పుష్కరాల సమయంలో అధికారుల తీరు ఇలా సాగుతోంది. మొదటి రోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుటుంబ సమేతంగా పూజలు చేస్తుంటే అధికార యంత్రాంగం అక్కడే గుమిగూడింది. తర్వాత తొక్కిసలాట జరిగి, 27 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాక, ఇప్పుడు కళ్లు తెరచుకొన్నారు. ఇప్పుడు మాత్రం అత్యుత్సాహం చూపిస్తున్నారు. క్యూలైన్లలో భక్తుల్ని పంపించటం దగ్గర నుంచి, వాహనాల నిలిపివేత దాకా ఆంక్షల పర్వం కొనసాగుతోంది. వృద్ధుల్ని కూడా అనుమతించక పోవటంతో జన ఇబ్బందులు పడుతున్నారు.పుష్కర స్నానం ఆచరించిన పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ ఇదే మాట అన్నారు. ఈ హడావుడి చూస్తుంటే అత్యుత్సాహం ఎక్కువ అయినట్లుగా కనిపిస్తోందని అన్నారు. అధికారుల వైఖరి మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. పుష్కరాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనదైన ముద్ర వేసుకొనేందుకు ప్రయత్నించి విఫలం అయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.