అవిశ్వాసమంటే బాబుకు హడల్: మేకపాటి

హైదరాబాద్, 2 ఫిబ్రవరి 2013: తొమ్మిది మంది కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలను బహిష్కరించినట్లు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ చేసిన వ్యాఖ్యలు నిజమైతే రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీలో పడినట్లేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నెల్లూరు ఎం.పి. మేకపాటి రాజమోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బహిష్కరించామని చెబుతున్న ఆ 9 మంది ఎమ్మెల్యేల పేర్లు వెల్లడించే ధైర్యం బొత్సకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. మైనార్టీలో పడిపోయిన ప్రభుత్వాన్ని బల నిరూపణ చేసుకోమని అడిగే బాధ్యత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఉందని మేకపాటి గుర్తు చేశారు. హైదరాబాద్‌లోని వైయస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యాలయం ఆవరణలో శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభుత్వం మైనార్టీలో పడుతుందనుకున్నప్పుడు అలాంటి అవకాశం కోసం ప్రతిపక్షం కాచుకుని కూర్చుంటుందని మేకపాటి అన్నారు. అయితే, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు విచిత్రంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. చంద్రబాబుకు వచ్చిన ప్రమాదం, బాధ అంతా శ్రీ జగన్మోహన్‌రెడ్డి అని మేకపాటి వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెడితే, ప్రభుత్వం పడిపోతే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఎక్కడ పట్టం కడతారో అని చంద్రబాబు హడలెత్తిపోతున్నారని ఎద్దేవా చేశారు. చేయలేక చేయలేక చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు నోరు మెదపక పోవడం విచిత్రమైన పరిస్థితిగా కనిపిస్తోందని మేకపాటి వ్యాఖ్యానించారు.
Back to Top