ప్రత్యేక హోదా కోసం షూ పాలీస్‌

అనంతపురం : రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బుధవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానిక టవర్‌క్లాక్‌ సమీపంలో బూట్లు పాలీస్‌ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం, రాష్ట్ర ప్రధానకార్యదర్శి మద్దిరెడ్డి నరేంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం  జరుగుతున్న కేంద్ర బడ్జెట్‌  సమావేశాల్లో ఏపీకి ప్రత్యేక హోదా తీర్మానం చేయాలని డిమాండ్‌ చేశారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్రమోది, వెంకయ్యనాయుడు, చంద్రబాబు కలిసి ప్రత్యేక హోదా కల్పించి తెలుగు ప్రజలను ఆదుకుంటామని హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని అణచివేసేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రత్యేక ప్యాకేజీ అంటూ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా బాధ్యతగా వ్యవహరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అని మాట్లాడడం బాధాకరమన్నారు. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా జపం చేసిన చంద్రబాబు ఈరోజు ఎందుకు మాట మార్చుతున్నారో ప్రజలకు అర్థమవుతోందన్నారు. ఓటుకు రూ.కోట్లు కేసు నుంచి బయట పడడానికి కేంద్రం వద్ద రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు రఫి, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దన్న, లోకేష్, నవీన్, ఎస్కేయూ కమిటీ అధ్యక్షులు భానుప్రకాష్‌రెడ్డి, చరణ్, షారుఖాన్, షకీల్, దాదు, వీరేష్, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

Back to Top