అరెస్టు చేయాల్సింది ముఖ్యమంత్రిని: అంబటి

హైదరాబాద్, 15 ఏప్రిల్ 2013:

వివాదాస్పద జీవోల వ్యవహారంలో మోపిదేవి వెంకటరమణ మాదిరిగానే మిగిలిన ఐదుగురు మంత్రులను బలిపశువులను చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. వివాదాస్పద 26 జీవోల విషయంలో కోర్టులో ఒక మాట, బయట మరో మాట చెబుతున్నారని ఆయన చెప్పారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్  ప్రవేశ పెట్టిన పథకాలు ఆయనవి కాదంటున్న ప్రభుత్వం వివాదస్పద జీవోలు మాత్రం ఆయనవేనని చెప్పడాన్ని అంబటి తప్పుబట్టారు. నీచమైన రాజకీయ కుట్రలతో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని మరింత కాలం జైల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిరాశ, నిస్పృహతో తమ పార్టీపై కాంగ్రెస్ కుతంత్రాలకు పాల్పడుతోందన్నారు. కాంగ్రెస్ కుట్రలను ఓటు అనే శతఘ్నితో ప్రజలు తిప్పికొడతారని అంబటి హెచ్చరించారు. సీబీఐనీ, కోర్టులను ప్రభావితం చేసేలా మంత్రులచేత మాట్లాడిస్తున్న సీఎంను అరెస్టుచేయాలని ఆయన డిమాండు చేశారు.

విలేకరుల సమావేశం పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...
 'రెండు మూడురోజులుగా కాంగ్రెస్ పార్టీ ఓ విచిత్రమైన వాదనని వినిపిస్తోంది. సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జిషీటు దాఖలు చేశాకా ఈ అంశం వెలుగులోకి వచ్చింది. సబిత, ధర్మాన ప్రసాదరావులు సాక్షులను ప్రభావితం చేయరనీ, వీరికి కోర్టుకు హాజరు కావాలనే సమన్లతో సరిపెట్టవచ్చనీ సీబీఐ సీబీఐ మెమో దాఖలు చేసింది. మోపిదేవి పది నెలలుగా జైలులో ఉన్నారు. 26 జీవోల విషయంలో ఆయన కూడా సంతకం చేసిన వ్యక్తే. ఆయన అభిమానులంతా మోపిదేవిని మోసం చేసి జైలులో ఉంచారని బాధపడుతున్నారు. రాజశేఖరరెడ్డిగారు సంతకం చేయమంటే మంత్రులంతా కళ్ళు మూసుకుని జీవోలపై సంతకం పెట్టారని మంత్రి ఆనం కొత్తగా రాక్షస రాగాన్ని ఆలపిస్తున్నారు. రాజశేఖరరెడ్డిగారు మరణించి మూడేళ్ళ ఎనిమిదినెలల పదిరోజులయ్యింది. ఇన్నేళ్ళలో ఈ మంత్రుల ఒక్కసారి కూడా తాము కళ్ళు మూసుకుని సంతకం పెట్టామని చెప్పారా? ఈ కేసులో నిందితులయిన సబిత, ధర్మాన ప్రసాదరావు ఈ విషయం ఇన్నాళ్ళలో ఎక్కడా అనలేదు.

సుప్రీం కోర్టులో నెల్లూరుకు చెందిన ఓ న్యాయవాది ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసినపుడు 'ఈ జీవోల విషయంలో ఎటువంటి తప్పిదమూ లేదని' ఆ మంత్రులు అఫిడవిట్ వేశారు. బిజినెస్ రూల్సు ప్రకారమే అంతా చేశామని స్పష్టంచేశారు. ఇప్పుడు బొత్స, పార్థసారధి కలిసి ఈ జీవోలతో మంత్రులకేమీ సంబంధం లేదంటున్నారు. ఈ భిన్నమైన వైఖరులకు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పి తీరాలి. జగన్మోహన్ రెడ్డిగారిని దోషిగా చూపించాలనీ, ఎక్కువ కాలం జైలులో ఉంచాలనీ చూసేందుకు చేసే కుట్రలో భాగంగానే పొంతనలేని విధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న వారిని చూసి రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తలదించుకుంటోంది. 

