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు చేపట్టాలని ఆపార్టీ డిమాండ్ చేసింది. సబ్ ప్లాన్ అమలు చేయాలంటూ బీజేపీ శాసనసభ్యులు అంబేద్కర్ విగ్రం నుంచి అసెంబ్లీ వరకూ పాదయాత్రగా తరలి వెళ్లారు. ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మీనారాయణతో పాటు పలువురు పార్టీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.
టీపీడీ, కాంగ్రెస్ కుమ్మక్కు: జూపల్లి
అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సభా సమయాన్ని వృథా చేసేందుకు అధికార కాంగ్రెస్ విపక్ష టీడీపీలు కలసి కుట్ర పన్నాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు. ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణ తీర్మానం రాకుండా సభా సమయాన్ని వృథా చేసేలా కాంగ్రెస్‌-టీడీపీలు వ్యవహరించాయని ఆయన శనివారమిక్కడ ఆరోపించారు. తెలంగాణపై అసెంబ్లీలో చర్చ జరిగితే కాంగ్రెస్, టీడీపీలు అభాసుపాలవ్వడం ఖాయమని జూపల్లి అన్నారు.
తొలుత  ఉదయం తొమ్మిదిగంటలకు ప్రారంభమైన అసెంబ్లీలో తెలంగాణపై తీర్మానం కోరుతూ టీఆర్‌ఎస్‌ సభ్యులు సభలో పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియం ఎదుట నిలబడి ఆందోళనకు దిగారు. తెలంగాణపై తీర్మానం కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో.. టిఆర్‌ఎస్‌, టీడీపీ సభ్యులు నిరసన వ్యక్తంచేశారు. సమావేశాల చివరిరోజైనా సహకరించాలని స్పీకర్‌ పదేపదే విజ్ఞప్తిచేశారు. అయినా సభ్యులు తమపట్టు వీడకపోవడంతో స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. అంతకుముందు సభను సజావుగా సాగనివ్వాలని శాసనసభా వ్యవహారాలశాఖా మంత్రి శ్రీధర్‌బాబు విజ్ఞప్తి చేశారు. తిరిగి పదిన్నర తరువాత ప్రారంభమైనా టీఆర్‌ఎస్‌ సభ్యులు పట్టువీడకపోవడంతో స్పీకర్‌ రెండోసారి కూడా సభను గంటపాటు వాయిదా వేశారు. దీంతో శాసనసభ వర్షాకాల సమావేశాల చివరిరోజు కూడా విపక్ష సభ్యులు సభలో ఆందోళనతో సభలో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు.

Back to Top