అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం: విజయమ్మ మద్దతు

హైదరాబాద్, ‌11 సెప్టెంబర్‌ 2012: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆ‌ర్.అంబేద్క‌ర్ విగ్రహాన్ని అసెంబ్లీ ఆవరణలో ప్రతిష్ఠించేందుకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ గౌర‌వ అధ్యక్షురాలు విజయమ్మ మద్దతు ప్రకటించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మంగళవారంనాడు విజయమ్మను లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసంలో కలుసుకున్నారు. అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు కృషి చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని విజయమ్మకు అందజేశారు. పార్లమెంటులో అంబేద్క‌ర్ విగ్రహం ఉందని.. అసెంబ్లీలో కూడా ‌ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేలా చూడాలని కవిత విజ్ఞప్తి చేశారు. దీనిపై విజయమ్మ స్పందిస్తూ అంబేద్కర్ మహాశయుడి విగ్రహ ప్రతి‌ష్ఠపనకు ఎవరికీ అభ్యంతరం ఉండరాదన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ తరపున ఈ విషయాన్ని సభలో ప్రస్తావించి, విగ్రహం ఏర్పాటు చేయాలని కోరతామని కవితకు విజయమ్మ హామీ ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ తన విజ్ఞప్తికి విజయమ్మ సానుకూలంగా స్పందించి, మద్దతు ప్రకటించారని ధన్యవాదాలు తెలిపారు.

Back to Top