సీఎంను అరెస్టుచేయాలి
డాక్టర్ వైయస్ఆర్ కుటుంబాన్ని ఉరి వెయ్యాలి.. వెలి వెయ్యాలి అని మంత్రి ఆనం వ్యాఖ్యానించిన మరుసటి రోజునే సొంత తమ్ముడే ఆయన్ని వెలివేశారు. పైకి తీసుకొచ్చిన రాజశేఖరరెడ్డిగారి గురించి అలా మాట్లాడడం తప్పని ఆనం తమ్ముడే మాట్లాడారు. మంత్రులను జైలుకు వెళ్ళకుండా మీరు సీబీఐని ప్రభావితం చేయవచ్చు. చంద్రబాబు మీ ప్రభుత్వాన్ని కాపాడుతుండవచ్చు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇవేవీ మిమ్మల్ని కాపాడలేవు. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మిగిలిన ఐదుగురు మంత్రులను కూడా బలిపశువులను చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే బొత్స, తదితరులు జీవోల వ్యవహారంపై మాట్లాడుతున్నారు. హైకోర్టులో ఈ జీవోల గురించి ఎటువంటి అఫిడవిట్ వేయని మీరు సుప్రీం కోర్టులో మాత్రం అవన్నీ చట్టబద్ధంగా చేసినవేనని రాత ప్రతిని సమర్పించారు. వాస్తవం ఇలా ఉంటే మిగిలిన మంత్రులు అందుకు వ్యతిరేకంగా మాట్లాడటం వెనుక జగన్మోహన్ రెడ్డిగారిని జైలు బయటకు రాకుండా చేయాలనే కుట్ర దాగుంది. మిగిలిన ఐదుగురు మంత్రులనూ బలిచేయడానికి పూనుకుంటున్నారనేది స్పష్టమైంది. సీబీఐని, న్యాయస్థానాలనూ ప్రభావితం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు. కోర్టుల్లో ఒక రకంగా, బయటోరకంగా మాట్లాడటమే దీనికి నిదర్శనం. రాజశేఖరరెడ్డిగారు సంతకం పెట్టమంటే పెట్టామని చెప్పండనే భావన వారిలో కలిగేలా ప్రవర్తిస్తుండమే దీనికి ఉదాహరణన్నారు. ఇందుకు కారణమైన ముఖ్యమంత్రినీ, లేదా ఆనం, లేదా బొత్సను అరెస్టు చేయాలి.  వీరిని వదిలి జగన్మోహన్ రెడ్డిని నిర్బంధించడం దురదృష్టకరం. రాజశేఖరరెడ్డిగారు మరణించిన తర్వాత సున్న నుంచి 17 స్థానాలకు ఎదిగిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రజాదరణ పొందింది ఆ విషయాన్ని బొత్స మరువకూడదు.

ప్రస్తుతం అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఎన్నికలకు వెళ్ళడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోంది. గతానుభవాలే ఇందుకు కారణమై ఉంటాయి. పథకాలు రాజశేఖరరెడ్డిగారివి కావట.. జీవోలు మాత్రం ఆయనవట. జగన్మోహన్ రెడ్డిగారు ప్రభావితం చేయడం వల్ల జీవోలు వచ్చాయని నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇందుకు ప్రజలు సరైన సమయంలో సరైన సమాధానం చెబుతారు.

జగన్ను కలిసేందుకు వీల్లేదని ఏ చట్టం చెబుతోంది
రాజశేఖరరెడ్డిగారు ఉండగానే రేషను కార్డులను తగ్గించేశారని డీకే అరుణ చెప్పారంటూ.. ఆయనుండగా ఆమె ఏమన్నారో వివరించే వార్త ప్రతిని చూపించారు. జగన్మోహన్ రెడ్డిగారు జైలులో ఉన్నా పార్టీ చెక్కుచెదరలేదు. పార్టీ సాధిస్తున్న విజయాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చివరి దశలో గావుకేకలు వేస్తోంది. జగన్మోహన్ రెడ్డి జైలులో ఉండి రాజకీయాలు చేస్తున్నారని మరో మంత్రి అంటున్నారు. ఆయనకేమీ శిక్ష పడలేదే. శిక్ష పడనంత కాలం ఆయన ఎవరినైనా కలవవచ్చు. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ఆయన విచారణలో మాత్రమే ఉన్నారు. సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ఒకేఒక్క వంకతో జగన్మోహన్ రెడ్డిగారిని జైలులో ఉంచారు. ఆయన ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు. ఆయన్నెవరూ కలవడానికి వీల్లేదని ఏ చట్టం చెబుతోంది.? ఆ హక్కు ఆయనకు లేదని ఏ రూల్ చెబుతోంది? విచారణలో ఉన్న ఖైదీకి అన్ని సౌకర్యాలు ఉంటాయన్న జైలు నిబంధనలు తెలియని కొందరు  నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయాలు చేసే హక్కు ఆయనకుందని చెబుతున్నా.. లేదని నిరూపించాలని సవాలు చేస్తున్నా.'

Back to Top