అసెంబ్లీ అధికారుల ఉదాసీన‌త‌

హైద‌రాబాద్‌) స‌మాచారాన్ని గోప్యంగా ఉంచుతూ అసెంబ్లీ అధికారులు చేస్తున్న సాగ‌తీత వ్య‌వ‌హారం బ‌య‌ట ప‌డింది. 
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఇంచార్జి కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి తదితరుల విద్యార్హతల్ని ప్ర‌శ్నిస్తూ వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి స‌మాచార‌హ‌క్కు క‌మిష‌న్ ను ఆశ్ర‌యించారు. దీనికి సంబంధించిన సమాచారం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తూ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ అసెంబ్లీ పీఐఓకు నోటీసులు జారీ చేశారు. జూలై 13వ తేదీన తన ముందు విచారణకు హాజరు కావాలని పీఐఓను ఆదేశించారు. వైఎస్సార్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వివ‌రాలు వెల్ల‌డించారు.

జ‌రిగింది ఏమిటంటే...
ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి   2015 నవంబర్ 10వ తేదీన సమాచార హక్కు చట్టం -2005 ప్రకారం పిటీష‌న్ పెట్టారు.  అసెంబ్లీలోని ఈ ఉన్నతాధికారులు పదో తరగతి నుంచి డిగ్రీ వరకూ చదువుకున్న వివరాలతో పాటు న్యాయశాస్త్రం పట్టాను వీరు ఎప్పుడు, ఎక్కడి నుంచి పొందారనే సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరారు.చట్ట ప్రకారం నెల రోజుల్లో ఇవ్వాల్సిన ఈ సమాచారాన్ని ఇవ్వ‌లేదు. ఆ తరువాత మళ్లీ 2016 ఫిబ్రవరిలో కూడా ఇదే సమాచారం కావాలని ఆయ‌న కోరారు.  త‌ర్వాత నాలుగు నెలలైనా ఇవ్వలేదన్నారు. అడిగినవి రహస్య పత్రాలేమీ కావని, అన్నీ కూడా పబ్లిక్ డాక్యుమెంట్లే కావ‌టం విశేషం. ఏడెనిమిది నెలలుగా ఇవ్వక పోయేటప్పటికి కమిషనర్‌ను ఆశ్రయించడంతో ఈ విషయమై ఏపీ శాసనసభ పీఐఓకు నోటీసులు జారీ చేసింది.

క‌మిష‌న్ ఉత్త‌ర్వులు 
ఎందుకు ఈ సమాచారాన్ని ఇవ్వలేదని వివరణ కోరుతూ జూలై 13న హాజరు కావాలని ఆదేశించినట్లు ఎమ్మెల్యే రామ‌కృష్ణారెడ్డి తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద ఒక భారతీయ పౌరుడు పబ్లిక్ డాక్యుమెంట్లను రుసుము చెల్లించి పొంద వచ్చని, ఒక ఎమ్మెల్యేగా తాను శాసనసభలో సమాచారాన్ని అడిగితే ఇవ్వడం లేదంటే ఏపీ శాసనసభ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శులు ఏ విధంగా పని చేస్తున్నారో అనేది స్పష్టం అవుతోందన్నారు. తాను అడిగిన సమాచారం కమిషన్ ముందైనా ఇస్తారని తాను ఆశిస్తున్నట్లు రామకృష్ణారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

Back to Top