హైదరాబాద్: రోహిత్ వేముల ఆత్మహత్య కేసులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ అప్పారావును రక్షించేందుకే రూపన్వాల్ కమిషన్ నివేదిక ఉపయోగపడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అరుణ్‌కుమార్ అన్నారు. రోహిత్ ఆత్మహత్యకు దారితీసిన కారణాలను వెతకాల్సిన కమిషన్ ఆయన కులాన్ని వెతికే ప్రయత్నం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దళితుడని రెవిన్యూ అధికారులు చెప్పినా.. రూపన్వాల్ కమిషన్ మాత్రం కాదని చెప్పడం దారుణమని అరుణ్ కుమార్ అన్నారు. శనివారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, దత్తాత్రేయలకు క్లీన్చిట్ ఇచ్చిన ఈ నివేదిక ఏకపక్షంగా ఉందని విమర్శించారు. కులవివక్షకు రోహిత్ బలయ్యాడనే విషయాన్ని పక్కనబెట్టి.. అతని కులం కోసం వెతకడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్య లేఖలో కులవివక్ష గురించి రోహిత్ రాసిన లేఖలు కమిషన్‌కు పట్టవా అని ఆయన ప్రశ్నించారు. ఎంతటి సామాజిక, కుల వివక్షకు గురయ్యారన్నది రోహిత్ లేఖ చూస్తే అర్థమవుతుందన్నారు. అయినా రోహిత్ ఎస్సీ అని ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ శాఖ గుంటూరు నుంచి ధ్రువీకరణ పత్రం ఇచ్చిందని, జాతీయ ఎస్సీ కమిషన్ కూడా నిర్ధారించిందన్నారు. అధికారాన్ని చేతిలోకి తీసుకొని రోహిత్ ఎస్సీ కాదని తేల్చడం దారుణమన్నారు. కమిషన్ అసలు విషయాలు మరిచి వీసీని రక్షించే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. కమిషన్ ఇచ్చిన నివేదిక వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుందని అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ఈ నివేదికను తిరస్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కమిషన్ నివేదికకు వ్యతిరేకంగా హెచ్‌సీయూ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు వైయస్ఆర్ సీపీ పూర్తి మద్దతిస్తుందని ఆరుణ్ కుమార్ స్పష్టం చేశారు.