అసెంబ్లీ సమావేశాల తీరు బాధాకరం: వైయస్ఆర్ సీపీ

హైదరాబాద్: అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించిన తీరును వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ అంశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించింది.  పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన సభాపక్ష ఉప నేత శోభా నాగిరెడ్డి మాట్లాడారు.  రోగి కోరిందే వైద్యం లాగా అసెంబ్లీని నడిపారని ఆమె ఎద్దేవా చేశారు. మహానేత వైయస్ఆర్ మరణానంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ అస్తవ్యస్థంగా తయారయ్యిందన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి వల్ల సమావేశాల నిర్వహణపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తొలిరోజు నిర్వహించిన బీఏసీ సమావేశంలో వైయస్ఆర్ సీపీ శాసన సభా పక్ష నాయకురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను చర్చించడానికి సభను కనీసం 15 రోజులు నిర్వహించాలని కోరారనీ,  కంటి తుడుపు చందంగా  ప్రభుత్వం సమావేశాలను ఒక రోజు అంటే అయిదు రోజులకు పొడిగించిందనీ ఆమె చెప్పారు. ఆ సమావేశానికి ఇటు ముఖ్యమంత్రి గాని, అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు గానీ హాజరుకాలేదనీ, వారు వచ్చి ఉంటే సమావేశాలు మరిన్ని రోజులు పొడిగించేందుకు అవకాశముండేదనీ ఆమె అభిప్రాయపడ్డారు. వారు రాని వైనం   ఆ పార్టీలకు సమావేశాలపై ఉన్న  ఆసక్తిని తేటతెల్లం చేసిందని పేర్కొన్నారు.  విద్యుత్తు, ఫీజు రియింబర్సుమెంటు, డీజిల్ ధర పెంపు, సిలిండర్ల సంఖ్య కుదింపు, తదితర అంశాలు చర్చించే అవకాశముండేదన్నారు. ఇలాంటి సమావేశాలను ఎప్పుడూ చూడలేదని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలపై తాము రోజు వాయిదా తీర్మానాలు ఇచ్చామన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ బాపూజీ మృతికి సంతాపం తెలపడం మినహా.. ఈ సమావేశాలలో జరిగిందేమీ లేదని శోభ తెలిపారు. 
నాయకత్వ లోపంతో వ్యవస్థ అస్తవ్యస్థం
మానవ తప్పిదాలు, సమర్థ నాయకత్వం లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ  వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందన్నారు.  వర్షాలు లేక పోవడం వల్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయిన విషయం తెలిసుండీ, కరెంటు కొనుగోలుకు చర్యలు తీసుకోలేదనీ,  ఇలా అన్ని విషయాల్లో ముందస్తు జాగ్రత్త చేపట్టనందునే ఈ పరిస్థితి ఏర్పడిందనీ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు లేకపోతే గతంలో డీజిల్ తో నైనా జనరేటర్లు నడుపుకుని పొలాలకు నీరందించుకునే వారనీ, డీజిల్ ధర  పెంపుతో ఇప్పుడా అవకాశం లేకపోయిందని చెప్పారు. కేంద్రం ధరలు పెంచితే  పక్క రాష్ట్రాల వారు రాయితీలిచ్చి ఆదుకుంటున్నారన్నారు.  ఇక్కడ మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'కేంద్రం పెంచింది.. మేము అమలు చేస్తాం' అన్న తీరులో వ్యవహరిస్తున్నారని శోభానాగిరెడ్డి ధ్వజమెత్తారు.  ముఖ్యమంత్రి గారూ! కేంద్రంలో ఉన్నది కూడా మీ పార్టీ  ప్రభుత్వమే కదా.. అడిగి సబ్సిడీ ఇవ్వచ్చు కదా?" అని ఆమె ప్రశ్నించారు.  ధరల పెంపు వల్ల 900 కోట్ల ఆదాయం లభిస్తోందన్నారు. మహానేత వైయస్ఆర్ జీవించి ఉండగా  ధరలు పెరిగినప్పుడు వాటిని భరించేలా రాయితీలిచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడలాంటి  స్పందన కనిపించడం లేదు. 
చంద్రబాబు నిలదీయకపోవడం దౌర్భాగ్యం
'సమస్యలపై చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయటం లేదు. అది మన దౌర్భాగ్యం'  అని శోభా నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ విషయంలో కాంగ్రెస్, చంద్రబాబు  శత్రువుకు శత్రువు మిత్రుడు సిద్ధాంతం పాటిస్తున్నారని ఆరోపించారు. మధ్యంతర ఎన్నికలు రావని ఆయన కాంగ్రెస్ కు భరోసా ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెసుకు ఓ పక్క ఊపిరిలూదుతూ, ధరలపై ధర్నాలు చేస్తున్న బాబు వైఖరి హాస్యాస్పదమన్నారు. భారత్ బంద్ లో ములాయం పక్కనే కూర్చుని బాబు ధర్నా చేశారన్నారు. అది అయిపోగానే ములాయం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారనీ,  ఆయనలాగే చంద్రబాబు రాష్ట్రంలో కాంగ్రెస్ కొమ్ముకాస్తున్నారనీ ధ్వజమెత్తారు.   మధ్యంతరం వచ్చే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారన్నారు.  మన్మోహన్ సింగ్ ను కలిసిన తర్వాత ఎంపీలను బయటకు పంపి ఎందుకు మాట్లాడారో చెప్పాలని డిమాండ్ చేశారు.  చిదంబరాన్ని కలిసిన అంశంపై తాను వేసిన ప్రశ్నకు సరైన స్పందన లేదన్నారు. ఇవి దేనికి సంకేతాలో ప్రజలకు అర్థమవుతోందని ఆమె స్పష్టంచేశారు.  కాంగ్రెస్ పార్టీ  సమాధానం చెప్పలేని పరిస్థతిలో ఉందన్నారు. ప్రాజెక్టులలో నీళ్ళుంచుకుని రైతాంగాన్ని ఎండబెడుతున్నారనీ వైయస్ఆర్ ఎమ్మెల్యేలు అడుగుతున్నామన్నారు.  దీన్నెలా అర్థం చేసుకోవాలని ఆమె ప్రశ్నించారు. ఖరీఫ్ కు ఎరువులు ఎంత అవసరం, నీళ్ళు ఎంత అవసరం, తదితర అంశాలపై  సమీక్ష లేదని వాపోయారు. తమ సమయాన్ని  పదవులు కాపాడుకోవడానికీ, ఢిల్లీకి వెళ్ళడానికీ  వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. 
ప్రతిపక్ష, అధికార పార్టీల కుమ్మక్కు వల్లే  ఇలా జరిగిందని అభిప్రాయపడ్డారు. సభ నడపండని అడగడానికి పోడియం దగ్గరికెళ్ళాం తప్ప అడ్డుకోవడానికి కాదని ఓ ప్రశ్నకు శోభ బదులిచ్చారు. తెలంగాణపై వైఖరిని ప్లీనరీలోనే చెప్పామనీ,  నిర్ణయం తీసుకోవల్సింది అధికారంలో ఉన్న కాంగ్రెసేననీ పేర్కొన్నారు . తెలంగాణపై గందరగోళానికి కాంగ్రెస్, దేశం పార్టీలే కారణమని చెప్పారు.  శాసన సభలో ఏ అంశమైనా చర్చకు రావల్సిందేనన్నారు. తెలంగాణ తీర్మానంపై ప్రభుత్వం తప్పించుకుని పారిపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. 

Back to Top